బాబు మళ్ళీ వస్తేనే భావి తరాలకు భవిష్యత్తు 

0
513
ఆటోలకు ‘మళ్ళీ నువ్వే రావాలి’ స్టిక్కర్ల అతికింపులో గుడా చైర్మన్‌ గన్ని
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 8 : విభజన కారణంగా కుక్కలు చింపిన విస్తరిలా మారిన రాష్ట్రాన్ని ప్రధాని మోడీ మొండి చేయి చూపినా, ప్రతిపక్షాలు దగాకోరు రాజకీయాలు చేసినా మొక్కవోని దీక్షతో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబునాయుడును రానున్న ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకుంటేనే  భావి తరాలకు భవిష్యత్తు ఉంటుందని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. టీఎన్‌టీయూసి నాయకులు, నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణీశ్వరరావు ఆధ్వర్యంలో గన్ని కృష్ణ యువసేన ముద్రించిన ‘మళ్ళీ నువ్వే రావాలి’ పోస్టర్‌ను ఆవిష్కరించి వందల ఆటోలకు అతికించారు. స్ధానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వందలాదిమంది ఆటో కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన చంద్రబాబు నాయకత్వాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయని, అందులో భాగంగానే యువతలో ‘మళ్ళీ నువ్వే రావాలి’ అనే నినాదం వచ్చిందన్నారు. గన్ని కృష్ణ యువ సేన ఆధ్వర్యంలో ఐదువేల పోస్టర్లను సిద్ధం చేసి ఆటోలకు అతికిస్తున్నారని, ఈ నినాదాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్ళే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విభజన కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి దిక్కు మొక్కు చంద్రబాబేనని, ఆయన వలనే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఇబ్బందులు పెట్టినా అచంచల ఆత్మ విశ్వాసంతో రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఇంటింటికీ పెద్ద కొడుకై రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ నువ్వే రావాలి అనే నినాదం అందరిలోనూ వినిపిస్తోందన్నారు.  రెడ్డి మణి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి చంద్రబాబు పెద్ద పీట వేశారని, ఆయన వెంటే కర్షక లోకం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కరుటూరి అభిషేక్‌, ఉప్పులూరి జానకిరామయ్య, మళ్ళ వెంకట్రాజు, కార్మిక నాయకులు నాగులాపల్లి సోమేశ్వరరావు, పి. నాగ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here