భద్రం బిడ్డో….

0
419
ఆదమరిస్తే ఆచూకీ గల్లంతే – తుమ్మలావలో పొంచి ఉన్న ప్రమాదం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 22 : బడికి వెళ్ళే తమ బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు విరుద్ధంగా జరిగితే వారి గుండె చెరువే….అనుకోని దుర్ఘటన ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు ఎవరు? నగరంలోని తుమ్మలావలో రైతు బజార్‌ పక్కనే ఉన్న నగర పాలక సంస్ధ ఎలిమెంటరీ పాఠశాల వద్ద నల్లాచానల్‌ కాలువకు అనుసంధానమైన డ్రైనేజీ నిర్మాణ పనులు ఆరంభమై నెలరోజులైనా ఇంతవరకు పూర్తి కాలేదు. తుమ్మలావ సాయిబాబా గుడి నుంచి ఆర్యాపురం మెయిన్‌రోడ్డు వరకు ప్రస్తుతం ఉన్న కాలువను విస్తరించేందుకు అంచెలంచెలుగా పని చేపట్టారు. అయితే ఆ పని నత్తనడకన సాగుతోంది. నగర పాలక సంస్ధ నుంచి తమకు రావలసిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ నగర పాలక సంస్ధ కాంట్రాక్టర్లు కొద్ది రోజులుగా నగరంలో పనులను ఎక్కడికక్కడ నిలిపి వేయడంతో ఈ డ్రైన్‌ నిర్మాణం కూడా నిలిచిపోయింది. దీనికి తోడు నగరంలో ఇటీవల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాస్తపాటి వర్షానికే నగరంలో ముందుగా ముంపునకు గురయ్యే తుమ్మలావలో డ్రైన్‌ నిర్మాణానికి లోతుగా తవ్వి వదిలేశారు. దీంతో వర్షాలకు ఈ గోతిలో నీరు నిండుగా ప్రవహిస్తోంది. అక్కడే ఉన్న మున్సిపల్‌ ఎలిమెంటరీ పాఠశాలకు వెళ్ళాలంటే చిన్నారులంతా ఈ డ్రైన్‌ను దాటి వెళ్ళాల్సిందే. చిన్నారులు ఈ డ్రైన్‌ను దాటడానికి ఎలాంటి ఆధారం లేకపోవడంతో సమీపంలోని సులభ్‌ కాంప్లెక్స్‌ వద్ద నుంచి చిన్న గట్టు మీదుగా పాఠశాలకు వెళ్ళవలసి వస్తోంది. ఇకనైనా నగర పాలక సంస్ధ అధికారులు, పాలకులు కళ్ళు తెరిచి ఈ ఇబ్బంది తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. జరగరానిదేదైనా జరిగితే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమిటి?