భ్రూణ హత్యలను నిరోధించాలి 

0
306
ఆడపిల్లలను చంపేస్తే యుగాంతమే
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని ఆవేదన
రాజమహేంద్రవరం,జులై 18 : నేటి సమాజంలో మనుషుల మనస్తత్వం పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి అన్నారు. స్థానిక షెల్టాన్‌ ¬టల్‌లో మహిళా సంబంధిత చట్టాలపై జరుగుతున్న అవగాహన సదస్సు బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నన్నపనేని విలేరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో భ్రూణ హత్యలు అధికంగా జరిగేవని, పుట్టే బిడ్డ ఆడబిడ్డ అని తెలియగానే కడునులోనే చంపేసేవారని వాటి నివారణకు కఠిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు ఆడబిడ్డ పుట్టిన 24 గంటల్లో తుప్పల్లోనూ, డ్రైనేజీల్లోనూ పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. ఎవరికి పుట్టిందో కూడా తెలియని స్థితిలో బిడ్డలు చెత్తబుట్టపాలవుతుండటం దారుణమన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకునేలా మహిళా కమిషన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నోటీసు పంపుతుందన్నారు. అలా పుట్టిన ఆడపిల్లలందర్నీ చంపుకుంటూ పోతే పూర్తిగా సృష్టి నిలిచిపోతుందన్నారు. ఆడబిడ్డ తల్లి, చెల్లి, భార్యలా అప్యాయత పంచేలా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కళాశాలలు, పాఠశాలలు, యూనివర్సిటీల్లో సెమినార్లు నిర్వహించడం, జిల్లాల వారీగా మహిళల హక్కులు, చట్టాలపై సదస్సులు నిర్వహించడం ద్వారా చైతన్యం తేవడానికి మహిళా కమిషన్‌ ప్రయత్నిస్తుందన్నారు. జాతీయ మహిళా కమీషన్‌ ప్రోత్సాహంతో ఇప్పటికే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సదస్సులు పూర్తయ్యాయన్నారు. చిన్న పిల్లలపై జరగుతున్న దాడులను అందరూ తీవ్రంగా ఖండించాలన్నారు. ఆడపిల్లలపై ఆఘాయిత్యాలకు పాల్పడితే వెంటనే అరెస్టు చేయాలని, నెలరోజుల్లోగా శిక్ష పడేలా తీర్పులు రావాలన్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు పిల్లలకు నైతిక విలువలు నేర్పాలని కోరారు. తమిళనాడులో దివ్యాంగురాలిపై జరిగిన అఘాయిత్య ఘటనలను తీవ్రంగా ఖండించిన నన్నపనేని నిందితుల తరపున వాదించరాదని న్యాయవాదులు తీర్మానించడం అభినందనీయమన్నారు. ఒక అపార్ట్‌మెంట్‌లో ఇలాంటి ఘటనలు జరిగితే ఒక ఆడపిల్లకు రక్షణ ఎక్కడ దొరుకుతుందన్నారు. మహిళలు అన్ని విషయాలను గమనించాలని జాగ్రత్తగా ఉండాలని కోరారు. అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ ఇటువంటి వర్క్‌షాప్‌లు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. చదువు కోవడం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు మహిళలు ప్రయత్నించాలన్నారు. అవగాహనే ఆయుధమని, బాల్య వివాహాల నిరోధానికి కృషిచేయాలని కోరారు. గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌, మంచి-చెడు విచక్షణ నేర్పాలని తల్లితండ్రులకు సూచించారు. మహిళలు నేడు అన్ని రంగాల్లో దూసుకుని పోతున్నారని ఆర్మ్‌డ్‌ ఫోర్సుల్లో కూడా ఒక బ్యాచ్‌ను రాజమహేంద్రవరం పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచి శిక్షణ ఇచ్చి పంపడం జరిగిందన్నారు. చట్టాలు-సవరణలు చేసి మహిళలకు మరింత రక్షణ కలిగేలా మహిళా కమిషన్‌ కృషిచేయాలని ఆకాంక్షించారు. ఉన్న చట్టాలను అమలు చేయడంలో చిత్తశుద్ధిగా వ్యవహరిస్తే చాలా కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు ఖచ్చితంగా పడతాయన్నారు. పురుషులతో సమానంగా 50 శాతం ఉన్న మహిళలను కూడా పోలీసు శాఖలో నియమిస్తే మహిళల ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ మహిళల భద్రతకు, చట్టాల అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నారని ఇంకా బాగా రాణించాలని కోరారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ మాట్లాడుతూ మహిళల సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించుకోవడం చాలా బాధాకరమన్నారు. నన్నపనేని రాజకుమారి వంటి మహిళ వల్లనే మహిళా కమిషన్‌కు న్యాయం జరుగుతుందన్నారు. ఎస్పీ రాజకుమారి కూడా అర్బన్‌ జిల్లాకు మంచి సేవలు అందించారని, ఎన్నో క్లిష్టమైన కేసులు విజయవంతంగా చేధించారని అభినందించారు. మహిళా మేయర్‌గా పంతం సేవలు అందిస్తున్నారని, మహిళలు మరిన్ని పదవుల్లో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్‌ సభ్యులు మణికుమారి, రాజ్యలక్ష్మి, రమాదేవి, పర్వీన్‌, అదనపు డిఎం ఆండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ కోమలి, డాక్టర్‌ రాజ్యలక్ష్మి, బి.పద్మావతి, ఐసిడిఎస్‌ పిడి నండూరి సీతామహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here