బీసీ మెరిట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలి

0
96
సబ్‌ కలెక్టరేట్‌ వద్ద బీసీ సంఘం ధర్నా
రాజమహేంద్రవరం, ఆగస్టు 13 : సుప్రీంకోర్టు ధృవీకరించిన జిఓ నెం.550ని ఎన్టీఆర్‌ విశ్వ విద్యాలయం అధికారులు వక్రీకరించి రిజర్వేషన్‌ వర్గాలకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేతలు ధ్వజమెత్తారు. బీసీ విద్యార్థులకు నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నా విశ్వవిద్యాలయం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు గోలి రవి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. బీసీ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మజ్జి అప్పారావు, రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు కడలి వెంకటేశ్వరరావు, తూర్పు గోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దాస్యం ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు. దేశంలోని మెడికల్‌ కళాశాలలతో పాటు ప్రొఫెషనల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అమలుపరచాల్సిన విధానంపై స్పష్టమైన తీర్పు చెప్పిందన్నారు. ఓపెన్‌ కాంపిటీషన్‌లో 50 శాతం, రిజర్వేషన్‌ కేటగిరీలకు 50 శాతం స్థానాలు కేటాయిస్తూ ఇందిరా సహానీ కేసులో తీర్పు అమలు చేయాల్సి ఉందన్నారు. రిజర్వేషన్‌ వర్గాల అభ్యర్ధి ఎస్సీ, ఎస్టీ, బిసిలు ఓసిలో సీటు సాధించగలిగితే పరిస్థితులను బట్టి అభ్యర్ధికి మంచి కళాశాల, మంచి సబ్జెక్టు ఓసిలో దక్కనప్పుడు తన ఆర్‌సి కేటగిరీలోకి వచ్చి అక్కడి మెరిట్‌ విధంగా కాలేజీని, సబ్జెక్టును ఆప్షన్‌ ఎంచుకుఏ అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించిందన్నారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వ విద్యాలయం అధికారులు 2019-20 విద్యా సంవత్సరంలో జిఓనెం.550ని వక్రీకరించి సొంత భాష్యం చెప్పి రిజర్వేషన్‌ వర్గాలకు నష్టపరంగాను, ఆధిపత్య కులాలకు అక్రమలబ్ధి చేకూర్చే విధంగా అమలు జరిపారని మండిపడ్డారు. అధికారులు ఓసి స్థానాలన్నింటిని భర్తీ చేయకుండానే ఆర్‌సి స్థానాలు నింపే చట్టవ్యతిరేక పద్ధతిని చేపట్టారని ఆరోపించారు. ప్రిన్సిపల్‌ ప్రధాన కార్యదర్శి ద్వారా కూడా రిజర్వేషన్‌ వర్గాలకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికే ఎంబిబిఎస్‌ సీట్లు కేటాయించడం, తరగతులు జరుగుతున్నాయన్నారు. అత్యవసర చర్యలు తీసుకుని బీసీ మెరిట్‌ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుని జిఓ 550ను యధాథంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేసారు. మజ్జి అప్పారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బీసీలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అలాగే బీసీ మెరిట్‌ విద్యార్థులకు న్యాయం చేసేలా చూడాలని కోరారు. అనంతరం సబ్‌కలెక్టర్‌కు వినతి పత్రం అందచేసారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బిల్డర్‌ చిన్నా, సుభాషిణి, ముంతా సుమతి, పెరుమాళ్ల అశోక్‌బాబు, కట్టా సూర్యప్రకాశరావు, పెరుమాళ్ల లక్ష్మి సుజాత, రేలంగి కృష్ణకుమారి, పుల్లేటికుర్తి జగన్నాధం, దోనేపూడి రుక్మాంగధరావు (రుక్కు), దొమ్మేటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here