ముఖ్యమంత్రీ మౌనమేలా?

0
279
డీజీపితో పొంతనలేని ప్రకటనలు – పౌరహక్కుల సంఘం ధ్వజం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలో ఇటీవల జరిగిన పోలీసు కాల్పుల్లో 23 మంది మావోయిస్టులు, 9 మంది సాధారణ ఆదివాసీలు మరణించారని, ఈ ఘటనలపై  ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేడంగి చిట్టిబాబు ప్రశ్నించారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ తాను మాట్లాడకుండా డిజిపి సాంబశివరావుతో  పొంతన లేని ప్రకటనలు చేయించారని విమర్శించారు. మావోయిస్టు పార్టీ కార్యకర్త మున్నా అలియాస్‌ పృధ్వీ సంస్మరణ సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ ప్రసంగాన్ని వక్రీకరిస్తూ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై పోస్టర్‌లు వేయడం వెనుక ముఖ్యమంత్రి అనుమతి ఉందని ఆరోపించారు. దీనికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పౌర హక్కుల ఉద్యమంపై అణచివేత పరోక్షంగా హక్కులపై అణచివేతేనని అన్నారు. పోలీసు అధికారుల సలహాలు విని నాగరికతను అగౌరవ పాలు చేయొద్దని సూచించారు. పౌర హక్కుల సభల వద్ద మావోయిస్టు బాధిత ప్రజలతో ధర్నాలు, నిరసనలు కార్యక్రమాలు నిర్వహించడం తగదన్నారు. మావోయిస్టు బాధిత ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడంలో తప్పులేదని, అయితే తమ సభల వద్ద నిరసనల కార్యక్రమాలను చేయించడమే సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు ఓగూరి బాలతాజీ రావు, కార్యదర్శి జిల్లేళ్ల మనోహర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లి చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.