మరో 10 మృతదేహాలు లభ్యం

0
153
బోటు వెలికితీతకు కొనసాగుతున్న కసరత్తు
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 18 : పాపికొండల విహార యాత్రలో దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద లాంచీ మునిగిపోయిన దుర్ఘటనలో ఈరోజు మరో 10 మృత దేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద ఐదు మృతదేహాలు లభ్యం కాగా కొవ్వూరు మండలం కుమారదేవం వద్ద ఒకటి, కోనసీమ ప్రాంతంలోని మామిడికుదురు మండలం పాశర్లపూడి లంక వద్ద మరో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న  యానం వద్ద మరో బాలిక మృతదేహాం లభ్యమైంది. ఈ దుర్ఘటనలో ఇంతవరకు 38 మృతదేహాలను గుర్తించగా మిగిలిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కాగా సంఘటనా స్ధలం నుంచి కొన్ని మృతదేహాలు వంద కిలోమీటర్లకు పైగా దూరం కొట్టుకుపోగా మరి కొన్ని సంఘటనా స్ధలికి సమీపంలోనే లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టమ్‌ నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటుతున్నాయి. మృతుల్లో తెలంగాణా వాసులే అత్యధికంగా ఉండటం ఆ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, పువ్వాడ అజయ్‌లు రాజమహేంద్రవరంలోనే మకాం చేసి పోస్టుమార్టమ్‌ వంటి లాంఛనాలన్నీ పూర్తయ్యాక వాటిని స్వస్ధలాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారందరి ఆచూకీ లభ్యమయ్యే వరకు గాలింపు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కాగా మరో వైపు  ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటు వెలికితీతకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యంత ప్రమాదకర పరిస్థితుల మధ్య ఈ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 25 టన్నుల బరువు ఉన్న బోటు నదిలో దాదాపు 350 అడుగుల లోతులో ఉందని అంచనా వేస్తుండగా దానిని వెలికితీసేందుకు అనేక అవరోధాలు ఎదురవుతున్నాయి. ప్రవాహంతో పాటు నీరు బురదగా ఉండటంతో వెలికితీత పరికరాలు సమర్ధవంతంగా పనితనాన్ని చూపలేకపోతున్నాయి. ప్రవాహం తగ్గితేనే వెలికితీత పనులు ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here