మంచి మనసున్న వ్యక్తి హరికృష్ణ

0
401
శోకసంద్రంలో తెదేపా కుటుంబ సభ్యులు – గన్ని కార్యాలయంలో సంతాప సభ
రాజమహేంద్రవరం, ఆగస్టు 29 : నటుడిగా, నాయకుడిగా తండ్రి పేరు నిలబెడుతూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, సహచరులకు సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి నందమూరి హరికృష్ణ అని, ఆయన ఇకలేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. హరికృష్ణ మృతి పట్ల కంబాలచెరువు సెంటర్‌లోని గన్ని కార్యాలయంలో సంతాప సభ నిర్వహించారు. ముందుగా హరికృష్ణ చిత్రపటానికి గన్ని కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌కుమార్‌, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిముషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు అత్యంత ప్రీతిపాత్రుడిగా, ఆయన చైతన్య రథ సారధిగా ఉంటూ తండ్రికి, పార్టీకి ఎనలేని సేవలందించిన మంచి వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు. ఆనాడు ఎన్టీఆర్‌ సుడిగాలి పర్యటనలో తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నారని, తరువాత క్రమంలో తెలుగుదేశం పార్టీని రక్షించుకునేందుకు లక్ష్మీపార్వతిపై ఈ జిల్లా నుంచే పోరాటం ప్రారంభించారని గుర్తు చేశారు.  ఈ జిల్లాతో ఆయనకు ఎనలేని సంబంధం ఉందన్నారు. ఆయనను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలుకరించి అనేక విషయాలు మాట్లాడేవారని, గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన హరికృష్ణకు తెలుగు భాష అన్నా, సంప్రదాయాలు అన్నా ఎంతో ఇష్టమన్నారు. ఆరునెలల క్రితం తనకు ఫోన్‌ చేసి రత్నం పెన్‌ వర్క్స్‌లో ఒక పెన్ను తయారు చేయించి పాళీపై ఎన్టీఆర్‌ బొమ్మ ఉండేలా చూడాలని తనకు సూచించారని తెలిపారు. ఆయన చెప్పినట్లుగా తయారు చేసి ఉప్పులూరి జానకిరామయ్యతో పంపించానని తెలిపారు. వర్తమాన రాజకీయాలకు లౌక్యం తెలియని వ్యక్తి హరికృష్ణ అని, మరో మూడురోజుల్లో పుట్టినరోజు ఉందనగా చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. ప్రతి పుట్టినరోజునాడు ఫోన్‌ చేసి మాట్లాడటం అలవాటని, ఇప్పుడు ఆయన లేరన్న వార్త నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్‌ మాట్లాడుతూ మంచి కుటుంబ సభ్యుడిని కోల్పోయామని, చలన చిత్ర రంగంలో తన కౌశల్యాన్ని ప్రదర్శించి అందరినీ అలరించారన్నారు. తండ్రి ఆశయాలకనుగుణంగా నడుస్తూ, నడిపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, గరగ పార్వతి, కో-ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగు, పార్టీ నాయకులు కురగంటి సతీష్‌, బుడ్డిగ రాధ, నందమూరి అభిమానులు గొర్రెల రమణ, రత్నాకర్‌, జింకల జయదేవ్‌, కరుటూరి అభిషేక్‌, మొల్లి చిన్నియాదవ్‌, కోట కామరాజు, పార్టీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్‌, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, మళ్ళ వెంకట్రాజు, కవులూరి వెంకట్రావు, జక్కంపూడి అర్జున్‌, కొయ్యాన కుమారి, ఉప్పులూరి జానకిరామయ్య, వారాది నాగబాబు, గరగ మురళీకృష్ణ, మెహబూబ్‌ఖాన్‌, రాయి అప్పన్న, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, వానపల్లి శ్రీనివాస్‌, శనివాడ అర్జున్‌, గాడి శ్రీను, జాలా మదన్‌, కంచిపాటి గోవింద్‌, కెవిడి భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here