మంచి ముఖ్యమంత్రిని అనిపించుకునే మార్గం సరైనదేనా?

0
287
జీకె వార్తా వ్యాఖ్య
”రాజకీయాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తా.. ఎన్నికల వరకే రాజకీయాలు.. ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా..” ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్మోహనరెడ్డి చెప్పిన మాటలివి..ఈ మాటలు విన్న ప్రతి ఒక్క ఆంధ్రుడు రాష్ట్రానికి, మనకు మంచి రోజులు వచ్చాయని సంతోషించారు..అయితే ఆచరణకు వచ్చే సరికి మాటలకు, చేతలకు పొంతన కనిపించడం లేదు. ఓ వైపు అనేక జిల్లాలో రాజకీయ దాడులు..మరో వైపు నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై నీలినీడలు..రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పనులు నిలిపివేత.. ఐటీ సంస్ధల వలస బాట.. ఇదంతా చూస్తుంటే అభివృద్ధి కాముకుల హృదయం కలుక్కుమంటోంది. విభజన కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు అనుభవజ్ఞుడైన దార్శనికుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అభివృద్ధి జరుగుతుందని అంతా భావించి 2014 ఎన్నికల్లో ఆయనకు పట్టం కట్టగా వారి ఆకాంక్షను నెరవేర్చే యత్నంలో ఆయన ముందడుగు వేయగా తనకో ఛాన్సు ఇస్తే అద్భుతమైన పాలన అందిస్తానని 2019 ఎన్నికల్లో జగన్‌ చెప్పడంతో చంద్రబాబు కంటే మెరుగైన పాలన అందిస్తారేమో చూద్దాం అనే ఆలోచనతో ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టి ఆరు వారాలైంది. పేదల సంక్షేమానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ‘నవరత్నాలు’ అమలు చేస్తామని చెబుతూ వచ్చిన జగన్‌ ఆ దిశగా అడుగులు వేయడానికి ముందు తెదేపా పాలనలో రాష్ట్రం అప్పులు, అవినీతి మయమైందని విమర్శలు ఆరంభించారు. ఈ విషయంలో జగన్‌ అండ్‌ కో బృందం అందుకు కోరస్‌ అందుకుంది. ఫలితంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో, బయట ఈ విషయాలపైనే విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. వైకాపా ప్రభుత్వం శ్వేతపత్రాలు పేరిట గత పాలకులపై విమర్శకులకు ప్రాధాన్యమిస్తుండటంతో హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి ప్రయత్నిస్తున్నారన్న భావన కలుగుతుంది. మరో వైపు నవరత్నాలు అమలు చేయాలంటే భారీగా బడ్జెట్‌ కేటాయింపులు అవసరం ఉంటుంది. అయితే రాష్ట్రం అప్పులు, అవినీతి మయంగా మారడం వల్ల నవరత్నాలు అమలు చేయడానికి చాలా శ్రమించవలసి ఉంటుందని పాలకులు చెప్పడం చూస్తుంటే  హామీల అమలు నుంచి పలాయనం చిత్తగించడానికి వారు యత్నిస్తున్నారేమోనన్న అనుమానం ప్రజలకు ఏర్పడుతోంది. ఎన్నికల ముందు సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని జగన్‌ ఎక్కువ లబ్ధి పొందారన్న మాట వాస్తవం. చంద్రబాబు పాలనా విధానాలతో పాటు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజక్ట్‌ నిర్మాణంలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపణలతో పాటు కులం అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో కొంత అనుమానాలు రేకెత్తించి జగన్‌ ఎంతో కొంత లబ్ధి పొందారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చివరకు ఈ ప్రచారం ఏ స్థాయికి వెళ్ళిందంటే  విశ్వజన నగరంగా రూపొందుతున్న అమరావతి కేవలం ఒక కులానికే పరిమితమవుతోందని, రాజధాని చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరుగుతోందని ప్రచారం చేసి ప్రజల్ని తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేశారు. దీంతో వైకాపా ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతిలో స్మశాన వైరాగ్యం నెలకొంది. పెట్టుబడుల ప్రవాహం ఆగింది.. నిర్మాణం నిలిచిపోయింది.. ఈ విషయంలో జగన్‌ వైఖరి ఒకలా ఉంటే పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట మరోలా ఉంది. రాజధాని నిర్మాణం కొనసాగుతుందని బొత్స చెబుతుంటే సీఎం మాత్రం తన వైఖరి స్పష్టం చేయలేదు.  అమరావతిని రాజధానిగా ఉంచుతారో? లేక మారుస్తారో ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ వైఖరితో అమరావతిలో పెట్టుబడులు పెట్టే వారు వెనుకా ముందు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడింది. పైగా అమరావతి బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినే ప్రమాదం నెలకొంది. అలాగే పోలవరం ప్రాజక్ట్‌ నిర్మాణం కూడా నిలిచిపోయింది. రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ పెట్టుబడులకు భరోసా కల్పించే ప్రయత్నం ఇంతవరకు చేయలేదు. తెదేపా పాలనలో అవినీతి జరిగిపోయిందని ముఖ్యమంత్రి స్ధాయి నుంచి అన్ని స్థాయిల్లోని నేతలు నిరాధారమైన ఆరోపణలు చేయడం వల్ల పెట్టుబడులు స్తంభించే ప్రమాదం ఉంది. ఎన్నికల వరకే రాజకీయాలని ఓ వైపు సీఎం జగన్‌ చెబుతుంటే మరో వైపు ఆయన పార్టీ అనుయాయులు పలు ప్రాంతాల్లో భౌతికదాడులకు పాల్పడుతున్నట్లు వార్తలు వెలువడటం బాధాకరం.  అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తే విచారణ జరిపి నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవడాన్ని ఎవరు కూడా తప్పుపట్టరు. అయితే అవినీతి జరిగిందంటూ ప్రజల్లో అపోహలు కల్పించే ప్రయత్నం చేయడం సరికాదు. ప్రజలకు కూడా కావల్సింది ‘శ్వేతపత్రాలు, నిజపత్రాలు కాదు.. వారికి హామీల రూపంలో కల్పించిన ఆశలన్నింటిని నెరవేర్చే ప్రయత్నం చేయాలి.. ఇందుకు గత పాలకుల హయాంలో ఇలా జరిగింది.. అలా జరిగింది.. ఖజానా ఖాళీ అయింది..డబ్బులు లేవు అని కుంటిసాకులు చెబితే ప్రజాగ్రహానికి గురవుతారు”.మంచి ముఖ్యమంత్రిని అనిపించుకునే ప్రయత్నానికి ప్రస్తుతం సీఎం జగన్‌ అనుసరిస్తున్న పోకడ మాత్రం దోహదపడదని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజకీయ హింసకు ముకుతాడు వేసి గత పాలనలో మంచిని నిస్సంకోచంగా కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీల దిశగా జగన్‌ అడుగులు వేస్తేనే జగన్‌ మంచి ముఖ్యమంత్రిని అనిపించుకోగలుగుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here