బోస్టన్‌, జి.ఎన్‌.రావు కమిటీల నివేదికలు బోగస్సే

0
172
కమిటీల ప్రతులు భోగిమంట్లల్లో వేసిన జేఏసీ నేతలు
రాజమహేంద్రవరం, జనవరి 14 : రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయవచ్చంటూ బోస్టన్‌ కన్సెల్టింగ్‌ కమిటీ, జిఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికలు వట్టి బోగస్సని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం మందుగానే నివేదికలు తయారు చేయించి.. ఆయా కమిటీలతో కేవలం సంతకాలు చేయించిందని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతలు పేర్కొన్నారు.  భోగి పండుగ సందర్భంగా రాష్ట్రంలో కొత్త వెలుగులు రావాలని ఆకాంక్షిస్తూ… ఆయా కమిటీల నివేదికల ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. స్థానిక అప్సరా థియేటర్‌ సమీపంలోని సోమాలమ్మ ఆలయం వద్ద జేఏసీ పర్యవేక్షణలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, శాప్‌ మాజీ డైరెక్టర్‌ యర్రా వేణు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌, బార్‌ కౌన్సిల్‌ రాష్ట్ర సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, ఛాంబర్‌ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బీసీ సంఘం నాయకులు రెడ్డి రాజు తదితరులు పాల్గొని కమిటీల నివేదికలను భోగి మంటల్లో వేసి దహనం చేసి మాట్లాడారు. ఈ సంక్రాంతి పూటైనా ప్రభుత్వంలో మార్పు వచ్చి రాష్ట్ర ప్రజలు, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా నిండు సభలో అమరావతి రాజధానిని స్వాగతించిన ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పుడు మాట మార్చి మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తీసుకురావడం మాట ఇచ్చి మడమతిప్పడమేనని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తూ ఒక సమస్యను మర్చిపోయేందుకు మరో సమస్యను తెరపైకి తీసుకువస్తూ ప్రజల ఆలోచనలను తప్పు దోవ పట్టిస్తుందన్నారు. కేవలం తమ మాట నెగ్గాలనే పంతానికి పోయి రాష్ట్ర భవిష్యతను జగన్‌ తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 36 వేల ఎకరాల భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ విధానం ద్వారా పైసా ఖర్చు లేకుండా సేకరించడం జరిగిందన్నారు. రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల ప్రజలకు అనువుగా ఉండేలా మద్యస్థంగా ఉన్న అమరావతిని అప్పట్లో ఎంచుకోవడం జరిగిందన్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్‌మోహన్‌ రెడ్డి అమరావతి నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతించి ఇప్పుడు మాట మార్చడం దారుణమన్నారు. ఇప్పటికే సెక్రటేరియట్‌, అంసెబ్లీ, ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వంటి నిర్మాణాలు 75 శాతానికి పైగా పూర్తి చేయడం జరిగిందన్నారు. కేవలం అమరావతి స ష్టికర్తగా చంద్రబాబుకు పేరు వస్తుందనే ఏకైక కుట్రతో జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ప్రజావ్యతిరేకతను ధృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఆయా డివిజన్ల ప్రెసిడెంట్లు, ఇన్‌చార్జులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here