మద్యం విక్రయాలపై నిఘా పెట్టాలి..సారాను అరికట్టాలి

0
128
ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందచేసిన తెలుగు యువత
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 14 : మద్యం ఎమ్మార్పీపై విక్రయదారులు ఇష్టానుసారం వేస్తున్న అదనపు భారం నిఘా పెట్టి.. మద్యం అందుబాటులో లేని కారణంగా హెచ్చు మీరుతున్న నాటు సారాను అరికట్టాలని తెలుగు యువత నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) ఆధ్వర్యంలో సోమవారం వై జంక్షన్‌లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ కాయా… కష్టం చేసుకున్న కూలీలంతా సంపాదించుకున్న కాస్త ఆదాయాన్ని మద్యం కోసమే వెచ్చిస్తూ… కుటుంబాలను పట్టించుకోని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగులు ఇచ్చి వారి జీవితాలతో ఆడుకోవడం సరైన విధానం కాదని, ఇంజనీరింగ్‌, బి టెక్‌, ఎంబీఎ, ఎం టెక్‌ వంటి ఉన్నత చదువులు చదివిన యువకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాల్లో స్థానం కల్పించాల్సింది పోయి మద్యం దుకాణాల్లో పెట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సంపూర్ణ మద్యపానం నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజలకు లేని అలవాట్లు చేయిస్తూ మరింత ఎక్కువగా మద్యం సేవించే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఎమ్మార్పీపై 20 నుంచి 30 రూపాయలు అధనంగా వసూలు చేస్తూ ప్రజల జేబులకు చిల్లు పెడుతోందని ఆరోపించారు. రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలను మూసి వేయడం వల్ల మద్యం సేవించే వారు, యువకులు సారా వైపు పరుగులు తీస్తున్నారని… ఎప్పుడైతే రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలను మూసి వేయడం ప్రారంభించారో ఆనాటి నుంచే రోజుకు కేవలం 50 లీటర్ల మాత్రమే సారా విక్రయించే వారు 500 లీటర్ల సారా విక్రయిస్తున్నారని వివరించారు. ఇదే విధానం కొనసాగితే యువత సారాకు, ఇతర మత్తు పదార్ధాలకు బానిసలు కావడం ఖాయమన్నారు. ఇక బార్లన్నీ తిరనాళ్లను మరిపిస్తున్నాయని, వాటికి రాత్రి 11 గంటల వరకూ సమయం కేటాయించడం వల్ల మద్యం సేవించే వారంతా భార్లకు చేరుతున్నారన్నారు. హెచ్చుమీరుతున్న సారాను నియంత్రించాలని, బార్లపై శాఖాపరమై దాడులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలుగు యువత నాయకులు నక్కా దేవి, మరుకుర్తి దుర్గా యాదవ్‌, పాలిక శ్యామ్‌, సత్తి వెంకట సాయి సందీప్‌, బేసరి చిన్ని, మోతా పండు, ఇంజే రాజబాబు, పండు, చౌదరి, బాలా శ్రీధర్‌, జాకీ జాఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here