మధుర – రేపల్లె

0
143
మనస్సాక్షి  – 1176
వెంకటేశానికి అదృష్టం దరిద్రం పట్టినట్టుగా పట్టింది. లేకపోతే ఏ పార్టీ సీటివ్వలేదని యిండిపెండెంట్‌గా పోటీ చేయడమేంటా, అలా పోటీ చేసినోడు పైసా ఖర్చు పెట్ట కుండా బ్రహ్మాండమయిన మెజారిటీతో గెలవడ మేంటో.. అంతా అదృష్టం కాక మరేముం దని..! ఎప్పటిలాగే ఈసారి కూడా వెంకటేశం ఎలక్షన్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలను కున్నాడు. ఓ పక్కన బీజేపీ – జనసేన అభ్యర్థీ, యింకోపక్క టీడీపీ అభ్యర్థీ, మూడోపక్క వైఎస్సార్సీపీ అభ్యర్థీ రంగంలో ఉన్నారు. యిక పోటీ అయితే ఆ ముగ్గురి మధ్యా నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. నజరానాలు యివ్వడం విషయంలో కూడా ఆ ముగ్గురూ పోటీపడ్డారు. అంతా పోటీపడి మరీ ఓటర్‌ని రెండువేల నోటుతో కొట్టారు. వెంకటేశం మాత్రం అలాంటిదేవీ చేయలేదు. చేయాలన్నా అంత తడి కూడా లేదాయె. నిజాయతీగా తను ఏం చేయాలనుకుంటున్నదీ చెప్పాడంతే. మామూలుగా అయితే వెంకటేశానికి డిపాజిట్‌ కూడా గల్లంతవ్వాల్సిందే. అయితే యిక్కడే తేడా జరిగింది. ఎంత నజరానాలు మింగినా ఓటరూ మనిషే. ముగ్గురి దగ్గరా తలో రెండువేలూ పుచ్చుకున్నప్పుడు అందులో ఏ ఒక్కరికో ఓటేస్తే మిగతా యిద్దరినీ మోసం చేసినట్టే అనుకున్నాడు. దాంతో ముగ్గుర్నీ కాదని ఓటేదో వెంకటేశానికి గుద్దేశాడు. యింకేముంది. పోలయిన ఓట్లలో సగం దాకా అన్ని పార్టీలకీ కలిపొస్తే, మిగతా సగం వెంకటేశానికి పడిపోయి ఎమ్మెల్యే అయిపోయాడు..! వెంక టేశం అదృష్టం అయితే అక్కడితో ఆగలేదు. యింకా కొనసాగు తూనే ఉంది. ఎలక్షన్లో అన్ని పార్టీలూ రకరకాల ఎత్తులేస్తే ఆఖరి ఎత్తేదో ఓటరు వేసేశాడు. ఏ పార్టీకీ స్పష్టమయిన మెజారిటీ యివ్వలేదు. దాంతో రాష్ట్రంలో మొత్తం పార్టీలు రెండుగా విడి పోయినట్టయింది. బీజేపీ – జనసేన కూటమికి టిడిపి బయట నుంచి మద్దతిచ్చేలా, యింకోపక్క వైయస్సార్‌సీపీకి బీజేపీకి నిత్య శత్రువయిన వామపక్షాలు మద్దతిచ్చేలాంటి పరిస్థితి వచ్చింది. అయితే యిక్కడే అసలయిన  ట్విస్ట్‌ ఎదురయింది. చివరిదాకా వచ్చేసరికి వాళ్ళకీ, వీళ్ళకీ వచ్చిన సీట్లు సమం అయిపోయాయి. దాంతో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా గెలిచిన ఏకైక యిండి పెండెంట్‌ అభ్యర్ధి వెంకటేశం కీలకం అయిపోయాడు. దాంతో వెంకటేశం కాస్తా కొండెక్కేశాడు. యింకోపక్క ఈ రాజకీయ పక్షులన్నీ వెంకటేశం యింటి చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టాయి. దాంతో వెంకటేశం తరపున గిరీశం రంగంలోకి దిగాడు. ఆ వచ్చినోళ్ళతో తీరిగ్గా చుట్ట కాల్చుకుంటూ ”ఏదేవయినా మా వాడు ఎవరికి మద్దతిస్తే ఆ పార్టీయే అధికారంలోకొస్తుంది. అందుకే మావాడిని ఎవరు సీఎంని చేస్తే వాళ్ళకే మద్దతు’ అని మొదలుపెట్టాడు. చివరికా బేరసారాలు సాగి వెంకటేశానికి ఉప ముఖ్యమంత్రి కమ్‌ ఫైనాన్స్‌ మినిస్టర్‌ యిచ్చేలా ఒప్పందం కుదిరింది. యిక అక్కడ్నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పడడం, దాంట్లో వెంకటేశం మంత్రయిపోవడం జరిగిపోయాయి. యిక అక్కడితో అటు వెంకటేశం పేరూ, యిటు వెంకటేశం సొంతూరైన గంగలకుర్రు పేరూ అంతా మార్మోగిపోయింది. అసలు కథ అప్పుడు మొదలయింది..
——–
గంగలకుర్రు కొత్త కళొచ్చేసింది. ఊళ్ళో అంతా కూడా ‘అసలు యిప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టిన వెంకటేశం మా ఊరివాడే’ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. యిదిలా ఉంటే కొందరు ఔత్సాహికులు యింకో అడుగు ముందుకేసి ఊళ్ళో వెంకటేశం శిలా విగ్రహం ఒకటి పెట్టేశారు. యింకోపక్క ఊళ్ళో వెంకటేశానికి గుడికట్టే పనులూ మొదలయ్యాయి. ఈ వార్తలన్నీ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి.
——–
అప్పుడింకో విశేషం జరిగింది. గంగలకుర్రుకి వంద కిలోమీటర్ల అవతల ఉండే దేవకీ పాలెంవాసులు ‘రాష్ట్ర రాజకీయాల్ని నడి పిస్తున్న వెంకటేశం బాబు తమ ఊరివాడనీ, అసలు వెంకటేశం పుట్టింది తమ ఊరిలోనేననీ’ స్టేట్‌మెంటిచ్చారు. దాంతో సంచలనం మొదలయింది. యింకోపక్క ఈ విషయంగా రెండు ఊళ్ళ మధ్యా మాటల యుద్ధం మొదలయింది. యిదిలా ఉంటే ఆరోజు ఓ టీం దేవకీపాలెం నుంచొచ్చి వెంక ేశాన్ని కలిసింది. అందులో పాపారావు ముందు కొచ్చి ”యిదిగో వెంకటేశం బాబూ.. మీరు పుట్టింది మా దేవకీపాలెంలోనే. యిక మీదట మీరొచ్చి మనూళ్ళోనే ఉండాలి” అన్నాడు. దాంతో వెంకటేశం గబగబా లోపల కెళ్ళి వాళ్ళమ్మ లక్ష్మీదేవమ్మకి ఫోన్‌ చేశాడు. ”అమ్మా.. యింతకీ నేను పుట్టింది గంగల కుర్రులోనేనా..లేకపోతే దేవకీపాలెం లోనా?” అన్నాడు. దానికి అవతల్నుంచి లక్ష్మీదేవమ్మ విసుక్కుని ”ఏడ్చినట్టే ఉంది. చదవేస్తే ఉన్న మతిపోయిందా ఏంటి?.. మనమంతా గంగల కుర్రులోనే పుట్టా” అంది. దాంతో వెంకటేశం ఫోన్‌ పెట్టేసి, వాళ్ళ దగ్గరకొచ్చి ”యిక మీరు వెళ్ళొచ్చు. నేను పుట్టింది గంగల కుర్రు లోనే” అన్నాడు. ఈసారి పాపారావు అలాగంటే కాదు బాబూ.. మీరు పుట్టింది మా దేవకీపాలెంలోనే. దానికి సాక్ష్యం ముత్తాయమ్మ గారు” అన్నాడు ఎంతో నమ్మకంగా. దాంతో ఏవను కున్నాడో వెంకటేశం మళ్ళీ లక్ష్మీదేవమ్మకి ఫోన్‌ చేశాడు. ”అమ్మా.. ముత్తా యమ్మ అంటే ఎవరో తెలుసా?” అన్నాడు. అయితే ముత్తా యమ్మ పేరు వినగానే అవతల లక్ష్మీదేవమ్మ షాక్‌ తిన్నట్టయింది. ఒక్క క్షణం ఆలోచించి ”నిజమేరా.. నువ్వు పుట్టినప్పుడు నాకు పురుడుపోసింది ముత్తాయమ్మేరా.. అయితే ఆవిడ యింకా బతికే ఉందా?” అంది. వెంకటేశం అవునని ”యింతకీ అప్పుడేం జరి గిందో చెప్పమ్మా” అన్నాడు. దాంతో లక్ష్మీదేవమ్మ ”నేను హైదరా బాద్‌ నుంచి రైల్లో వస్తునప్పుడు పురిటినొప్పులు మొదలయి పోయాయి. దాంతో దేవకీపురంలో రైలాపి దిగేశా. అక్కడ నన్నో మిషనరీ హాస్పిటల్‌కి తీసుకు పోయారు. అక్కడే డాక్టర్‌ ముత్తా యమ్మ నాకు పురుడుపోసింది. డెలివరీ అయ్యాక మనూరు వచ్చేశాం” అంది. యిదంతా వినేసరికి వెంకటేశం షాకయ్యాడు. అంటే తను గంగలకుర్రు వాడినయినా, పుట్టింది మాత్రం దేవకీ పాలెంలో..! దాంతో యిప్పుడు తను ఎక్కడుండాలో తేల్చుకోలేక అయోమయంలో పడిపోయాడు.
——–
”అది గురూగారూ.. రాత్రలాంటి కలొచ్చింది. ఎంతయినా రెండూళ్ళలో అంత ఫాలోయింగంటే ఆ కిక్కే వేరు లెద్దురూ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం విసుక్కుని ”నిజం చెప్పవోయ్‌.. అసలు మన గురించి మన వీధిలోవాళ్ళే సరిగ్గా పట్టించుకుని చావరు కదా. అలాంటిది రెండు ఊళ్ళ జనాలు అంతిదిగా పట్టించుకుంటారంటావా?” అన్నాడు. దాంతో వెంక టేశం గతుక్కుమని ”అయినా ఈకలెందుకు వచ్చినట్టంటారు?” అన్నాడు. గిరీశం ఒక్క క్షణం ఆలోచించి ”మన క్యారక్టర్లకి జీవం పోస్తున్న డాక్టరు పుట్టింది ఎక్కడంటావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం ”యింకెక్కడా.. అనపర్తిలోనే” అన్నాడు. దానికి గిరీశం తల అడ్డంగా ఊపి ”కాదు. రాజమండ్రిలో, ఆ..అసలు విష యానికి వస్తే.. ఈ మధ్య సాయిబాబా జన్మస్థలం గురించి వివాదం మొద లయింది కదా. ఆయన పుట్టింది మా ఊళ్ళోనేనని పత్రీవాసులు అంటున్నారు. దానికి తోడు ప్రభుత్వం ఆ ఊళ్ళో సాయిబాబా ఆలయ నిర్మాణానికి ఓ వందకోట్లు కేటాయించడంతో గొడవ మొదలయింది. యిప్పుడా కొత్త ఊళ్ళో సాయిబాబా ఆలయం కడితే శిర్డీ గ్రామ ప్రాముఖ్యత తగ్గిపోతుందని ఆ ఊరివాసుల భయం” అంటూ ఆపాడు. దాంతో వెంకటేశం ”అయితే వాళ్ళలా గొడవ చేయడం సబబేనా?” అన్నాడు. దానికి గిరీశం ”అసలీ వ్యవస్థ ఆలోచనా తీరే మారాలోయ్‌.. సాయిబాబా వారు ఎక్కడపుడితే ఏముందని? ఏం.. శ్రీకృష్ణుడు దేవకీ సుతుడు కాదా.. మరి పెరి గింది యశోద దగ్గర కాదా? మరి ఆయన జీవితంలో ఆ యిద్దరూ మాతృమూర్తులదీ ఉన్నతస్థానం కాదా.. అలాగే సాయిబాబా విషయంలో ఆయన జన్మస్థలం ఏంటనేది పక్కనపెట్టి, ఎంతో ఉన్నత మైన ఆయన బోధనలు, ఆయన నిరాడంబర జీవన పంధా ఆద ర్శంగా తీసుకుని ముందుకి నడిస్తే  మంచిది. యింకోపక్క  ప్రభుత్వం కూడా వందకోట్లు ఖర్చు పెట్టి ఎంతో ఆడంబర స్థాయిలో సాయి ఆలయం నిర్మించే బదులు నిరాడంబరత్వాన్ని కోరుకునే బాబా వారి సేవా దృక్పథానికి అనుగుణంగా పేదల వైద్యం కోసం ఏ హాస్పిటల్లో కడితే బాగుంటుంది. అదే బాబా వారికి నిజమయిన సంతోషం కలిగించే  విషయం” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here