భిన్నత్వం – ఏకత్వం—-

0
344
మనస్సాక్షి  – 1110
కందుకూరి వీరేశలింగం, రాజారామ మోహన్‌రాయ్‌.. చరిత్రలో ఎప్పటికీ నిలిచి పోయే పేర్లు. దానిక్కారణం వాళ్ళు చేసిన సంఘ సంస్కరణలు. వాళ్ళ తర్వాత అంత స్థాయిలో ఎవరూ సంఘ సంస్కరణలు చేసిందేలేదు.  అయితే దాదాపు వందేళ్ళు తర్వాత అలాంటి ప్రయత్నం జరిగింది. వ్యవస్థ మూలాల నుంచి సంస్కరించ డానికో సంఘ సంస్కర్త బయలుదేరాడు. దాంతో పెద్ద సంచలనమే రేగింది. అతడి పేరయితే అంతా మార్మోగిపోయింది. యింతకీ  ఆ సంఘ సంస్కర్త  వెంకటేశం..!
——–
ఎర్రబస్సు గంగలకుర్రు నుంచి రాజ మండ్రి వైపు వెడుతోంది. గిరీశం, వెంక టేశం వెనక సీట్లో కూర్చున్నారు. రెండ్రో జులు తమ సొంతూళ్ళో గడిపి అప్పుడే తిరిగొస్తున్నారు. యింతలో వెంకటేశం ఉన్నట్టుండి ”నేను అను కున్నది చేయడానికి మనూరు సరయిన వేదిక కాదనిపిస్తుంది గురూగారూ..” అన్నాడు. దాంతో గిరీశం ”అవునోయ్‌.. మనూళ్ళో చైతన్యం కుసింత తక్కువేనోయ్‌” అన్నాడు. యింతలో వెంకటేశం ”అందుకే నేను చేపట్టబోయే కార్యక్రమానికి రాజమండ్రిని వేదికగా ఎంచుకుందామనుకుంటున్నా” అన్నాడు. గిరీశం తలూపి ”అలాగే.. యింతకీ నువ్వేం చేద్దామనుకుంటున్నావ్‌?” అన్నాడు. అప్పుడు వెంకటేశం ”ఏం లేదు గురూగారూ.. యిప్పుడు సమాజంలో పాతుకుపోయినవి కులాలూ, మతాలే కదా. అందుకే కులరహిత సమాజం వచ్చేలా  చేద్దామని” అన్నాడు. దాంతో గిరీశం అదిరి పోయి ”అసలది సాధ్యమేనంటావా?” అన్నాడు. వెంకటేశం తలూపి ”తెలీదు గురూగారూ.. అయినా నా ప్రయత్నం నేను చేస్తా” అన్నాడు. ఈలోగా రాజమండ్రీ వచ్చేసరికి యిద్దరూ బస్‌ దిగిపోయారు.
——-
ఆ మర్నాడే  వెంకటేశం రంగంలోకి దిగిపోయాడు. ముందుగా తన కాన్సెప్ట్‌ ఏంటనేది చెప్పి కాలేజ్‌ స్టూడెంట్స్‌కి చిన్న మీటింగ్‌ లాంటిది పెట్టాడు. ఎంతయినా కులదురదల్లాంటివి పెద్దోళ్ళ కున్నంత యిదిగా వీళ్ళకి ఉండవు. ఆ సమావేశానికి స్టూడెంట్స్‌ అయితే బాగానే వచ్చారు. పైగా కొందరయితే తమ పేరెంట్స్‌ని కూడా తీసుకొచ్చారు. వెంకటేశం అయితే ఆవేశంగా తన భావాలన్నీ వెలిబుచ్చాడు. దాంతో సమావేశానికి వచ్చిన వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. ఆ మీటింగ్‌ యిచ్చిన ఉత్సాహంతో వెంకటేశం ఈసారి కొంచెం పెద్దస్థాయిలోనే మీటింగ్‌ ఏర్పాటు చేశాడు. దానికయితే కాలేజ్‌ స్టూడెంట్స్‌ అని కాకుండా మొత్తం అన్ని కులాల వాళ్ళనీ ప్రజలనుంచి పిలిచాడు. యిక మీటింగ్‌కయితే అయిదువేల మంది పైగా వస్తారని అంచనా వేశాడు. దాంతో ఆ మీటింగేదో ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో పెట్టాడు. మీటింగ్‌ మొదలయ్యేది ఆరింటి కయితే అయిదింటికే వెంకటేశం సభాస్థలికి చేరుకుని ఎదురు చూడటం మొదలుపెట్టాడు. అయితే ఆరు కాదు ఏడయినా జనాల జాడలేదు. ఏదో నామమాత్రంగా అయిదొందలమంది వచ్చారంతే. దాంతో వెంకటేశం గట్టిగానే షాకయ్యాడు. అక్కడికీ ఉండబట్టలేక తనకి బాగా తెలిసిన రత్నానికి ఫోన్‌ చేసి రాలేదేం అని అడిగాడు. దానికి రత్నం ”అసలా మీటింగ్‌కి మేమెందుకు రావాలంట? మొన్నేదో మా అబ్బాయి గొడవ చేశాడు కదాని వచ్చామంతే. అయినా మాకు కులాలూ, మతాలూ కావాలి. యింత కాలం మమ్మల్ని అణగదొక్కేశారు. యిప్పుడిప్పుడే కులం పేరు, మతం పేరు చెప్పి ఏవో బెనిఫిట్స్‌ వస్తున్నాయి. యిప్పుడు కులం, మతం వద్దని చెప్పి అవన్నీ వదిలేసుకోవాలా.. వీల్లేదు” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. దాంతో వెంకటేశం బుర్ర మొద్దుబారిపోయింది.
——
మర్నాడు… వెంకటేశం గిరీశం గారింటికి వెళ్ళేసరికి అక్కడంతా హడావిడిగా ఉంది. దానిక్కారణం అగ్రహారంలో ఉండే ఓ నలు గురు తమ వాళ్ళు ఉండడమే. వెంకటేశం రావడం చూసి వాళ్ళలో అవధాని ”రావోయ్‌ వెంకటేశం.. వచ్చే ఆదివారంనాడు మనోళ్ళకి వన భోజనాలు పెడుతున్నాం. దానికి పిలుద్దామని వచ్చాం” అన్నాడు.  అయితే అవేవో కుల భోజనాలు కావడంతో వెంకటేశం యిబ్బందిగా నవ్వాడు. యింతలో అవధాని ”అవునోయ్‌.. నీలో మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ ఎక్కువంట కదా. వచ్చే ఆదివారం నాటి మన ప్రోగ్రాం నువ్వే ఆర్గనైజ్‌ చేయకూడదూ..” అన్నాడు. దాంతో వెంకటేశం యిబ్బందిగా ”వద్దులెండి. నేనో పక్క కులాల నిర్మూ లనకి పోరాటం చేస్తున్నా కదా. యింకో పక్క యిలా కుల భోజనాలకి వస్తే బావోదు” అన్నాడు. దాంతో అవధాని నవ్వేసి ”భలేవాడివోయ్‌.. దేనికదే. సరే నీ యిష్టం” అంటూ తన వాళ్ళతో కలిసి బయటికి నడిచాడు.
——-
వారం తర్వాత ఓ విశేషం జరిగింది. వెంకటేశానికి ఢిల్లీలో ఉన్న సుకుమార్‌ నుంచి ఫోనొచ్చింది. సుకుమార్‌ అంటే వెంకటేశంతోపాటు డిగ్రీ చదివాడు.  తర్వాత సివిల్స్‌ రాయడం, ఢిల్లీలోని సామాజిక సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో మంచి పోస్ట్‌కి వెళ్ళిపోవడం జరిగింది. యిద్దరూ తరచుగా అన్ని విషయాలూ ఫోన్‌లో మాట్లాడు కుంటుంటారు. వెంకటేశం ఫోనెత్త గానే అవతల్నుంచి సుకుమార్‌ ”యిదిగో వెంకీ.. నీకో యింపార్టెంట్‌ న్యూస్‌… కులరహిత సమాజం గురించి ఫైట్‌ చేస్తున్నావు కదా. యిప్పుడదే విషయం యిక్కడ మినిస్ట్రీలో యాక్టివ్‌ అయింది. కులాల వలన అనేక సమస్య లొస్తున్నాయనీ , కులాల సమూల నిర్మూలనకి సూచనలు పంపమని మా మంత్రిత్వశాఖ నుంచి కింద స్థాయికి ఆదేశాలు వెళ్ళాయి. ఈ విషయంగా  నువ్వేవయినా మంచి సలహా యిస్తే యిక్కడ చెబుతాను” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఈ విషయంలో నా ప్రయత్నాలేవీ అంతగా ఫలించడం లేదు. అన్నీ అడ్డంకులే. నేనేదో ఆలోచించి చెబుతాలే” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. యిక ఆ క్షణం నుంచీ వెంకటేశం తీవ్రంగా ఆలోచించడం మొదలెట్టాడు. రెండోరోజుకల్లా బ్రహ్మాండ మయిన ఆలోచన తట్టింది. అసలది మామూలు ఆలోచన కాదు. ఒక వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చి పారేసేటంత గొప్ప ఆలోచన. అదే అమలయితే యిక దేశంలో కులం అనే మాట వినిపించదు. గబగబా సుకుమార్‌కి ఫోన్‌ చేసి ఆ ఆలోచన చెప్పాడు.  అది వినగానే సుకుమార్‌ ఎగిరి గంతేసి నంత ఫోన్‌ చేశాడు. వెంటనే ఆ ఆలోచనని పైస్థాయికి తీసుకెళ్ళిపోయాడు.
——
”గురూగారూ… అదీ నాకొచ్చిన కల. అయినా కుల నిర్మూలనకి నాకొచ్చిన అంత గొప్ప ఆలోచన ఏంటనేది తెలీడం లేదు” అన్నాడు వెంకటేశం బాధపడిపోతూ. దాంతో గిరీశం చుట్ట అంటించుకుని ”ఒకలా అయ్యుంటుందోయ్‌.. హిందూ వివాహ చట్టంలో ఓ రూలుంది. దాని ప్రకారం హిందూ వివాహాల్లో ఒకే గోత్రం వాళ్ళ మధ్యా, యింకా రక్త సంబంధీకుల మధ్యా వివాహం నిషిద్ధం. అయితే దక్షిణాదిలాంటి చోట్ల, సాంప్రదాయంగా వస్తున్న  మేనరికపు పెళ్ళిళ్ళు దీనికి మినహాయింపు. దీని ఆధారంగా అన్ని కులాలవాళ్ళ పెళ్ళిళ్ళకీ వర్తించేలా ఓ చట్టం చేయాలి. దాని ప్రకారం ఏ కులం వాళ్ళయినా తమ కులం వాళ్ళని పెళ్ళి చేసుకోకూడదు. యింకే కులం  వాళ్ళనయినా పెళ్ళి చేసుకునేలా చట్టం చేయాలి. అది కుల వ్యవస్థలో సమూల మార్పులకు వీలు కల్పిస్తుంది. దాంతో కాలం గడిచే కొద్దీ రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటాయి. తండ్రి కులం ఏంటంటే.. కాపు, కమ్మలకి పుట్టినవాడయి ఉండొచ్చు. అలాగే తల్లి రెడ్డి, ఎస్సీలకి పుట్టినదై ఉండొచ్చు. వీళ్ళ కులాలే యింత గందరగోళం అయితే మరి వీళ్ళకి పుట్టినోళ్ళ కులం ఏదనుకోవాలి? దాని వలన క్రమంగా కులం ప్రస్థావన, ప్రాబల్యం తగ్గిపోతుంది. కులాల మీద ఆసక్తీ పోతుంది” అంటూ తేల్చాడు. దాంతో వెంకటేశం ”ప్రాక్టికల్‌గా యిదంతా జరిగినా, జరక్కపోయినా ఆలోచన అయితే బ్రహ్మాం డంగా ఉంది గురూగారూ.. యింతకీ కులాలనేవి ఉండా లంటారా.. వద్దంటారా?” అన్నాడు. దాంతో గిరీశం.. ఉన్నా ఫర్వా లేదోయ్‌.. అయితే అవేవీ వ్యవస్థలో వైషమ్యాలు పెంచకూడదు. కుల, మతాలనేవి తమ ఆచార వ్యవహారాల్నీ, జీవనశైలినీ క్రమ బద్దీకరించడానికే ఉపయోగించుకోవాలి. తమ రాజమండ్రి వాళ్ళంటే రాజమండ్రి వాళ్ళకి ఇష్టం. అలాగని ఇతర ఊళ్ళో వాళ్లని కించపరిచారు కదా! తమ కులాన్ని, మతాన్ని అభిమానించొచ్చు. తమ వాళ్ళని గౌరవించవచ్చును! కానీ ఇతర కులాలనీ, మతాలనీ  కించపరచకూడదు. అది అందరికీ ఆరోగ్యం. ముందు మనం మనుషులం.. ఆ తర్వాతే జాతీయతలూ, మతాలూ.. కులాలూ!
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here