మార్చి 7న ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన 

0
361
డిమాండ్ల పరిష్కారానికి విశ్రాంత బ్యాంక్‌ ఉద్యోగుల నిరసన
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : విశ్రాంత బ్యాంక్‌ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మార్చి 7వ తేదీన ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద లక్షమంది విశ్రాంత ఉద్యోగులతో ఆందోళన చేపడుతున్నట్లు అఖిల భారత బ్యాంక్‌ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్‌ ఎ.వి.వి.సత్యనారాయణ తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు కుమారి ధియేటర్‌ రోడ్‌లోని సెంట్రల్‌ బ్యాంక్‌ వద్ద నిరసన చేపట్టారు. నూరు శాతం డిఎ సౌకర్యాన్ని  2002 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి కూడా వర్తింపజేయాలని కోరారు. కుటుంబ పింఛను విధానాన్ని ఇతర శాఖల మాదిరిగా మెరుగుపరచాలని, దేశంలో వేతన సవరణ జరిగినప్పుడు అన్ని శాఖల విశ్రాంత ఉద్యోగులకు అమలు చేస్తున్నట్టుగా పింఛన్‌ కూడా అమలు చేయాలని, పెన్షన్‌ కొరకు దరఖాస్తు చేసుకోలేని వారికి అవకాశం కల్పించాలని సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతోనే దేశవ్యాప్తంగా లక్షమంది విశ్రాంత ఉద్యోగులు ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్నారని, ఆ తరువాత కేంద్ర ఆర్థిక శాఖామంత్రి అరుణ్‌జైట్లీని కలిసి వినతిపత్రం సమర్పిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి కె.ఎ.పి.శర్మ, వైఎస్‌ చైర్మన్‌లు శ్రీనివాసమూర్తి, వి.కె.వి.ప్రసాద్‌, సమాఖ్య సభ్యులు వి.సూర్యారావు, ఎమ్‌.డి.మస్తాన్‌, తదితరులు పాల్గొన్నారు.