భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు

0
95
రాజమహేంద్రవరం,డిసెంబర్‌ 2 : సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు ఈరోజు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఏటా మార్గశిర మాసంలో శుక్ల పక్ష షష్ఠితిథి నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆయురారోగ్యాలను,సంతాన భాగ్యాన్ని, సిరిసందలను ప్రసాదించి సర్ప భయం లేకుండా చూడాలని ప్రార్థిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు వేడుకున్నారు.  ఈ సందర్భంగా నగరంలోని  సుబ్రహ్మణ్య షష్ఠి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరుకొండ రోడ్డులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆర్యాపురం సత్యనారాయణస్వామి ఆలయం, కోటిలింగేశ్వరస్వామి, ఉమా మార్కండేయేశ్వర, కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయం, బర్మా కాలనీలో సుబ్రహ్మణ్య స్వామి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరుకొండ రోడ్డులోని వల్లీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత రాత్రి ఆలయ అనువంశిక ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్‌ సోదరులు దంపత సమేతంగా స్వామి వారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు భైరవమూర్తి, ప్రముఖ వాస్తు, జ్యోతిష పండితులు పుల్లెల సత్యనారాయణమూర్తి  కల్యాణ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. పలువురు దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. కల్యాణం అనంతరం అర్ధరాత్రి నుంచి స్వామివారి దర్శనానికి భక్తుల్ని అనుమతించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామి వారిని దర్శించుకుని ఫలపుష్పాలు, పడగలు సమర్పించి, క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కోరుకొండ రోడ్డులో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రముఖులు స్వామివారిని దర్శించి పూజలు జరిపారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఆలయ గౌరవ సభ్యులు ఆకుల షణ్ముఖరావు, ఆకుల వెంకటేశ్వరరావు, ఇతర సభ్యులు ఇసుకపల్లి వీర్రాజు, ఇసుకపల్లి విజయకుమార్‌, నామన వాసు, ఇసుకపల్లి అనిల్‌కుమార్‌, ఆకుల పోతురాజు, అప్పన బాబూరావు, శ్రీపాదం మోహన్‌, గంధం రాజేంద్రకుమార్‌ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here