‘బర్రే’ గృహ నిర్భంధానికి నేతల సంఘీభావం

0
708
రాజమహేంద్రవరం, జూలై 26 : నగర శివారులో ఉన్న క్వారీగోతులను పూడ్చకుండా వాటి యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆక్షేపణీయమని శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు అన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని.. క్వారీ గోతులను పూడ్చేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని యర్రా స్పష్టం చేసారు. క్వారీ గోతులను పూడ్చాలని డిమాండ్‌ చేస్తూ బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేషన్‌ మాజీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ బర్రే కొండబాబు చేపట్టిన స్వచ్ఛంద గృహ నిర్భందం నేడు 4వ రోజుకి చేరుకుంది. శాప్‌ డైరెక్టర్‌ యర్రా, సిసిసి ఎండి పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్‌ ప్రసాదుల హరనాధ్‌, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధరరావు తదితరులు బర్రే ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యర్రా మాట్లాడుతూ క్వారీ వాసుల సమస్యను పరిష్కరించేందుకు సహకరిస్తామని వెల్లడించారు. ఈ గోతుల్లో పడి చాలా మంది మృత్యువాత పడుతున్నారని, ఇటీవల ఒక బాలుడు కూడా మృతిచెందడం బాధాకరమన్నారు. యజమానుల బాధ్యతరాహిత్యం కారణంగానే ఈ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. బర్రే కొండబాబు క్వారీ గోతులను పూడ్చాలని సుదీర్ఘ పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం బాధితుల పక్షాన నిలబడుతుందన్నారు. హైకోర్టు వెంటనే క్వారీ గోతులను పూడ్చేలా చర్యలు తీసుకోవాలని ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోకపోతే ఎలాగని ప్రశ్నించారు. అవసరమైతే తాము కూడా పోరాటం చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఇటువంటి సామాజిక సమస్యల పరిష్కారానికి అందరూ ముందుకు రావాలని కోరారు. వాసంశెట్టి మాట్లాడుతూ బర్రేకు మద్ధతుగా నిలుస్తామని.. ఆయనకు అండగా ఉండి పోరాటం సాగిస్తామన్నారు. మరుకుర్తి రవియాదవ్‌, హరి బెనర్జీ, సిటి ఐఎన్‌టియుసి అధ్యక్షుడు తాడేపల్లి యేసు, సెక్రటరీ తొండా నరసింహం, ఉపాధ్యక్షుడు తాడేపల్లి ఉపేంద్ర, ధనరాజు తదితరులు బర్రేకు మద్ధతు తెలిపారు. రిలేదీక్షలను కార్పొరేటర్‌ బర్రే అను హెలెనియా, బర్రే మరియ, పల్లా హానీ 4వ రోజు దీక్షను ప్రారంభించారు. పండాటి వీరలక్ష్మి, మలక వరలక్ష్మి, బండి నూకరత్నం, రెల్ల పద్మ, నగరి లక్ష్మి, కాళేపు సుజాత, లక్కోజీ రాజీ, దడాల కుమారి, తాడేపల్లి సుశీల, మందపల్లి సుజాత దీక్షలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here