మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి కృషి 

0
113
ఎపి స్టేట్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ప్రారంభంలో జక్కంపూడి రాజా వెల్లడి
రాజమహేంద్రవరం, ఆగస్టు 8  రాజమహేంద్రవరం నగరంలో త్వరలోనే మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణం చేపట్టునున్నట్లు రాజానగరం శాసనసభ్యులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా వెల్లడించారు. స్థానిక ఎవి అప్పారావు రోడ్డులో గల మున్సిపల్‌ ఇండోర్‌ బ్యాడ్మింటన్‌ స్టేడియంలో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న 2వ ఎపి స్టేట్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌ బాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఈరోజు అట్టహాసంగా ప్రారంభమయ్యింది. జక్కంపూడి రాజా ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కొద్దిసేపు బ్యాడ్మింటన్‌ ఆడి మ్యాచ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలో ప్రతిభకు కొదువ లేదని, అయితే సౌకర్యాలనే కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల శాప్‌ ఛైర్మన్‌ను కలిసామని త్వరలోనే మల్టీపర్పస్‌ స్పోర్ట్స్‌ ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. రాష్ట్రస్ధాయి బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహిస్తున్న జిల్లా అసోషియేషన్‌ ప్రతినిధులను అభినందించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఉన్నతంగా ఎదగాలని క్రీడాకారులకు సూచించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు రాజాను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు కొడాలి తనూజ, జిల్లా ఉపాధ్యక్షులు, టోర్నమెంట్‌ నిర్వాహక కార్యదర్శి డివివి త్రినాధ్‌, అసోసియేషన్‌ నాయకులు నాగేశ్వరరావు, కొత్తపల్లి బాల సుబ్రహ్మణ్యం, కోచ్‌ భద్రం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. షల్టన్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here