మరో అడుగు ముందుకు 

0
172
ల్యాండ్‌ పూలింగ్‌కు  గుడా సన్నాహాలు – విస్తరించిన పరిధి – 26న రైతులతో సమావేశం
గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 20 : రాష్ట్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణాభివృద్ధి సంస్థల్లో గుడా అభివృద్ధిలో  దూసుకుపోతోంది. ప్రగతి పథంలో ముందుంటున్న గుడా ఇప్పుడు ల్యాండ్‌ ఫూలింగ్‌కు సన్నాహాలు చేస్తోంది. ఆ వివరాలను గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ గుడా జోనల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం ద్వారా వివరించారు. గుడా ద్వారా ల్యాండ్‌ పూలింగ్‌ చేయడానికి ప్రభుత్వం నుండి గుడాకు అధికారం లభించిందన్నారు. 10 ఎకరాల పైబడి భూములు ఇచ్చే వారి నుండే భూమిని తీసుకోవడం జరుగుతుందన్నారు. గుడా ద్వారా భూ సమీకరణకు సంబంధించి రైతుల వాటా, ఇతర నియమ, నిబంధనలు రూపొందించడానికి ఈనెల 26న రైతులతో సమావేశం అవుతామన్నారు. ఈ సమావేశంలో రైతుల నుండి సలహాలను, సందేహాలను స్వీకరిస్తామన్నారు. రైతుల నుండి వచ్చే సూచనలు, సలహాలు, వారి సందేహాలపై జనవరి 11న సమావేశపై చర్చించి, లాండ్‌ పూలింగ్‌ సాధ్యాసాధ్యాలను భేరీజు వేసుకుని, గుడా స్పందన తెలియజేస్తామన్నారు. రైతులకు ఇచ్చే రేషియో, ప్రభుత్వ గైడ్‌లైన్సు మేరకు నియమనిబంధనలు రూపొందించుకుని జనవరి 18న గుడా ఫైనల్‌ ఆఫర్‌ను ప్రకటిస్తుందన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా గుడాకు భూమి ఇచ్చే రైతులు, ఇతర వర్గాల వారు ఈనెల 26లోగా సంప్రదించాలన్నారు. 10 ఎకరాలు పైబడి భూమి ఇచ్చే వారి నుంచే భూమిని సమీకరిస్తామన్నారు. ఎడిబి రోడ్డులో భూ సమీకరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. గుడా లే అవుట్‌ చేసిన ప్లాట్‌లకు సత్వరమే ప్లాన్‌, ఇతర మంజూరులు అన్నీ లభిస్తాయన్నారు. సిఆర్‌డిఎ, వుడా తర్వాత గుడా మాత్రమే అర్బన్‌ అధారిటీలలో భాగా పనిచేస్తుందన్నారు. గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అధారిటీ పరిధిని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని గుడా ఛైర్మన్‌ గన్ని కృష్ణ వెల్లడించారు. గుడా పరిధి 2,183.02 చదరపు కిలోమీటర్లు కాగా కొత్తగా మరో 557.3 చదరపు కిలోమీటర్లు పరిధిని ప్రభుత్వం కలుపుతూ జీవో ఇచ్చిందని, దీంతో మొత్తం గుడా పరిధి 2740.3 చదరపు కిలోమీటర్లకి చేరిందన్నారు. అలాగే ఇప్పటి వరకు 26 మండలాలు ఉండగా మరో 7 మండలాలు కొత్తగా వచ్చి చేరాయని, దీంతో 33 మండలాలకు పరిధి చేరిందన్నారు. 280 గ్రామ పంచాయితీలకు గాను మరో 74 గ్రామపంచాయితీలు పెరిగి. మొత్తం 354 గ్రామ పంచాయితీలు గుడా పరిధిలకి వచ్చాయన్నారు. కొత్తగా తుని మున్సిపాలిటీ, రామచంద్రపురం మున్సిపాలిటీలు గుడా పరిధిలోకి వచ్చాయని వివరించారు. తుని, తొండంగి మండలాలు వుడా పరిధి నుండి గుడాకు బదలాయింపు జరిగిందన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక నేతకు చెందిన వ్యాపార సంస్ధను ఎటువంటి అనుమతులు లేకుండానే నిర్మించడం జరిగిందని, ఆ సంస్దపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా గుడాకు అధికారం ఉందన్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరపడంతో పాటు గుడా సిబ్బంది కొలతలకు వెళితే కక్ష సాధింపు అంటూ పత్రికల్లో వార్తలు రావడం భావ్యంగా లేదన్నారు. పత్రికలు కూడా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. ఆదిత్య ప్రసాద్‌ మల్లీప్లెక్స్‌ నిర్మాణాలను నిలిపేయడం జరిగిందని, అయితే అపార్టుమెంట్‌ దెబ్బతినకుండా కాంక్రీట్‌ వాల్‌ నిర్మాణానికి మాత్రమే అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here