బిజెపి తరఫునే పోటీ చేస్తా

0
323

పార్లమెంట్‌కా? అసెంబ్లీకా అన్న విషయం పార్టీ నిర్ణయిస్తుంది

చేసింది…చేయబోయేది చెప్పి ప్రజల్లోకి వెళతాం

ప్రజల సానుభూతి కోసమే చంద్రబాబు నాటకాలాడుతున్నారు

నా హయాంలోనే స్టేడియం పనులకు శ్రీకారం : సిటీ ఎమ్మెల్యే ఆకుల

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 9 : వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫునే పోటీ చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, సిటీ ఎమ్మెల్యే డా. ఆకుల సత్యనారాయణ స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్‌కు పోటీ చేయాలా? లేక తిరిగి అసెంబ్లీకే పోటీ చేయాలా? అనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. ది రాజమండ్రి ప్రెస్‌క్లబ్‌ ఈరోజు ఉదయం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీలో చేరబోతున్నారన్న ఊహాగానాలకు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి తరఫునే పోటీ చేస్తానని,అయితే ఎంపిగా పోటీ చేస్తానో? ఎమ్మెల్యేగా పోటీ చేస్తానో? అన్న విషయాన్ని పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బిజెపికి ఎదురుగాలి వీస్తోందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రానికి కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలోని ప్రభుత్వం చేయగలిగిన సహాయాన్ని చేస్తోందని, చేసిన సహాయాన్ని చెప్పుకుని, చేయబోయే సహాయాన్ని వివరించే ప్రజల్లోకి వెళతామని, అదే సమయంలో కేంద్రం చేసిన సహాయాన్ని మరుగునపర్చి చేస్తున్న సహాయాన్ని తిరస్కరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలను, ఆడుతున్న రాజకీయ క్రీడను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా విభజన చట్టంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ పథకం ప్రకారం విష ప్రచారం చేస్తూ ఏమీ చేయలేదని చెబుతున్నారని, చేస్తానన్న సహాయాన్ని కూడా తిరస్కరిస్తూ వీలు కాని ప్రత్యేక హోదాపైనే పట్టుబడుతోందని ఆయన అన్నారు. గతంలో హోదాకు బదులు ప్యాకేజీకి అంగీకరించి ఇపుడు తమ రాజకీయ ప్రయోజనాల కోసం యూ టర్న్‌ తీసుకున్న చంద్రబాబు తిరిగి హోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ పట్టుపడుతున్నారని, తమపై వ్యతిరేకత రాకుండా ప్రజలను మభ్యపెడుతూ కేంద్రాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఈ మడత పేచీలన్నింటిని ప్రజలకు వివరిస్తామని, రాజకీయ క్షేత్రంలో అంతిమ తీర్పునిచ్చేది ప్రజలేనని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబు నిలకడ లేని విధానాలతో ప్రజలకు, రాష్ట్రానికి కూడా అవస్ధలేనని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ ఆ నిర్ణయం తీసుకున్నారని, అలాగే జీఎస్టీ వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయని, అయితే ప్రతిపక్షాలు వీటిపై దుష్ప్రచారం చేసి బిజెపిని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనాలు పొందాలని యత్నిస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి కసరత్తు

నగరంలో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే ఆకుల తెలిపారు. అమృత్‌ పథకం, 14 వ ఆర్ధిక సంఘం నిధులు, ఇతరత్రా నిధులతో డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసి ముంపు బెడద లేకుండా చూడటంతో పాటు గోదావరిలో మురుగు నీరు కలవకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. గోదావరి జలాల్లో మురుగునీరు కలవకుండా వాటిని శుద్ధి చేసి ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన గోదావరిలో కలిసేలా అమృత్‌ పథకం ద్వారా ఓ కార్యాచరణను సిద్ధం చేశామని, ఇందుకు రూ. 83 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశామన్నారు. అలాగే నగరంలో ఇళ్ళు లేని పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్‌లతో పాటు తాను శ్రీరామపురం వద్ద ఓ ప్రత్యేక గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టినట్లు తెలిపారు. పేదలకు గృహాల కేటాయింపు కూడా పారదర్శకంగా జరిగేలా చూస్తున్నామన్నారు. హృదయ్‌ పథకం ద్వారా నగర చారిత్రక సంపద పరిరక్షణకు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని, అందులో భాగంగా హేవ్‌లాక్‌ వంతెనతో పాటు గోదావరి లంకలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. నగరంలోని చారిత్రక గౌతమీ ప్రాంతీయ గ్రంథాలయానికి రూ. 2 కోట్ల స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌తో పాటు ఎంపీ గ్రాంట్‌ రూ. 75 లక్షలతో నూతన భవనాలను నిర్మిస్తూ అమూల్య గ్రంథ సంపదను పరిరక్షించడానికి డిజిటలైజేషన్‌ ప్రక్రియను చేపట్టి ఇంతవరకు 3,500 గ్రంథాలను డిజిటలైజేషన్‌ చేశామన్నారు. కొత్త మాష్టర్‌ ప్లాన్‌ ఆమోదించడంతో పెరిగిన నగర విస్తీర్ణం, జనాభా అవసరాలకు అనుగుణంగా మంచినీటి సరఫరా ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

నా హయాంలోనే స్టేడియం పనులకు శ్రీకారం

నగరానికి క్రీడా స్టేడియం లేని కొరత నేటికీ తీరలేదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారిపై మోరంపూడి జంక్షన్‌కు సమీపంలో ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూలు వద్ద సేకరించిన 16 ఎకరాల ప్రైవేట్‌ స్థలంలో స్టేడియాన్ని నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలు మరో రెండు నెలల్లో కార్యరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని, తన హయాంలోనే అందుకు శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నానని ఎమ్మెల్యే చెప్పారు. అలాగే వ్యవసాయ కళాశాల భవనాలకు గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఎం వెంకయ్యనాయుడు సహకారంతో నగరంలోని సీటిఆర్‌ఐ వద్ద 23 ఎకరాల స్ధలాన్ని సేకరించి అందజేశామని, నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి, ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య కూడళ్ళలో రూ. 950 కోట్లతో 5 ఫ్లై ఓవర్లను నిర్మించనున్నారని, ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఈ ఫ్లైఓవర్లు వచ్చే రెండుమూడేళ్ళలో పూర్తవుతాయని ఆయన తెలిపారు.

అవినీతి మరక అంటని వారెవరైనా ఉంటే నేనొక్కడినే

శాసనసభ్యుల్లో అవినీతి మరక అంటని వారెవరైనా ఉంటే తానొక్కడినేనని ఎమ్మెల్యే ధీమాగా చెప్పారు. ఇసుక అక్రమాల గురించి ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టడానికి తానే ఆద్యుడినని సగర్వంగా చెప్పుకోగలనని, అయితే ఉచిత ఇసుక విధానంలో లోపాలు సరిదిద్ది ప్రజలకు సక్రమంగా అందేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఉచిత ఇసుక విధానంలో అవినీతితో తనకేమీ సంబంధం లేదన్నారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కుడుపూడి పార్ధసారథి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సెక్రటరీ జె.గణపతి స్వాగతం పలుకగా సీనియర్‌ పాత్రికేయులు జీఏ భూషణ్‌బాబు, బిజెపి నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here