మంట పెడితేనే గానీ కోపం చల్లారదట

0
372

పూరి గుడిసెలకు నిప్పంటిస్తున్న నిందితుడి అరెస్ట్‌

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 13 : ఎవరితోనైనా గొడవపడటం ద్వారా వచ్చే కోపాన్ని తగ్గించుకోవడం కోసం చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండే పూరిగుడిసెలకు నిప్పంటించే ప్రబుద్ధుడిని ఎట్టకేలకు అర్బన్‌ జిల్లా పోలీసులు అగ్గిపెట్టెతో సహా అదుపులోనికి తీసుకున్నారు. మూడునెలల కాలంలో పన్నెండు పూరిగుడిసెలకు నిప్పంటించి పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న నిందితుడు ప్రగడ రామకృష్ణను అరెస్ట్‌ చేసి రూరల్‌లో నెలకొన్న ఆందోళనకు తెరదింపారు. ప్రకాశంనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ సిహెచ్‌.సూర్యభాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం రూరల్‌ మండలం హుకుంపేట పంచాయితీ పరిధిలోని వెంకటగిరి-2 ప్రాంతానికి చెందిన ప్రగఢ రామకృష్ణ కె.వి.ఆర్‌.స్వామిరోడ్‌లోని ఒక ప్లాస్టిక్‌ దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రతిరోజూ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళే సమయంలో ఎదురైన వారితో గొడవపడి ఆ కోపాన్ని వారిపై చూపించలేక ప్రకాశంనగర్‌, బొమ్మూరు, రాజానగరం పోలీస్‌స్టేషన్ల పరిధిలో అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటలలోపు పూరిగుడిసెలకు నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వరుసగా జరుగుతున్న సంఘటనలపై దృష్టిసారించారు. అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారికి రాబడిన సమాచారం మేరకు సిఐ సూర్యభాస్కరరావు, సిబ్బంది కలిసి మోరంపూడి సెంటర్‌లోని పాత లారీ స్టాండ్‌ స్థలంలో అనుమానస్పదంగా బండిపై కూర్చొన్న రామకృష్ణను ప్రశ్నించేందుకు వెళ్ళగా పోలీసులను చూసి అతను పారిపోయే ప్రయత్నం చేశాడని, చివరికి అతని వెంబడించి పట్టుకుని విచారణ జరపగా చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు తెలిపారు. అతని నుంచి ఒక మోటార్‌ బైక్‌ను, మొబైల్‌ ఫోన్‌, ఒక సిమ్‌కార్డు, ఒక అగ్గిపెట్టెను స్వాధీనపరుచుకున్నారు. మొత్తం పది కేసుల్లో 12 పూరిగుడిసెలకు నిప్పంటించడంతో రూ.26లక్షల 70వేల ఆస్తి నష్టం సంభవించినట్లు సిఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here