భావ ప్రకటనా స్వేచ్ఛకు పెనుముప్పు!

0
128
(శనివారం నవీనమ్‌)
రాజకీయవేత్తలు, లేదా రాజకీయ అధికారం నేరుగా మీడియా యాజమాన్యాలను నియంత్రించే పరిస్ధితి పత్రికా స్వేచ్ఛకు, భావప్రకటన స్వాతంత్య్రానికి పెను ముప్పుగా పరిణమించింది. మాస్టర్‌ సిగ్నల్‌ ఆపరేటర్లకు నోటిమాటగా చెప్పి నచ్చని న్యూస్‌ టివి చానళ్ళ ప్రసారాలను నిలుపుదల చేయించడం ఒక ధోరణిగా మారుతున్నది. రాజకీయవేత్తలే ఇన్వెస్టర్లుగా, ఇన్వెస్టర్లే రాజకీయవేత్తలుగా మారిపోతున్న వాతావరణంలో ముఖ్యంగా న్యూస్‌ టివిల విషయంలో జర్నలిస్టు నియమాలు, నైతికత విషయాల్లో ప్రమాణాలు పూర్తిగా పతనమైపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న చానళ్ళలో 8 న్యూస్‌ చానళ్ళ షేర్ల బదలాయింపు భారీగా జరిగింది. అమ్ముకోవలసిన అవసరం లేకపోయినా అధికారపు జబర్దస్తీకి లొంగిపోయి షేర్లు అమ్ముకోక తప్పని పరిస్ధితి వచ్చింది. ఫలితంగా అధికారంలో వున్న వారి సిండికేట్‌ ఇష్టాఇష్టాలకు లోబడే ఆయా చానళ్ళలో వార్తలు వస్తాయి. ఇంకోలా చెప్పాలంటే జగన్‌ వర్గానికి ఇష్టం లేని వార్తల్ని కెసిఆర్‌ వర్గం ఆయా చానెళ్ళలో రాకుండా చూడగలదు. కేబుల్‌ టివిలో ఇపుడు టివి5, ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి చానెళ్ళ కనబడటం లేదంటే అది ఎంఎస్‌ఒ లపై జగన్‌ వర్గీయులు తెచ్చిన వత్తిడి ఫలితమే! కాశ్మీర్‌లో మీడియాపై కొనసాగుతున్న ఆంక్షల విషయంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పిసిఐ) ఛైర్మన్‌ జస్టిస్‌ సి.కె.ప్రసాద్‌ వ్యవహరించిన తీరు చూస్తే కంచే చేను మేయడం ఏమిటో అర్ధమౌతుంది. కాశ్మీర్‌లో జర్నలిస్టుల పైనా, సమాచార వ్యవస్థ పైనా ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతూ ‘కాశ్మీర్‌ టైమ్స్‌’ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ పిటిషన్‌ వేస్తే పిసిఐ చైర్మన్‌ మాత్రం జాతీయ సమైక్యత, దేశ ప్రయోజనాల దృష్ట్యా జోక్యం చేసుకోవాలని అక్కడి ఆంక్షలను సమర్థించే రీతిలో పిటిషన్‌ వేయడం గమనార్హం. దేశ ప్రయోజనం అంటే ఏమిటి? ప్రజలకు పూర్తి వాస్తవాలను తెలియజెప్పి దాని ఆధారంగా వారు నిర్ణయించుకునేందుకు తోడ్పడడం దేశ ప్రయోజనం. ప్రజలకు ఏ విషయమూ తెలియకుండా చేసే ఆంక్షలు అమలు చేయడం దేశ ప్రయోజనమెలా అవుతుంది? ‘కాశ్మీర్‌ టైమ్స్‌’ పిటిషన్‌ ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. కాశ్మీర్‌లో వాస్తవ పరిస్థితులు సజావుగా, బిజెపి ప్రభుత్వం చెప్పుకుంటున్నట్టు ప్రశాంతంగా మాత్రం లేవు. ‘కాశ్మీర్‌లో ఆగస్టు 5 తర్వాత ఒక్క తుపాకీ తూటా పేలలేదు కదా?’ అని ఒక విలేకరి అడిగినపుడు కాశ్మీర్‌ సిపిఎం నేత, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌ తరిగామి స్పందన కాశ్మీర్‌ వాస్తవ స్థితిగతులకు దర్పణం పట్టింది. ‘అవును, జైళ్లలోనూ ఒక్క తూటా కూడా పేలదు కదా?’ అని బదులిచ్చారాయన. అంటే కాశ్మీర్‌ మొత్తం ఒక బందిఖానా మాదిరిగా ఉందన్నమాట. ఈ సమయంలో మీడియా ఎటువైపు ఉండాలి? నిస్సందేహంగా ప్రజల వైపే ఉండాలి. కాశ్మీర్‌లో ఏం జరుగుతోందో అక్కడి ప్రజలకే గాదు, దేశం యావత్తూ తెలియాలి. తెలియజెప్పే పని మీడియాది. కలాలకూ, కెమెరాలకూ ఆంక్షల బంధనాలేసి స్వేచ్ఛను హరిస్తే మీడియా ఆ పని చేయగలుగుతుందా? కాశ్మీర్‌లో జరుగుతున్నదిదే. భారతీయ మీడియాకి గొప్ప ప్రజాస్వామిక వారసత్వం ఉంది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ కాలం నుండీ నిర్బంధాన్ని, పెత్తనాన్ని ఎదిరించి మన పత్రికలు నిలబడ్డాయి. పాత్రికేయులుగా తిలక్‌, మహాత్మాగాంధీ, నెహ్రూ తదితరులెందరో కీలక పాత్ర పోషించారు. జాతీయోద్యమంలో పత్రికలు శ్లాఘనీయమైన పాత్ర పోషించాయి. వాస్తవాలు వెలికి తెచ్చే క్రమంలో తమ ప్రాణాలను సైతం పణమొడ్డిన పాత్రికేయులు, ఆర్‌టిఐ కార్యకర్తలు ఎందరో! ఇలాంటి ఘన వారసత్వ చరిత్రున్న దేశంలో ఒక మాజీ న్యాయమూర్తి కూడా అయిన ప్రస్తుత పిసిఐ చైర్మన్‌ ఈ విధంగా బిజెపి కొమ్ముకాయడం సబబా? మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదో మచ్చుతునక. బలహీనులు తమ బాధలను బహిర్గతం చేయడానికి మీడియా ఒక సాధనంగా ఉపయోగపడాలి. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని ప్రభుత్వ పనితీరు పైనా, జరుగుతున్న పరిణామాల పైనా తమకు నచ్చిన నిర్ధారణలకు రాగలగాలి. ఈ రెండు పనులూ మీడియా వల్ల జరుగుతాయి. ఈ రెండూ దేశ ప్రజల సమైక్యతనూ కాపాడుతాయి. మరి మీడియా స్వేచ్ఛకూ దేశ సమైక్యతకూ పోటీ పెట్టడంలో అర్థం ఏముంది? ప్రభుత్వం అతిగా జోక్యం చేసుకోవడం గాని, అనవసరంగా ఆంక్షలు విధించడం గాని మీడియా స్వేచ్ఛను ధ్వంసం చేస్తాయని, అటువంటి జోక్యాన్ని అడ్డుకుని మీడియా స్వేచ్ఛను కాపాడడం పిసిఐ ముఖ్య బాధ్యత అని పిసిఐని ఏర్పాటు చేసిననాడే దాని లక్ష్యాల్లో ఒకటిగా ప్రకటించారు. కాని పిసిఐ చైర్మన్‌ స్వయంగా ఆంక్షలను సమర్థించడం సిగ్గుచేటు. నిజానికి ప్రెస్‌ కౌన్సిల్‌లో తక్కిన సభ్యులను సంప్రదించకుండానే పిసిఐ చైర్మన్‌ ఏకపక్షంగానే ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పిసిఐ చైర్మన్‌ తన వ్యవహారంపై పాత్రికేయ లోకానికే గాక, ప్రజలకూ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here