మానవ హక్కులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

0
367
న్యాయవాదుల సదస్సులో హైకోర్టు జడ్జి రాజా ఎలాంగో
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 3 :  రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఉల్లంఘించడమే మానవ హక్కుల ఉల్లంఘన అని, ఈ విషయాలలో ప్రజలను చైతన్యవంతులుగా చేయకపోవడం కూడా మానవ హక్కుల ఉల్లంఘన గానే పరిగణించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి రాజా ఎలాంగో అన్నారు. భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు ఆధ్వర్యంలో 6వ జిల్లా సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిధులుగా హైకోర్టు న్యాయమూర్తులు రాజా ఎలాంగో, సి.ప్రవీణ్‌కుమార్‌, అతిధులుగా జిల్లా జడ్జి బి.ఎస్‌.భానుమతి, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది గంటా రామారావు, ఆహ్వానితులుగా భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు బి.గోకుల్‌ కృష్ణ, రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పిఏ చౌదరి, ఐఏఎల్‌ ప్రతినిధులు కె.ఎస్‌.సురేష్‌కుమార్‌, జి.జగదీశ్వర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతదేశంలో మానవహక్కుల అమలు అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హైకోర్టు జడ్జి రాజా ఎలాంగో జ్యోతిప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చాలా హక్కులను ఆర్టికల్‌ 21 క్రింద చేర్చిందని, ఇవన్నీ ప్రాథమిక హక్కులు కాకపోయినా మానవ హక్కులుగా పేర్కొందన్నారు. వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా చేసిందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన అనే అంశంపై ముఖ్యంగా అవగాహన, చైతన్యం ప్రజల్లోకి తీసుకువచ్చే బాధ్యత న్యాయవాదులపై ఉందన్నారు. దానిని మరిచిపోతే హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని సూచించారు. నిందితులకు బేడీలు, సంకెళ్ళు వేయడం, ఎన్‌కౌంటర్లు జరగడమే మాత్రమే మానవ హక్కులుగా పరిగణిస్తారని, సమాజంలో మానవహక్కుల ఉల్లంఘనలు చాలా జరుగుతున్నాయన్నారు. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులకు వైద్యాన్ని నిరాకరించడం, అవయవాల మార్పిడికి పాల్పడిన వారికి రిజర్వేషన్లు కల్పించకపోవడం కూడా మానవహక్కుల ఉల్లంఘనే అని చెప్పారు. మానవహక్కుల ఉల్లంఘనకు చెక్‌ పెట్టాలంటే ప్రజలంతా భాగస్వామ్యం కావాలని చెప్పారు. హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా, సమానంగా జీవించేందుకే మానవహక్కులు రచించబడ్డాయన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి, పుట్టబోయే బిడ్డ వివరాలు కూడా చెప్పడం కూడా హక్కుల ఉల్లంఘనే అన్నారు. అనంతరం న్యాయవాద వృత్తిలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న వారికి హైకోర్టు న్యాయమూర్తుల చేతులమీదుగా సత్కరించారు.