భేషజం భిషక్‌

0
439
మనస్సాక్షి  – 1106
”ఛ..ఛ.. ఏం మనుషులో ఏంటో.. అవ కాశాలు ఎటొస్తే అటు మొగ్గిపోవడమే” అన్నాడు గిరీశం అసహనంగా. దాంతో వెంకటేశం అర్థంకానట్టుగా ”పొద్దున్నే ఎవర్ని తిట్టుకుంటున్నారు?” అన్నాడు. అప్పుడు గిరీశం ”యింకెవరినోయ్‌.. ఆ వాడ్రేవు వాళ్ళని. లేకపోతే నిన్నటిదాకా నిన్ను చేసు కుంటా నన్నవాళ్ళు కూడా యిప్పుడు ఎవడో మంచి  డాక్టర్‌ సంబంధం వచ్చిందని నిన్నొద్దంటు న్నారు” అన్నాడు. దాంతో వెంకటేశం షాక య్యాడు. మొహం వేలాడేశాడు. దాంతో గిరీశం ”ఏం..ఆ సంబంధం తప్పిపోయిందని బాధపడు తున్నావటోయ్‌?” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును గురూగారూ.. ఆ అమ్మాయి బావుం టుంది లెండి” అన్నాడు. అలా అనేసి ఆ బాధలోనే  బయటకెళ్ళి పోయాడు. అయితే ఆ క్షణం నుంచే వెంకటేశంలో ఓ రకం కసి బయలు దేరింది. డాక్టర్‌ని అనిపించుకోవాలన్నది ఆ కసి. ఆ మర్నాడు గిరీశాన్ని కలిసినప్పుడు ”గురూగారూ.. నేను డాక్టర్‌ నవ్వాలని నర్ణయించేసుకున్నా” అన్నాడు. గిరీశం తలూపి ”అయితే యిప్పుడు బైపీసేత్‌ ఇంటర్‌ చేసేసి నీట్‌లో మంచి రేంకేదో తెచ్చేసుకుని, ఆనక ఎంబీబియస్‌లో చేరి ఓ అయి దున్నరేళ్ళు చదివి, తర్వాత యింకో సంవత్సరం రూరల్‌ సర్వీస్‌ చేసేసి, అదయింతర్వాత మూడేళ్ళ ఎండీ, తర్వాత యింకో మూడేళ్ళలో సూపర్‌ స్పెషాలిటీ చేసేసి రూరల్‌ సర్వీసు చేసేసి డాక్టర్‌గా ప్రాక్టీసు పెడతావన్న మాట” అన్నాడు. వెంకటేశం తలూపాడు. ఈసారి గిరీశం ఏవో లెక్కలేసి ”యిప్పుడు నీ వయసు ముప్పై దగ్గర కదా. అంటే ఓ నలభై అయిదేళ్ళకి డాక్టర్‌గా స్థిరపడతావన్నమాట. మరి ఆ వయసులో పెళ్ళి చూపులకెడితే ఆ పెళ్ళేదో మీ అబ్బాయికేమో  అనుకుంటారు” అన్నాడు.  దాంతో వెంకటేశం గతుక్కుమన్నాడు. యింతలో గిరీశం.. ఆ.. యింకో పాయింటు మర్చిపోయావోయ్‌.. అసలు ఎంబీబీయస్‌లో చేరడానికి ఏజ్‌ లిమిట్‌ కూడా నువ్వు దాటేసేవ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం కెవ్వుమన్నాడు.
అఅఅఅ
‘అలా వీల్లేదు.. వీల్లేదంతే’ అంటూ వెంకటేశం అరుస్తూ లేచి కూర్చు న్నాడు. అంతా కల..! దాంతో అరుగుమీద ఆడుకుంటున్న బాబీగాడు కంగారుగా పరిగెత్తుకొచ్చాడు. ”ఏం బాబాయ్‌.. ఏవయిందీ?” అన్నాడు ఆసక్తిగా. దాంతో వెంకటేశం విసుక్కుని ”ఏం లేదు గానీ.. నువ్వు  బయ టికిపోయి ఆడుకో” అంటూ తిరిగి అలా పడక్కుర్చీలోనే నిద్రలోకి జారు కున్నాడు. ఈసారి యింకో కలొచ్చింది…
——
వెంకటేశానికి కొంచెం సుపీరియారిటీ ఫీలింగ్‌ ఎక్కువే.  అంటే మరేం లేదు. తను చాలా తెలివైనవాడిననీ, చదువుకున్నవాడిననీ ఫీలింగ్‌. అలాగని ఎక్కడా ఏం పొగరుగా ప్రవర్తించడు. మనసులో ఆలోచనంతే. అలాంటి వెంకటేశం పీహెచ్‌డి చేసి డాక్టరేట్‌ అనిపించుకోవడానికి రఘురాం అనబడే ప్రొఫెసర్‌ దగ్గర చేరాడు. అయితే పోలీస్‌ వ్యవస్థలో ఆర్డర్లీ వ్యవస్థ నడుస్తున్నట్టే యిక్కడా దాన్ని మించిన  శుశ్రూషల వ్యవస్థ నడుస్తుందని తర్వాత తెలిసింది. ఏ సబ్జెక్ట్‌ మీద  పీహెచ్‌డి చేస్తున్నాం అన్న దానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. తను గైడ్‌గా ఎంచుకున్న వ్యక్తి ఏం చెపితే అది చేయాల్సిందే. ఓ రోజయితే బజారుకుపోయి కావాల్సిన సామాన్లు తెమ్మన్నాడు. యింకో రోజయితే కరెంటు బిల్లులు కట్టేసి రమ్మన్నాడు. అవన్నీ వెంకటేశం పళ్ళ బిగువున కోపాన్ని దిగమింగుకుని మరీ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ డాక్టరేట్‌ ఏదో చేసి డాక్టర్‌ అని పించుకోవాలాయె. యింకో రోజయితే రఘురాం ”యిదిగో వెంకటేశం.. ఓసారి యింటికెళ్ళు. అమ్మగారు  రమ్మంటున్నారు” అన్నాడు. దాంతో వెంకటేశం తిట్టుకుంటూనే వెళ్ళాడు. వెళ్ళేసరికి రఘురాం భార్య రుక్మిణీ దేవి మనవడిని ఎత్తుకుని ఆడిస్తోంది.  వెంకటేశాన్ని చూడగానే ”మనిషిని పంపుతున్నానని యిప్పుడే ఫోన్‌ చేసి  చెప్పారు. కొంచెం యింట్లోకి కూర గాయలు తెచ్చిపెట్టు. కంబాలచెరువు దగ్గర రైతుబజారులో అయితే రేట్లు తక్కువంట. అక్కడకి వెళ్ళి తీసుకురా. లిస్ట్‌ రాసిస్తా. ఈలోగా బాబుని ఆడించు” అంటూ ఆ రెండేళ్ళ మనవడిని యిచ్చింది. వెంకటేశం అయిష్టంగానే ఎత్తుకున్నాడు. ఈలోగా ఆ పిల్లాడు ఏడుపు మొదలెట్టాడు.  దాంతో వెంకటేశం సముదాయించే పనిలో పడ్డాడు. యింకో పది నిమి షాల్లో రుక్మిణీదేవి ఆ కూరగాయల లిస్టేదో రాసి పట్టుకొచ్చింది. ”చచ్చులూ, పుచ్చులూ లేకుండా చూసి తీసుకురా బాబూ..” అంటూ ఓ బుట్ట యిచ్చింది. వెంకటేశం దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి తిరిగి రానే లేదు. ఆ పీహెచ్‌డి చదువూ, ఆ శుశ్రూషలూ పక్కన పెట్టేసి తన యింటికి పోయాడు..
అఅఅఅ
‘అమ్మో.. యిదీ పోయింది’ అంటూ లేచి కూర్చు న్నాడు వెంకటేశం. దాంతో బాబీగాడు మళ్ళీ పరిగెత్తుకొచ్చి ”ఏంటి బాబాయ్‌.. ఏ సినిమా హీరో యిన్‌తోనయినా పెళ్ళి తప్పిపోయిందా?” అన్నాడు. దాంతో వెంకటేశం కయ్యిమని ”రేయ్‌” నిన్ను పొమ్మన్నావా.. బయటికి పోరా వెధవాని” అంటూ అరిచాడు. అలా అరిచేసి మళ్ళీ నిద్రలోకి  జారుకున్నాడు. అందులో యింకో కలొచ్చింది.
——
‘అమ్మో.. యిదీ పోయింది’ అంటూ లేచి కూర్చు న్నాడు వెంకటేశం.  దాంతో బాబీగాడు మళ్ళీ పరి గెత్తుకొచ్చి ”ఏంటి బాబాయ్‌.. ఏ సినిమా హీరో యిన్‌తోనయినా  పెళ్ళి తప్పిపోయిందా?” అన్నాడు. దాంతో వెంకటేశం కయ్యిమని ”రేయ్‌… నిన్ను పొమ్మన్నానా.. బయటికి పోరా వెధవాలి” అంటూ అరిచాడు. అలా అరిచేసి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. అందులో యింకో కలొచ్చింది.
——-
సీఎం చంద్రబాబు గారి నివాసం.. అప్పుడే వెంకటేశం అక్కడకొచ్చి తన పేరు చిన్న చీటీమీద రాసి లోపలికి పంపించాడు. యింకో రెండు నిమిషాల్లోనే లోపలికి రమ్మని కబురొచ్చింది. వెంకటేశాన్ని చూడగానే లోపలికి రమ్మని కబురొచ్చింది. వెంకటేశాన్ని చూడగానే బాబు ఆనందంగా ఆహ్వానించాడు. యింతలో వెంకటేశం  ”ఏం లేద్సార్‌.. యూనివర్శిటీ స్నాతకోత్సవం వివిధ రంగాల్లో  నిష్ణాతులకి గౌరవ డాక్టరేట్‌ యిస్తుంటారంట కదా. మీరో మాట చెబితే” అన్నాడు. బాబు తలూపి ”ఆ..యిప్పించేద్దాం.. యింతకీ ఎవరికి?” అన్నాడు. వెంకటేశం సిగ్గుపడి ”నాకే లెండి” అన్నాడు. బాబు తలూపి యూనివర్శిటీ వీసీకి ఫోన్‌ చేసి, ఏదో చెప్పాడు. తర్వాత వెంకటేశం వైపు తిరిగి, భుజంతట్టి ”నీ పనయి పోయినట్టే. హ్యాపీగా ఉండు” అన్నాడు… ఎవరో భుజంమీద తడుతుండే సరికి వెంకటేశం ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా సీఎం నివాసం ముందుండే గార్డ్‌. అంటే సీఎంని కలవడం అంతా ఊహన్నమాట అనుకున్నాడు. యింకా తను గేటు బయటే ఉన్నాడు. యింతలోనే సెక్యూరిటీ గార్డ్‌ ”నువ్విచ్చిన స్లిప్‌ సెక్రటరీకి యిచ్చాను యిప్పుడు సీఎం గారు ఎవర్నీ కలవరంట. బిజీగా ఉన్నారు” అంటూ తోలేశాడు. దాంతో వెంకటేశం కాళ్ళీడ్చుకుంటూ వెనుదిరిగాడు. ‘పోయే.. యిదీ పాయే..’ అంటూ లేచి కూర్చున్నాడు వెంకటేశం. ఆపాటికి బాబీగాడు ఎదురుగా ఉన్నాడు. కళ్ళింత చేసి ”ఈసారేంపోయింది మావయ్యా.. ఎలక్షన్లో సీటేవయినా పోయిందా!” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఒరేయ్‌… నువ్వర్జంట్‌గా యిక్కడ్నుంచి వెళ్ళకపోతే నీకాళ్ళిరగ్గొడతా” అన్నాడు. దాంతో బాబీగాడు తుర్రుమన్నాడు ఈలోగా గిరీశం బయట్నుంచి వచ్చాడు. ”ఏవివాయ్‌.. ఏంటీ.. వాడినలా బెదరగొట్టేస్తున్నావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలలన్నీ చెప్పి ”ఏం చెప్పమంటారు గురూగారూ.. డాక్టర్‌ని అనిపించుకోవడానికి ఏ దారీ కుదిరి చావడం లేదు” అన్నాడు.  దాంతో గిరీశం ”దానికంత బాధెందుకోయ్‌. ఓ అడ్డదారుంది కదా” అన్నాడు. వెంకటేశం ఆసక్తిగా ”అదేంటి గురూగారూ” అన్నాడు. ఈలోగా గిరీశం ఓ చుట్ట గుప్పు గుప్పుమనిపించి” మొన్నా మధ్యన సౌత్‌ ఆఫ్రికా ఫ్రెండ్‌షిప్‌ వాళ్ళెవరో నాకో మెయిల్‌ పంపించార్లే. నా ప్రతిభేదో తెలిసిందట. యింతకీ వాళ్ళు అనేది నాకు డాక్టరేట్‌ ప్రదానం చేస్తానని. ఓ అయిదొందల డాలర్లు అంటే మన కరెన్సీలో ఓ ముప్పై ఐదువేల రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద కడితే చాలు. మన దేశంలోనే ఎక్కడో వాళ్ళ మెంబర్‌చేత ఆ డాక్టరేట్‌ యిప్పించేస్తా రంట. అలాక్కాకుండా ఏ అమెరికన్‌ చేతులమీదుగానో దాన్నందు కోవా లని ముచ్చటపడితే యింకో రెండొందల డాలర్లు ఎక్కువ కట్టా లంట. అలా ఆ డాక్టరేటేదో అందేసుకున్న వెంటనే పేరుకి ముందు డాక్టర్‌ అని తగిలించుకోవచ్చు” అన్నాడు. వెంకటేశం అదిరిపోయి ”ఏంటీ.. అంతీజీగా డాక్టర్‌ అనిపించేసుకోవచ్చా? మరి మీరెందుకు తీసుకోలేదు?” అన్నాడు. ఈసారి గిరీశం వేదాంత ధోరణిలో ”ఏదో చెప్పుకోడానికి తప్ప అలా వచ్చే డాక్టరేట్‌ నాకెందుకోయ్‌.. అయినా, అలా కొనుక్కోడంలో ఏం సంతృప్తి ఉంటుందని.. ఎంత కష్టపడి నానా చాకిరీ చేసి పీహెచ్‌డీ చేసినవాడూ డాక్టరే. అలాగే పలుకుబడితో గౌరవ డాక్టరేట్‌ తెచ్చుకున్న వాడూ డాక్టరే. యింకా యిలా డబ్బులు పడేసి సులువుగా కొనుక్కున్న వాడూ డాక్టరే. ఏం వ్యవస్థ యిదని? యిక ఎంతో కష్టపడి నీట్‌లో సీటు సంపాదించు కుని, ఆనక ఎన్నో సంవత్సరాలపాటు కష్టపడి చదివినవాడూ డాక్టర్‌ అనే అనిపించుకుంటాడు. ఏంటీ పరిస్థితి?” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచనలో పడిపోయాడు. అంతలోనే ”నాకింక డాక్టర్‌ అనిపించు కోవాలనే ఆశ పూర్తిగా చచ్చిపోయింది గురూగారూ” అంటూ బయటికిపోయాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here