ముగిసిన అంగన్‌వాడీ జాతీయ మహాసభలు

0
112
-ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎంపిక
-జాతీయ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉషారాణి, సింధూ
గోదావరి జిల్లాల రుచులతో ఆతిధ్యం అదరహో
రాజమహేంద్రవరం, నవంబర్‌ 20: చారిత్రక రాజమహేంద్రవరంలో ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ తొమ్మిదో జాతీయ మహాసభలు బుధవారంతో ముగిశాయి. ఈ నెల 17వ తేదీన నగరంలోని రివర్‌బే ¬టల్‌లో ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ జాతీయ మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఆదివారం ఉదయం పది గంటలకు దేశంలోని 27 రాష్ట్రాలకు చెందిన సుమారు 800 మంది ప్రతినిధులతో మహాసభలు ప్రారంభం అయ్యాయి. ప్రారంభ సభలో సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌ సేన్‌ ప్రారంభోపన్యాసంతో జాతీయ మహాసభలు ప్రారంభం అయ్యాయి. అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నగరంలో మూడు రహదారుల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్‌ కదం తొక్కారు. రాజమహేంద్రవరం నగరాన్ని ఎరుపెక్కించారు. సోమ, మంగళవారాల్లో గత మూడేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ మరియు హెల్పర్స్‌ చేసిన పోరాటాలు, సాధించిన విజయాలపై సమీక్షించుకున్నారు. అలాగే రాబోయే మూడేళ్లలో సంఘాన్ని పటిష్టం చేసుకోవడంతోపాటు, ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యచరణతోపాటు, కార్మిక చట్టాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వచ్చే ఏడాది జనవరి 8న జరిగే దేశవ్యాప్త సమ్మెకు అంగన్‌వాడీ వర్కర్స్‌ మరియు హెల్పర్స్‌ ఈ సమావేశాల్లో కార్యచరణను రూపొందించారు. ఈరోజు ఉదయం ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ నూతన కమిటీ ఎంపికపై చర్చించారు. మహాసభకు హాజరైన ప్రతినిధులంతా ఏకగ్రీవంగా నూతన జాతీయ కమిటీని ఎంపిక చేశారు. జాతీయ కమిటీ అధ్యక్షురాలుగా ఉషారాణి, జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎఆర్‌ సింధూ, ఉపాధ్యక్షురాలుగా జి.బేబిరాణి, జాయింట్‌ సెక్రటరీగా సుబ్బరావమ్మ, జాతీయ కమిటీ సభ్యులుగా హేమప్రభ, లక్ష్మీ, సుప్రజ, వాణిశ్రీ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు.
గోదావరి జిల్లాల రుచులు అదరహో…
ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ తొమ్మిదో జాతీయ మహాసభలకు విచ్చేసిన వివిధ రాష్ట్రాల మహిళా ప్రతినిధులకు రిసెప్షన్‌ కమిటీ గోదావరి జిల్లాల రుచులతో చక్కని ఆతిధ్యం ఇచ్చారు.నాలుగు రోజులు పాటు వివిధ శాఖాహార, మాంసాహార వంటకాలను సిద్దపరచి అందరి అభిమానాన్ని చూరగొన్నారు.ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా వసతి సౌకర్యాలను సమకూర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here