మాకూ రోజు వచ్చింది (నిన్న, నేడు, రేపు)-

0
169
మనస్సాక్షి  – 1175
”సరయిన ఆయుధం దొరకలేదనుకోండి గురూగారూ..” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆపాటికి చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తున్న గిరీశం కంగారుపడి ”కనపడవు గానీ నీలో ఫ్యాక్షన్‌ కళలున్నాయోయ్‌.. యింతకీ నీక్కావలసిన ఆయుధం కత్తా.. తూపాకా” అన్నాడు. ఈసారి వెంకటేశం కంగారుపడి ”ఛ..ఛ..నేనడిగింది ఈ రాజకీయాల్నీ, పార్టీల్నీ ఓ ఆట ఆడించాలంటే ఏ ఆయుధం కావాలా అని” అన్నాడు. గిరీశం తలూపి ”యింకేవుందోయ్‌.. ఫోర్త్‌ ఎస్టేట్‌.. అదే.. మీడియా. సరయిన పేపరు మన చేతిలో ఉంటేనా.. ఏ పార్టీనయినా, ప్రభుత్వన్నయినా శాసించొచ్చు” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా ”అయితే నేనిప్పుడే అమరావతిపోయి ఆ ఆయుధాన్ని సంపాదించే పనిలో పడతా” అన్నాడు. గిరీశం అనుమానంగా ”అయినా నీకు అక్కడెవరున్నారు?” అన్నాడు. ఈసారి వెంకటేశం తేలిగ్గా… మా సదానందం గాడుండేది విజయవాడలోనే కదా. పైగా వాడు పని చేసేది కూడా ఓ ఛానల్లో” అన్నాడు. అలా అనేసి అప్పటికప్పుడే విజయవాడ బయల్దేరాడు..
——-
”నేను పేపరొకటి పెడదామనుకుంటున్నారా” అన్నాడు వెంకటేశం. దాంతో సదానందం అదిరిపోయి ”అదంత ఆషామాషీ అనుకున్నావా.. అయినా ముందుగా నువ్వు ఏదో పేపర్లో చేరి మంచి ఆర్టికల్స్‌ అవీ రాసి మంచిపేరు సంపాదించు. అప్పుడు పేపరు పెడదూ గానీ” అన్నాడు. వెంకటేశానికి కూడా యిదేదో బావుందనిపించింది. తలూపి ”అలాగేరా.. అయితే అమరావతి మీద బ్రహ్మాండమయిన ఆర్టికల్స్‌ రాసి పడెయ్యనా” అన్నాడు. సదానందం తల అడ్డంగా ఊపి ”అమరావతి హాట్‌ టాపిక్కేగానీ యిప్పటికే దానిమీద వేలకొద్దీ  కథ నాలు వచ్చేశాయి. యిక కొత్తగా రాయడానికి ఏముంటుందంట?” అన్నాడు. దాంతో వెంకటేశం కొద్దిగా ఆలోచించి ”ఓ పని చేస్తారా..’నైట్‌ లైఫ్‌ యిన్‌ అమరావతి’ పేరుతో అమరావతిలో రాత్రి జీవితం ఎలా ఉంటుందో రాస్తా” అన్నాడు. దాంతో సదానందం ”వండర్‌ఫుల్‌.. అసలిలాంటి యాంగిల్‌లో అమరావతి గురించి ఎవరూ రాసుండరు. ఎందుకంటే అమరావతిలో పాలనంతా పగలే అయిపో తుంది. తర్వాత అంతా ఎవరిమటకు వాళ్ళు ఏ విజయవాడో, గుంటూరో సర్ధుకుంటారు. యిక రాత్రుళ్ళు అక్కడ అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నాయో, లేకపోతే ఏ కేరళా నాయరో టీకొట్టు పెట్టాడో తెలుస్తుంది” అన్నాడు. వెంకటేశం తలూపాడు. ఆరోజు సాయంత్రమే వెంకటేశం అమరావతికి బయల్దేరాడు.
——-
అమరావతి.. రాత్రి ఏడు కావస్తుండగా అప్పటిదాకా ఉన్న హడావిడి సద్దుమణిగింది. ప్రస్తుతానికి అక్కడ ఆఫీసులు తప్ప నివాస గృహాలు లేకపోవడంతో ఆఫీసులు అయిపోయింతర్వాత అంతా దగ్గర్లో ఉండే తమ తమ ఊళ్ళకి తరలిపోతున్నారు. యిక హోటళ్ళు, టీ స్టాల్స్‌ లాంటివి యింకొంచెంసేపున్నాయి. దాదాపు రాత్రి పది కావస్తుండగా వాళ్ళూ కట్టేసి వెళ్ళిపోయారు. యిక ఆ తర్వాత అంతా నిశ్శబ్ధమే. అంత సేపటిదాకా ఫొటోలు తీసుకుంటూ అన్నీ నోట్‌ చేసుకున్న వెంకటేశం ఒక్కడే చివరికి మిగిలాడు. యింతలో వెంకటేశానికి యింకో విషయం గుర్తొచ్చి గుండె జల్లుమంది. యిప్పుడిక్కడ్నుంచి వెళ్ళడానికి ఒక్క ఆటో కూడా లేదాయె. అసలా మాటకొస్తే  కనుచూపుమేరలో ఒక్క పురుగు కూడా కనిపించలేదు. యింకో అరగంటయినా అదే పరిస్థితి. ఆపాటికి చలీ ఎక్కువయింది. దాంతో అక్కడ్నుంచి ఎలా వెళ్ళాలో వెంకటేశంకి తెలీడం లేదు. యింతలోనే  మహత్తరమయిన ఆలోచనొకటి తట్టింది. దాంతో గబగబా తన ఫ్రెండ్‌ సదానందానికి ఫోన్‌ చేసి, విషయం చెప్పి ”నువ్వోసారి రాకూడదూ” అన్నాడు. దానికి  అవతల్నుంచి సదానందం అలసటగా” లేదురా.. బాగా తిరిగి తిరిగి అలిసిపోయొచ్చా.. రావడం కష్టం” అన్నాడు. యింతలో వెంకటేశానికి  బ్రహ్మాండమయిన ఆలోచన తట్టింది. ”ఓ పని చెయ్‌రా.. 100కి ఫోన్‌ చెయ్‌” అంటూ ఏం చేయాలో చెప్పాడు. దాంతో సదానందం షాకయి ”అసలిది వర్కవుట్‌ అవుతుందా?” అన్నాడు. వెంకటేశం నమ్మకంగా ”ఖచ్చితంగా అవుతుంది. ముందు నువ్వు ఫోన్‌ చెయ్యరా” అన్నాడు.  దాంతో సదానందం 100కి ఫోన్‌ చేశాడు. ”అమరావతిలో వెంకటేశం అనే యువజన నాయకుడు రోడ్డు మీద ధర్నా మొదలుపెట్టాడు. ఏ క్షణంలో అయినా ఆత్మార్పణం చేసుకునేలా ఉన్నాడు ” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. యింకేముంది… యింకో పావు గంటలో పోలీసులేనొకటి వచ్చి అక్కడ ఆగింది. ఆపాటికి వెంకటేశం రోడ్డుకి అడ్డంగా కూర్చుని ఉన్నాడు. ఎస్సై వేన్‌ దిగి, గబగబా వెంకటేశం దగ్గరికి నడిచి ”సార్‌.. మీరెవరు? ఈ ధర్నా ఎందుకు?” అన్నాడు. దాంతో వెంకటేశం” రాజధానిని తరలిస్తా మంటున్నారు కదా. అదేదో మా రాజ మండ్రిలో పెట్టాలి. అదే నా డిమాండ్‌. రేపు తెల్లవారాక యింకో పదివేలమంది మా రాజ మండ్రి నుంచొచ్చి నాకు మద్దతుగా ధర్నా చేస్తారు”అన్నాడు. దాంతో ఎస్సై గుండాగినంత పనయింది. ‘అమ్మో.. యిదేదో పెద్ద తలనొప్పే’ అనుకున్నాడు. దాంతో వెంకటేశం పక్కన కూర్చుని ”మీరుండేది ఎక్కడ?” అన్నాడు. దానికి వెంకటేశం హుషారుగా  ”మామూలుగా అయితే నేనుండేది రాజమండ్రి. అయితే యిప్పుడు ఉంటుంది మా ఫ్రెండ్‌ సదానందం యింట్లో.. విజయవాడలో” అంటూ ఆ అడ్రస్‌ చెప్పాడు. అప్పుడు ఎస్సె ”సార్‌..మేం చెప్పినట్టు వింటే మీకే సమస్యా ఉండదు. లేకపోతే అనవసరంగా బాధపడాలి” అన్నాడు. అలా అనేసి తన వాళ్ళకి సైగ చేశాడు. దాంతో యిద్దరు కానిస్టేబుల్స్‌ పరిగెత్తుకొచ్చి, వెంకటేశాన్ని జాగ్రత్తగా వేన్‌ ఎక్కించి, లోపల కూర్చోబెట్టారు. తర్వాత ఆ వేన్‌ వెంకటేశాన్ని సదానందం యింటి దగ్గర దింపేసింది.  వెంకటేశం ‘థాంక్స్‌ ఫర్‌ డ్రాపింగ్‌’ అనుకుంటూ సదానందం యింట్లోకి నడిచాడు.
——–
”అది గురూగారూ.. రాత్రి నాకొచ్చిన కల. దర్జాగా వాళ్ళే యింటి దగ్గర దింపారు” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”వాళ్ళేదో అలా యింటి దగ్గర దింపకుండా నీ స్టేషన్‌కో లాక్కుపోయుంటే ఎలా ఉంటుందంటావ్‌?” అన్నాడు. దాంతో వెంకటేశం గతుక్కుమని ”అయినా ఈకలెందుకు వచ్చినట్టంటారు?” అన్నాడు. దాంతో గిరీశం ”మరేంలేదోయ్‌.. మొన్న ధర్నా చేస్తుంటే చంద్రబాబుని యిలాగే  పోలీసులు పట్టుకెళ్ళి గౌరవంగా యింటి దగ్గర దిగబెట్టారు. పట్టుకెళ్ళి లోపలేస్తే పెద్ద రచ్చ అవుతుంది. అలాగని వదిలేస్తే  పరిస్థితి అదుపు తప్పుతుంది. అందుకే యిలా చేసుండొచ్చు” అన్నాడు. వెంకటేశం తలూపి ”యింతకీ ఈ ధర్నాల వలన ఉపయోగం ఏవయినా ఉందంటారా?” అన్నాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొద లెట్టాడు. ”ఓ రకంగా యిదంతా వృధా ప్రయాసేమో అనిపిస్తుం దోయ్‌. ఎందుకంటే అవతల మూడు రాజధానులలో భాగంగా వైజాగ్‌లో పాలనా ఏర్పాట్లు జరిపించేస్తున్నారు. అయితే యిక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే.. ప్రస్తుత ప్రభుత్వం యిలా మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చింది ప్రజా సంక్షేమం కంటే ప్రతీకార ధోరణి కోసం అన్నది సుస్పష్టం. అప్పట్లో  అమరావతిలో రాజధాని నిర్మాణం ప్రారంభించేటప్పుడు కూడా అధికారంలో ఉన్న సైకిలు పార్టీ వాళ్ళు కూడా అటు కేంద్రాన్నీ లెక్క చేయక, యిటు జగన్‌ పార్టీ వాళ్ళనీ పట్టించుకోకుండా, గడ్డిపరకలా తీసి పారేసి, ఒంటెత్తు పోకడ అవలంబించడం జరిగింది. అదేదో మనసులో పెట్టుకుని జగన్‌ యిప్పుడు వాళ్ళని దెబ్బకొట్టడానికా అన్నట్టుగా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. యిక అసలు విషయానికి వస్తే.. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా యిక ఎప్పటికీ తామే అధికారంలో ఉండిపోతాం’ అన్నట్టుగా ఎవర్నీ లెక్క చేయకుండా ఒంటెత్తు పోకడలకి పోతుంటారు. అయితే అధికారం అనేది ఎప్పుడే పార్టీని వరిస్తుందో చెప్పలేం. అలాంటప్పుడు పాత పాలకుల నిర్ణయాలన్నీ అధికారంలోకి వచ్చినోళ్ళు మూలపెడుతుంటారు. యిదంత ఆరోగ్యకరమయిన  పరిణామం అయితే కాదు. ప్రజా సంక్షేమానికి చేటు కలిగించేది. యిటువంటి పరిస్థితి రాకూడదంటే ఏ అధికార పార్టీకయినా కావలసింది ‘ట్రాన్స్‌పరెన్సీ’ తాము ఒంటెత్తు పోకడలకి పోకుండా, తీసుకునే ప్రతీ ముఖ్య నిర్ణయంలో అటు కేంద్రంతో, యిటు ప్రతిపక్షాలతో చర్చించి ముందుకెడితే బాగుంటుంది” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here