బలాన్ని ప్రదర్శించి..భవిష్యత్‌ను ఆవిష్కరించి..

0
205
జయహో బీసీ సదస్సుకు రంగం సిద్ధం – కదనోత్సాహంలో తెదేపా శ్రేణులు
పసుపువర్ణమయంగా మారిన గోదావరి తీరం – ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు
రాజమహేంద్రవరం,జనవరి 26 : వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాల్లో తనకున్న పట్టును మరో మారు నిరూపించుకునేందుకు తెలుగుదేశం పార్టీ సమాయాత్తమైంది. అందుకు రాజమహేంద్రవరంలో రేపు జరగనున్న ‘జయహో బీసీ’ సదస్సు వేదిక కానుంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న నేపధ్యంలో బీసీల సంక్షేమానికి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలను ఆవిష్కరించేందుకు’దేశంలో సగం-తెలుగుదేశంతో మనం’ పేరిట నిర్వహిస్తున్న ఈ సదస్సును తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్న ఈ సదస్సుకు వేదికైన ప్రభుత్వ ఆర్ట్సు కళాశాల మైదానంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సదస్సును పురస్కరించుకుని  వివిధ ముఖ్య కూడళ్ళలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు, స్వాగత ద్వారాలు ఏర్పాటు చేయడంతో నగరంలో సందడి వాతావరణం నెలకొంది. నగరమంతా పసుపు వర్ణమయంగా మారింది. సీఎంతో పాటు పలువురు మంత్రులు, పార్టీ బీసీ నాయకులు హాజరు కానున్న ఈ సదస్సు ఏర్పాట్లను పార్టీ ఏపీ విభాగం అధ్యక్షులు, మంత్రి కిమిడి కళా వెంకట్రావ్‌, ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పలతో పాటు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు,  గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, శాప్‌ డైరక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు,  ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి తెదేపా యువ నాయకుడు ఆదిరెడ్డి వాసు, రూరల్‌ నాయకులు గంగుమళ్ళ సత్యనారాయణ, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీ విజయంలో కీలక భాగస్వామ్యులుగా ఉన్న బీసీలపై తమకున్న అభిమానాన్ని చాటుకుని వారికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు వారి సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాలను వివరించి భవిష్యత్తులో వారి సంక్షేమానికి చేపట్టే పథకాలను ఈ సదస్సు ద్వారా ప్రకటించి వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయంలో బీసీల మద్ధతు కూడగట్టుకునేందుకు తెదేపా ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. సదస్సుకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నా ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి జన సమీకరణ చేయడంపై దృష్టి సారించారు. తొలుత అన్ని జిల్లాల నుంచి జన సమీకరణ చేయాలని భావించినా ఆ ప్రయత్నాన్ని విరమించుకుని ఉభయ గోదావరి జిల్లాల నుంచే జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.  దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వెనుకబడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన వారిని సదస్సుకు తరలించే ప్రయత్నాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు  తలమునకలై ఉన్నారు. ఈ సదస్సును రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించి రాత్రి ఏడు గంటలలోగా పూర్తి చేయాలని తెదేపా నాయకులు భావిస్తున్నారు. సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రేపు మధ్యాహ్నం నగరానికి చేరుకుని రాత్రి తిరిగి అమరావతి బయలుదేరి వెళతారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు త్వరగా గమ్యాలకు చేరుకునే విధంగా రాత్రి ఏడు గంటలకే సదస్సు ముగింపజేయాలని భావించడంతో మధ్యాహ్నం 2 గంటలకే నాయకుల ప్రసంగాలను ప్రారంభించి సీఎం చంద్రబాబు ప్రసంగం కూడా ఏడు గంటలలోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు.  సదస్సు విజయవంతానికి ఇప్పటికే జిల్లాల వారీగా బీసీ సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సమన్వయపర్చడంతో పాటు ప్రతినిధులను ఎంపిక చేశారు. ఈ సదస్సులో బీసీ సంఘాల నాయకులతో పాటు పార్టీలోని బీసీ నేతల ప్రసంగాలకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. సదస్సుకు జన సమీకరణపై ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులను, పార్టీ నేతలను సమన్వయం చేసుకున్న తెదేపా ఈ సదస్సు ద్వారా వచ్చే ఎన్నికలకు సమర శంఖారావం పూరించేందుకు తూర్పు సెంటిమెంట్‌గా రాజమహేంద్రవరం సభను విజయవంతం చేయడంపై దృష్టి సారించింది. అందుకు నగరంతో పాటు నియోజవర్గాల్లో సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు.
వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు
జయహో బీసీ సదస్సు దృష్ట్యా నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌ యంత్రాంగం చర్యలు చేపట్టింది. విశాఖపట్నం, కాకినాడ వైపు నుంచి వచ్చే బస్సులు లాలాచెరువు వైపు నుంచి వచ్చే వాహనాలు జైలు రోడ్డు మీదుగా సభాస్ధలికి దగ్గరలోని సీటీఆర్‌ఐ వద్ద ప్రజలను దింపి అనంతరం లాలాచెరువు హౌసింగ్‌ బోర్డు కాలనీ వద్ద బీఎంపీఎస్‌ గ్రౌండ్స్‌లో పార్కింగ్‌ చేసుకోవలసి ఉంటుంది. కార్లు లాలాచెరువు,జైలు రోడ్డులోని సీటీఆర్‌ఐ కూడలిలో  ప్రజలను దింపి వెనుక్కి తిప్పి ఆర్టీవో కార్యాలయం వద్ద ఎఫ్‌సిఐ గోడౌన్స్‌లో పార్కింగ్‌ చేసుకోవాలని,  ఆటోలు, ద్విచక్రవాహనాలు లాలాచెరువు నుంచి జైలు రోడ్డు మీదుగా సీటీఆర్‌ఐ వద్ద సమీపంలోని జీవకారుణ్య సంఘంలో పార్కింగ్‌ చేసుకోవలసి ఉంటుంది. అలాగే విజయవాడ, ఏలూరు, రావులపాలెం, కడియం వైపు నుంచి వచ్చే వాహనాలు, నిడదవోలు, ధవళేశ్వరం, రోడ్డు కం రైలు వంతెన మీదుగా వచ్చే వాహనాలు పోలీస్‌ శాఖ సూచించిన నిర్ధేశిత ప్రదేశాల్లో పార్కింగ్‌ చేయవలసి ఉంటుందని పోలీస్‌ అధికారులు తెలిపారు. కాగా వీఐపీ వాహనాల పార్కింగ్‌కు కూడా పోలీస్‌ యంత్రాంగం చర్యలు చేపట్టింది.  అలాగే నగరంలో కూడా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పోలీస్‌ బలగాలను బందోబస్తు నిమిత్తం తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here