మాటలకందని.. మరపురాని మౌన బాధ నాది

0
521
(జి.కె.వార్తా వ్యాఖ్య)
”ఈరోజు తెల్లవారుజామున అమెరికా నుంచి నా మనుమడు శ్రీకర్‌  నాతో మాట్లాడుతూ జూనియర్‌ ఎన్టీఆర్‌ సీటు బెల్టు పెట్టుకుని డ్రైవింగ్‌ చేయాలని అందరికీ చెబుతారు కదా.. మరి వాళ్ళ నాన్నగారు హరికృష్ణ గారికి ఎలా ఈ ప్రమాదం జరిగింది?” అని నన్ను ప్రశ్నించాడు. నిజమే. హరికృష్ణ గారే కాదు.. విధి రాత నుంచి తప్పించుకోలేనివారు ఆ సమయంలో సీటు బెల్టు ధరించరేమోననిపిస్తోంది. హరికృష్ణ గారితో చాలా సన్నిహిత సంబంధం ఉన్న నాకు ఆయన డ్రైవింగ్‌లో ప్రక్కన కూర్చుని ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి.. అలాగే నేను డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు ఆయన ప్రక్కన కూర్చున్న సందర్భాలూ ఉన్నాయి. ఎప్పుడు కూర్చున్నా చాలా వేగంగా డ్రైవింగ్‌ చేసేవారు. వాహనం బయలుదేరగానే నేను చాలాసార్లు సీటు బెల్టు గురించి గుర్తు చేసేవాడిని. ఇటువంటి ప్రయాణాలలో లిప్త కాలంపాటు ఏమరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. హరికృష్ణ గారికీ తెలుసు.. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో దివంగత ఎన్టీ రామారావు గారు చైతన్యరథంలో రాష్ట్రం నలుమూలలా కొన్నివేల కిలోమీటర్లు పర్యటించినప్పుడు హరికృష్ణ తానే రథసారధై నడిపించారు. అటువంటి చైతన్య రథసారధి సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో దుర్మరణం పాలుకావడం చాలా బాధాకరం. ఆ బాధను మాటల్లో చెప్పలేను కానీ ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన నాకు ఆయన గొప్ప మనసు, కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడే మనస్తత్వం, నిర్భీతి, నిజాయితీలతో కూడిన నిష్కర్షత్వం నాకు బాగా తెలుసు. బహుశా నా మనసు, నా తీరు ఆయన వ్యవహారశైలికి బాగా దగ్గరగా ఉండటం వలన కాబోలు ఆయనంటే నాకు అపారమైన అభిమానం. ఎన్టీఆర్‌ కుమారులైన  హరికృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణలతో నేను సన్నిహితంగా ఉన్నప్పటికీ హరికృష్ణ గారితో నా సన్నిహితతత్త్వం వేరు. తెలుగుదేశం పార్టీలో లక్ష్మీ పార్వతిపై పోరాడిన సమయంలో హరికృష్ణ గారు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు గారి అనుమతితోనే నేను ఆయనతో ఫాలో అయ్యాను. అప్పుడే ఆయన పోరాట పటిమను, పౌరుషాన్ని చాలా దగ్గర నుంచి చూశాను. అప్పటి నుంచి ఆయనకు మరింత అభిమానినయ్యాను. ఇక్కడకు సమీపంలోని మురారిలో తొలి సభ జరిగినప్పుడు ఓ వైపు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, రెండవ వైపు నేను హరికృష్ణ గారి ప్రక్కనే ఉండి స్థానిక సమస్యలను కాగితంపై రాసి ఇచ్చినప్పుడు తనదైన శైలిలో ఆవేశాన్ని, ఆలోచనను జోడించి ఆ సమస్యలపై హరికృష్ణ తనదైన శైలిలో మాట్లాడటం ఇప్పటికీ నా మస్తిష్కంలో మెదులుతూనే ఉంది. ప్రజా బాహుళ్యంలో మాట్లాడటం కొత్త కావడంతో కాస్త తడబడినా ముక్కు సూటిగా మాట్లాడటం ఆయనకు అలవాటు. నాడు లక్ష్మీపార్వతి అంటే చాలామంది గడగడలాడినా హరికృష్ణ మాత్రం ఆమె తీరును ఎండగడుతూ సింహంలా గర్జించారు. తెలుగు ప్రజల జన హృదయనేత నందమూరి తారక రామారావు కన్నుమూసిన నాడు చాలామంది ఆయన పార్ధివ దేహం వద్దకు వెళ్ళడానికి సంకోచిస్తున్నప్పుడు అప్పుడే విదేశాల నుంచి హైదరాబాద్‌ వచ్చిన హరికృష్ణ బాధను పంటి బిగువన బంధించి ఎంతో  చుట్టూరా లక్ష్మీపార్వతి వర్గీయులు ఉన్నప్పటికీ ధైర్యసాహసాలతో వ్యవహరించి ఎన్టీఆర్‌ భౌతికకాయాన్ని లాల్‌ బహుదూర్‌ స్టేడియానికి తరలించడమే కాక అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కరణలు జరిపించడానికి ఆయన దోహదపడిన  ఉదంతాన్ని ఇప్పటికీ నందమూరి అభిమానులు మరిచిపోలేరు. నా ప్రియతమ అభిమాన నేత ఎన్టీఆర్‌కు కడపటి నివాళులర్పించేందుకు నేను హైదరాబాద్‌ వెళ్ళినప్పుడు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి ఆ మహనీయుడి పార్ధివ దేహం పాదాల చెంతన కూర్చునే అవకాశం కల్పించిన హరికృష్ణ గారిని నా జీవితంలో నేను ఎన్నటికీ మరువలేను. లక్ష్మీపార్వతి వ్యవహారశైలి కారణంగా తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడినప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి, ఆయన సీఎంగా నిలదొక్కుకోవడానికి తెర వెనుక హరికృష్ణ పాత్ర చాలా మందికి తెలియకపోవడంతోపాటు తెలిసినా తెలియనట్లుగా వ్యవహరించే వారికి హరికృష్ణ గారి గంభీరం గుర్తుండిపోతుంది. అలాగే హరికృష్ణ గారి తనయుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యినప్పుడు ఆయనను పరామర్శించేందుకు వెళ్ళినప్పుడు ఆయన కొద్ది నిమిషాలపాటు నా చేతిలో చెయ్యి వేసి అదిమి పట్టుకుని మూగగా బాధను వ్యక్తం చేస్తూ నన్నో ఓ ఆత్మీయుడిలా భావించడమే ఇంకా కళ్ళల్లో మెదలుతుండగానే ఆయన కూడా అదే తీరులో ఈ లోకం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించడం మరిచిపోలేని బాధాకరమైన విషయం. ఒకే జిల్లా (నల్గొండ)లో ఓ కుమారుడు జానకీరామ్‌ రోడ్డు ప్రమాదంలో అశువులు బాయడం, మరో కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ గాయాలు పాలు కావడం, ఇప్పుడు ఆయన కూడా అదే జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై మరణించడం నందమూరి కుటుంబానికే కాక అభిమానులకు అశనిపాతం వంటిది. అలాగే నేను అత్యంత ఇష్టపడే నాయకులలో ఒకరైన మాజీ ఎం.పి. లాల్‌ జాన్‌ భాషా కూడా ఇదే జిల్లాలో రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడం ఎంతో బాధాకరం. మానవతావాదిగా, ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న వ్యక్తిగా పేరొందిన హరికృష్ణ రవాణాశాఖామంత్రిగాను ఎన్నో ప్రజోపయోగ నిర్ణయాలు చేసి ప్రజా హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. ముఖ్యంగా వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినహాయింపు ఇచ్చి అన్నదాత హృదయాలలో ఆయన అభిమానాన్ని మూటగట్టుకున్నారు. మూడున్నర దశాబ్దాల తెలుగుదేశం పార్టీ విజయ ప్రస్థానంలో, ఆటుపోట్లలో  ఎన్టీఆర్‌, చంద్రబాబులతోపాటు హరికృష్ణ పాత్ర కూడా మరుపురానిది. నాకెంతో సన్నిహితులైన హరికృష్ణ గారిని ఆఖరి చూపు చూసేందుకు హైదరాబాద్‌ వెళుతున్నారా అని నన్ను చాలామంది అడిగారు..అయితే నిత్య చైతన్యశీలిగా ఎంతో దగ్గర నుంచి చూసిన నా అభిమాన నాయకుడిని ఇప్పుడిలా చైతన్యరహితంగా చూడటానికి నాకు మనస్కరించడంలేదు. అయితే నా బాధను పంచుకునేందుకు  రేపు బయలుదేరి వెళ్ళి  హరికృష్ణ గారి సోదరులను, వారి కుటుంబ సభ్యులను పలకరించి వస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here