భక్తి శ్రద్ధలతో బక్రీద్‌ పర్వదినం

0
115
నెహ్రూనగర్‌ ఈద్గాలో ముస్లిమ్‌ల ప్రార్ధనలు
రాజమహేంద్రవరం,ఆగస్టు 12 :  బక్రీద్‌ పర్వదినాన్ని ముస్లిమ్‌లు ఈరోజు భక్తి, శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి నెహ్రూనగర్‌ ఈద్గాతో పాటు నగరంలోని పలు మసీదుల వద్ద వారు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ప్రేమ, సహనం, త్యాగానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుందని ఇమామ్‌లు సందేశం అందించారు. అల్లాహ్‌ ఆదేశాల మేరకు తోటి మానవులతో సుహృద్భావంతో మెలుగుతూ సమాజాభివృద్ధిలో ముస్లిమ్‌లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరితో సహనంతో మెలుగుతూ ముస్లింలలో ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా నిలుస్తూ వారు కూడా అభివృద్ధిలో ముందుకు సాగేలా సహకరించాలని ఉపదేశించారు. బక్రీద్‌ పర్వదినాన అల్లాహ్‌ ఇచ్చిన సందేశాన్ని అమలు చేయడం ద్వారా ముస్లింలకు మేలు జరగడంతో పాటు దేశంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయన్నారు. ఈద్‌ అల్‌ అద్హా అని కూడా పిలిచే బక్రీద్‌ ముందు రోజు ముస్లింలు మరణించిన వారి సమాధుల వద్ద వారికి ఇష్టమైన దుస్తులు, ఆహార పదార్ధాలను ఉంచడం కూడా ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేయడం వల్ల వారు స్వర్గం నుంచి వాటిని స్వీకరిస్తారని విశ్వశిస్తారు. రంజాన్‌ మాదిరిగానే బక్రీద్‌ పండుగను కూడా ఖుద్బా అనే ధార్మిక ప్రసంగంతో ప్రారంభించి సామూహిక ప్రార్ధనలు నిర్వహించారు. ఆ తరువాత ఖుర్బానీ పేరుతో జంతువులను బలిస్తారు. ఖుర్బానీ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగంగా భావిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here