మంచినీటి సరఫరా కేంద్రంలో కలప దొంగలు

0
109
కమిషనర్‌ ఆగ్రహం – ఎలక్ట్రీషియన్‌ సస్పెన్షన్‌
సంబంధిత ఎఇకి మెమో ! – విచారణకు హాజరైన సిబ్బంది
రాజమహేంద్రవరం, నవంబర్‌  7 : నగర ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్‌ వర్క్స్‌లో ‘కంచె చేను మేస్తే’ అన్న చందాన కలప దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. వాటర్‌ వర్క్స్‌ ప్రాంగణంలో గతంలో మున్సిపల్‌ హైస్కూల్‌ ఉండేది. కొద్ది సంవత్సరాల క్రితం ఆ  స్కూల్‌ను అక్కడ నుండి తీసివేసిన సంగతి అందరికీ విదితమే. అయితే ఆ సమయంలో పాఠశాల ముఖ్య భవనాన్ని తొలగించిన క్రమంలో వచ్చిన కలపను అక్కడే ఒక చోట భద్రం చేశారు. అయితే ఇటీవల కాలంలో ఆ కలపను వాటర్‌ వర్క్స్‌లో పనిచేస్తున్న ఒక ఎలక్ట్రీషియన్‌ ఎఇ పేరుతో అక్కడ నుండి తరలించేశారు. రెండు దశలలో అక్కడ నుండి తరలించినట్లు తెలిసింది. ఎఇ చెప్పారన్న ఆ ఎలక్ట్రీషియన్‌ మాటను సిబ్బంది నమ్మి కలపను తరలించేందుకు వారు సహకరించారు. సుమారు మూడునెలల క్రితం కలపను అక్రమంగా తరలించగా వాటర్‌ వర్క్స్‌లో ఉన్న సిబ్బంది వివాదాల నేపథ్యంలో ఈ అంశం బయటకు వచ్చింది. ఒక ఉద్యోగి ఈ అంశంపై నేరుగా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని ప్రస్తుత కమిషనర్‌ సీరియస్‌గా పరిగణించారు. వాటర్‌ వర్క్స్‌లో ఉన్న కలపను తొలగించిన ఎలక్ట్రీషియన్‌ను సస్పెండ్‌ చేయడంతోపాటు కలపను తరలించాలని ఆదేశాలు ఇచ్చిన సంబంధిత ఎఇకి మెమో కూడా జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎవరి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవడానికి కమిషనర్‌ సంబంధిత వాటర్‌ వర్క్స్‌ సిబ్బందిని పిలిపించి ఆరా తీశారు. జరిగిన విషయాలపై  సమగ్ర విచారణ జరిపి సంబంధిత ఎఇపై కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆ ఎఇ ఇప్పటికే వాటర్‌ వర్క్స్‌ సిబ్బందిని బెదిరిస్తున్నారని వినికిడి. సుమారు రూ.3లక్షలు విలువ చేసే ఈ కలపను అక్రమంగా తరలించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. నగరపాలక సంస్థలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని తొలి నుంచి చెబుతున్న నగరపాలక సంస్థ  కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ మాత్రం దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే కొంతమంది అధికారులు సంబంధిత ఎఇపై చర్యలు లేకుండా చూస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here