భాష సాంస్కృతిక కవచం

0
103
భాష ఓ సాంస్కృతిక వారధి. భాషకు, సంస్కృతికి విడదీయరాని బంధం ఉంటుంది. భాష సంస్కృతిలో ఓ భాగమే అయినా భాషనే సంస్కృతికి రక్షణ కవచంలా ఉంటుంది. అలాంటి భాషను ధ్వంసం చేస్తే సంస్కృతితో పాటు ఆ జాతి అంతమై వచ్చే కొత్త తరం పరాయీకరణకు గురవుతుంది. దీన్ని ఆచరణలోకి తెచ్చి ప్రపంచాన్నే ఏలాడు తెల్లవాడు. ఈ గుణం భారతీయ పాలకులకు అంటుకున్నది. భాషాపరమైన ఆధిపత్య ధోరణి ఈనాటిది కాదు. బ్రిటీష్‌ పాలనాకాలంలోనే మద్రాస్‌ ప్రెసిడెన్సీ కింద దాదాపు 125 పాఠశాలల్లో హిందీని బలవంతంగా ప్రవేశపెట్టే నిర్ణయం జరిగింది. పెరియార్‌ నాయకత్వంలో తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిని రద్దు చేసుకున్నారు. తిరిగి 1947 తర్వాత నెహ్రూ ప్రభుత్వం ఈ ఆలోచనా ధోరణితోనే కొనసాగడంతో 1960లో డిఎంకె పార్టీ, హిందీ వ్యతిరేకోద్యమాన్ని నడిపి అధికారాన్ని చేపట్టడం జరిగింది. అప్పట్నుంచి తమిళనాట ఏ రాజకీయ పార్టీ అయినా చివరికి సినీ ప్రముఖులైనా హిందీ వ్యతిరేకతను ప్రదర్శించాల్సి వస్తున్నది. ఈ కోవలోనే మొన్నటి నూతన జాతీయ విద్యా విధానంలో కస్తూరి రంగన్‌ ప్రస్తావించిన త్రిభాషా సూత్రాన్ని ముందుగా నిరసించింది తమిళనాడే! కొఠారీ కమిషన్‌ (1964-66) త్రిభాషా సూత్రాన్ని తన నివేదికలో ప్రస్తావించడానికీ నాటి నెహ్రూ విధానాలే కారణం ! ఈ నేపథ్యంతోనే మొన్నటి హిందీ భాషా దివస్‌ సందర్భంగా హోం మంత్రి షా ప్రవచించిన ఒకే దేశం, ఒకే భాష నినాదం ముసుగులో హిందీ భాషను దేశమంతా నేర్చుకోవాలనే (పాఠశాలల్లో) ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించి, ఓ ఉద్యమానికి నాందీ ప్రస్తావన చేసింది కూడా తమిళనాట డిఎంకేనే. దీన్ని అక్కడ రాజకీయ పార్టీలు, పాలక పక్షం సమర్థించాయి.  పరిస్థితి చేజారుతుందని గ్రహించిన కేంద్రం అదే షా నోటితో ద్వంద్వ ప్రకటనను ఇప్పించడం తెలిసిందే.! తనది కూడా హిందీ మాత భాష కాదని, హిందీ అనుసంధ భాషగా ఉంటే జాతీయ సమైక్యత ఉప్పొంగి పొర్లుతుందని, కనీసం రెండో భాషగానన్నా హిందీ ఉండాలనే తన అభిమతమని ఆయన మాట తిరగేశారు. అంటే, ఈ సమస్య ఇంతటితో సమసి పోదని, ఏదో ఓ రోజున హిందీని తప్పనిసరిగా అభ్యసించే భాషగా కేంద్రం గుర్తిస్తుందని అర్ధంచేసుకోవచ్చు. భారత్‌తో సహా అత్యధిక దేశాలు విభిన్న జాతులతో, భాషలతో ఏర్పడినవే! మతపరమైన గల్ఫ్‌ దేశాలు, పాకిస్తాన్‌ కూడా విభిన్న జాతుల సమ్మేళనమే! ఇక్కడ మాట్లాడే భాషలు ఏకరీతిన ఉండవు. మతపరమైన దేశాల్లో ఆధిపత్య భాషనే జాతీయ భాషగా ఉంటున్నది. ఇలాంటి దేశాల్లో మిగతా భాషలపై వివక్షత చూపడంతో, సంబంధిత జాతులు వెనకంజలోనే ఉంటున్నాయి. భారత్‌ కూడా దీనికి అతీతం కాదు. దేశ విభజనతో తూర్పు, పశ్చిమ పాకి స్తాన్‌లు ఏర్పడిన తర్వాత ఇరు ప్రాంతాల్లో ఉర్దూ అధికార భాష గా 1948లో ఇస్లా మాబాద్‌ ప్రకటించడం తూర్పు పాకిస్తానీయులకు ఆగ్రహాన్ని కలిగించింది. అక్కడ ముస్లింలతో సహా అత్యధికులు ‘బంగ్లా’ భాషను మాట్లాడతారు. ఇది బెంగాలీకి దగ్గరగా గల భాష. దీంతో 1952లో చెలరేగిన భాషాపరమైన అల్లర్లపై పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపి, ఫిబ్రవరి 21, 1952న కాల్పులు జరిపించింది. ఢాకా హైకోర్టు ముందే పదుల సంఖ్యలో విద్యార్థులు, పౌరులు మరణించారు. చివరికి దిగివచ్చిన ప్రభుత్వం 1956లో బంగ్లాను జాతీయ భాషగా గుర్తించింది. ఈ విధంగా భాష మనుగడ కోసం జరిగిన ప్రాణ త్యాగాలకు గుర్తుగా యునెస్కో (నవంబర్‌ 11, 1999లో) ఫిబ్రవరి 21ని అంతర్జాతీయ మాత భాషా పరిరక్షణ దినోత్స వంగా గుర్తించగా, 2000 సంవత్సరం నుంచి ఇది అమలు జరుగుతున్నది. ఈ ఉద్యమమే రాజకీయ, ఆర్థిక విధానానికి దారితీయడం, 1971లో మొత్తంగా తూర్పు పాకిస్తాన్‌, పశ్చిమ పాక్‌ నుంచి విముక్తి పొంది బంగ్లాదేశ్‌గా (భాష పేరుతో) ఏర్పడడం తెలిసిందే! ప్రజలు మాట్లాడే భాష వివక్షతకు గురైతే ఈ విధంగా దేశాలే వేరైతాయని పాలకులకు బంగ్లాదేశ్‌ ప్రజలు ఓ హెచ్చరిక చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోవడానికి గల కారణాల్లో భాష పోషించిన పాత్ర మన కళ్ళ ముందే ఉంది. అందుకే మలితరం తెలంగాణ ఉద్యమం తెలంగాణ సంస్క తి చుట్టే తిరిగింది. కేంద్రం ఇదే పోకడతో పెత్తనం చెలాయిస్తే భవిష్యత్తులో భారతదేశ ముఖచిత్రం మారే ప్రమాదం లేకపోలేదు. ఇప్పుడన్నా కేంద్రం తన మొండి వైఖరిని విడనాడి అన్ని ప్రాంతాల రాష్ట్ర భాషల్ని, గిరిజన భాషలతో సహా జాతీయ భాషలుగా ప్రకటించాలి. హిందీ విషయంగా రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోవాలి. దేశంలోని చాలా ప్రాంతాలు భాషా ప్రాతిపదికనే 1956లో విభజన జరిగిన విషయం తెలిసిందే! మతం కన్నా భాషనే ప్రజల్ని ఐక్యం చేస్తుంది. కేరళలో అత్యధిక శాతం క్రిస్టియన్లు అయినా దానిని ఒకటిగా ఉంచుతున్నది మళయాలమే! గోవాలో కూడా వీరి సంఖ్య అధికమే అయినా, విభిన్న మతస్తుల్ని (క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు) ఐక్యంగా ఉంచు తున్నది కొంకణి భాషనే! నిజానికి ఇక్కడ పోర్చుగీస్‌, కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీలతో పాటు ఇంగ్లీషును కూడా మాట్లాడినా, మూలవాసుల భాష కొంకణికే ప్రాధాన్యత ఉంది. దేశాల వారీగా చూసినప్పుడు, చిన్న దేశమైనా స్విట్జర్లాండ్‌లో అత్యధిక శాతం జర్మనీవాసులుంటారు. వీరి జనాభా 62.6 శాతం కాగా, ఫ్రెంచ్‌ వారు 22.9 శాతం. ఇటాలియన్లు 8.2 శాతం, రోమ్‌ వాళ్ళు 0.5 శాతంగా ఉండగా, ఈ జాతుల భాషలు నాలుగింటినీ జాతీయ భాషలుగా స్విట్జర్లాండ్‌ గుర్తించింది. అలాగే సింగపూర్‌ కూడా! ఇది కూడా వలస దేశమే! ఇక్కడ ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయ, చైనీస్‌ మాండరిన్‌, సాధారణ మాండరిన్‌ భాషల్ని మాట్లాడడంతో, ఈ అయిదు భాషల్ని సింగపూర్‌ ప్రభుత్వం అధికార భాష లుగా గుర్తించింది. జెనీవా సమావేశాలకు, దావోస్‌ సమావేశాలకు పదేపదే పోయే మన నాయకులకు ఈ విషయాలు తెలియవా? అభివృద్ధికి గీటురాయిగా భావిస్తూ సింగపూర్‌ను పదేపదే ప్రస్తావించే మన పాలకులకు ఈ విధానాలేవీ పట్టింపు ఉండకపోవడం గమనార్హం! కాంగ్రెస్‌కు గానీ, మిగతా జాతీయ, ప్రతిపక్ష పార్టీలకు గానీ ఓ జాతీయ ఎజెండా నేటికీ లేకపోవడం గమనార్హం. పాలకుల ప్రకటనల్ని విమర్శించడం తప్ప, తాము అధికారం చేపడితే ఎలాంటి విధానాల్ని అమలు చేస్తారో తెలియదు. తెలిసిందల్లా అధికార పార్టీలపై దాడి చేసి, తాము అధికారంలోకి రావాలనే ప్రయత్నమే! గత 70 సంవత్సరాలుగా ఈ దేశంలో జరుగుతున్నది ఇదే తంతు! ఇప్పుడు బీజేపీ చేపట్టిన ఎజెండా కూడా ఇదే! కాశ్మీర్‌పై తీసుకున్న ప్రజా వ్యతిరేక చర్య నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చడానికే విభిన్న రీతులలో బీజేపీ ప్రభుత్వం చర్యల్ని చేపడుతున్నది. ఇందులో భాగంగానే అసోంలో జాతీయ పౌర నమోదు (ఎన్‌ఆర్‌సీ)ని ముందుకు తెచ్చి, తప్పుల తడకగా దాన్ని ముద్రించింది. పైగా దేశమంతా దీన్ని అమలు చేస్తామనే ప్రకటనలు కూడా వినపడుతున్నాయి. హిందీ భాషా ప్రస్తావన కూడా ఈ కోవలోనిదే ! ఈ చర్యలు ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా కనుమరుగై కేవలం కేంద్ర జాబితానే ఉనికిలోకి రావచ్చు. రాష్ట్ర జాబితా నుంచి ఉమ్మడి జాబితాలోకి విద్య మారిన తర్వాత విద్యారంగం కుదేలు అయింది చూస్తూనే ఉన్నాం. అడవులు, వ్యవసాయం, జల వనరుల పరిస్థితి ఈ విధంగానే ఉన్నది. రాజకీయ లబ్దితో కేంద్ర ప్రభుత్వ విధానాల్ని భరిస్తూపోతే భవిష్యత్తులో ఫెడరల్‌ విధానానికే విఘాతం కలిగే ప్రమాదం ఎంతో దూరం లో లేదు. ప్రతిది కేంద్రమే నిర్ణయించడం మొదలుపెడితే, అసెంబ్లీలు ఉత్సవ భవంతులుగా మిగిలిపోతాయి. 2019 మోటారు వాహనాల చట్టం ఈ దృషితో జరిగిందే! దీన్ని సమర్దించిన 19 రాష్ట్రాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజపీ ప్రభుత్వాలే! లేదా కేంద్రం నుంచి లబ్దిని పొందాలనే ద క్పథం గల వైఎస్‌ఆర్‌సీపీ లాంటి జగన్‌ పార్టీలే! ప్రత్యేక హోదాను ఓ వైపు డిమాండ్‌ చేస్తూనే, కాశ్మీర్‌కున్న ప్రత్యేక హోదా రద్దుకు జగన్‌ మద్దతు తెలపడం లాంటిదేనన్నమాట! రాజ్యాంగ ఆదేశికాలు ఆచరణ రూపంలో ఉండాలంటే, రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారం తప్పనిసరి. అలాగే భాష విషయంలో రాష్ట్రాలకే అధికారం ఉండాలి. రాష్ట్రాలు కూడా ఆంగ్లం మోజులో పడి స్థానిక భాషల్ని పట్టించుకోకపోతే, రాష్ట్రాల స్థాయిలో కూడా భాషా సమస్యలు తలెత్తి, ఉద్యమ రూపం దాల్చవచ్చు. కాబట్టి, రాజకీయ పార్టీలు విధిగా రాజ్యాంగ ఆదేశాలకులోబడే నిర్ణయాలు తీసుకోవాలి. పాలన సాగించాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here