బురద చల్లాలని చూస్తే బుద్ది చెబుతాం

0
317
అమ్మమ్మకు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
భూ వివాదంపై స్పష్టత ఇచ్చిన జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం,సెప్టెంబర్‌ 9 : సహనాన్ని చేతకానితనంగా చూస్తే సహించేది లేదని అంతకు పదిరెట్లు అనుభవించాల్సి వస్తుందని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా హెచ్చరించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరరాయపురం గ్రామంలో తాను భూకబ్జాకు పాల్పడ్డానని కోనసీమ ప్రాంతంలో కొందరు కిరాయి మనుషులు అసత్య ప్రచారాన్ని సాగిస్తున్నారని, ఫ్లెక్సీలు పెట్టి తనను అల్లరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. భూ కబ్జా చేశానన్నా వాదనలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. 1957లో తన తాత అయిన కొమ్ముల  చక్రపాణి 18.50 ఎకరాల భూమిని శాస్త్రి అనే ఆయన వద్ద కొనుగోలు చేశారని తెలిపారు. ఆయనకు ఉన్న నలుగురు సంతానంలో ఒకరైన తన తల్లి జక్కంపూడి విజయలక్ష్మికి పసుపు-కుంకుమ కింద 1984లో దానపట్టా కింద ఒక ఎకరా 70 సెంట్లు భూమి ఇచ్చారని తెలిపారు. అయితే ఆ భూమిని 1994లో ఇద్దరు అన్నదమ్ములకు విక్రయించినట్లు తెలిపారు. తన తాత అయిన కొమ్ముల చక్రపాణి అవసరాల కోసం ఆయనకు ఉన్న భూమిలో అప్పుడప్పుడు అమ్మకం చేశారని, అయితే ఆ భూమిలో ఒక ఎకరా 23 సెంట్లు భూమి మాత్రమే ప్రస్తుతం ఉందన్నారు. ఆ భూమి జాతీయ రహదారిని అనుకుని ఉండటంతో తన తల్లి జక్కంపూడి విజయ లక్ష్మి నుంచి 70 సెంట్లు భూమిని కొనుగోలు చేసుకున్న వ్యక్తి తన భూమి జాతీయ రహదారిని ఆనుకున్న ఉన్న భూమిలో ఉందని కోర్టుకు వెళ్లారని తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో తన తాతకు చెందిన భూమిని కాపాడుకునే ప్రయత్నంలోనే తన మేనమామ భూమి వద్దకు వెళ్లితే దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి మలికిపురం పోలీస్‌ స్టేషన్‌లో మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంపై రాజోలు కోర్టుకు తన మేనమామ ఫిల్‌ వేయగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు. ఇంజక్షన్‌ ఆర్డర్‌ ద్వారా భూమిలోకి వెళ్లితే తన మేనమామపై దాడికి పాల్పడ్డారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా సంబంధిత వ్యక్తులు ప్రస్తుతం సెంట్రల్‌ జైల్‌లో రిమాండులో ఉన్నారని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నంతమాత్రాన కుటుంబ సభ్యులకు అన్యాయం జరుగుతుంటే కూర్చుని ఉండలేకనే ఇటీవల కాలంలో తాను, తన తమ్ముడు గణేష్‌ ఆ గ్రామానికి వెళ్లామని తెలిపారు. దీంతో కొందరు కిరాయి మనుషుల ద్వారా తనపై, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై బురద చల్లేందుకు కుట్రలు చేస్తూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు తాము భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదు చేశారని, కోనసీమలో ఫ్లెక్సీలు కట్టి అల్లరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. లేనిపోని నిందలు వేస్తూ తమ కుటుంబాన్ని బజారుకీడ్చాలని ప్రయత్నిస్తే తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు డాక్టర్‌ లంక సత్యనారాయణ, న్యాయవాది ధర్మ, మాజీ కార్పొరేటర్లు బాపన సుధారాణి, పిల్లి నిర్మల, బొంంతా శ్రీహరి, వైకాపా నాయకులు మార్తి లక్ష్మి, మాసా రామ్‌జోగ్‌, బురిడి త్రిమూర్తులు,కోడి కోట,   పెంకే సురేష్‌, కొక్కిరి మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here