ముస్లిమ్‌లు వైకాపా  వెంటే ఉంటారు 

0
233
 జమాతే ఇస్లామిక్‌  హింద్‌ నేతల తీరుని ఎండగట్టిన నేతలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 3 : డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముస్లిమ్స్‌ ఉన్నతికి ఎంతో కృషి చేసారని అటువంటి వ్యక్తి తనయుడు  జగన్‌ హయాంలో కూడా ముస్లిమ్స్‌కి న్యాయం జరుగుతుందని అందుకే ముస్లిమ్స్‌  వైకాపా  వెంటే ఉంటారని జిల్లా వక్ఫ్‌ బోర్డు మాజీ చైర్మన్‌ ఎండి కరీం ఖాన్‌,వైకాపా నేతలు  ఎండి ఆరిఫ్‌,ఎండి సిద్దిఖ్‌,షబ్నమ్‌ చెప్పారు. రాజమండ్రి ప్రెస్‌ క్లబ్‌ లో బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లూ బిజెపితో అంటకాగిన చంద్రబాబు నాలుగేళ్లు ముస్లిమ్స్‌ని ఏమాత్రం పట్టించు కోకుండా  హఠాత్తుగా ప్రేమ కురిపించడం శోచనీయమన్నారు. జమాతే ఇస్లామిక్‌  హింద్‌ పక్షాన  రఫీక్‌ తదితరులు ముఖ్యమంత్రి  చంద్రబాబుని కల్సి ముస్లిం సమాజం అంతా టిడిపి కి మద్దతిస్తున్నట్లు చెప్పడం దారుణమన్నారు. ఒక ఆధ్యాత్మిక సంస్థగా ఉండాల్సిన జమాతే ఇస్లామిక్‌ హింద్‌ సంస్థ ఈవిధంగా రాజకీయాలు చేయడం,  ఇలా తాకట్టు పెట్టడం తగదన్నారు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో మోడీని విమర్శించిన  చంద్రబాబు మళ్ళీ మోడీతో ఎలా జతకట్టారని  వారు నిలదీసారు. ఇన్నాళ్లూ మోడీ వెంట నడిచి హఠాత్తుగా ముస్లీమ్స్‌పై ప్రేమ కురిపించడం వెనుక కపట ప్రేమ అందరికీ తెలుసునని వారు పేర్కొన్నారు. వైకాపా  ఒంటరిగా పోటీ చేస్తూ,ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళ వెంట వెళతామని జగన్‌ స్పష్టం చేసారని వారు పేర్కొంటూ సరే , బిజెపితో కుమ్మక్కయ్యారంటూ వైకాపాను విమర్శించడంలోని ఆంతర్యమేమిటని వారు ప్రశ్నించారు. అసలు రేపొద్దున్న ఎన్నికలయ్యాక చంద్రబాబు మళ్ళీ బిజెపితో కలవరన్న గ్యారంటీ ఉందా అని వారు ప్రశ్నించారు. పొరపాటున చంద్రబాబుని నమ్మితే ఇక అంతేసంగతని షబ్నమ్‌ పేర్కొన్నారు. అందుకే ఎవరూ చంద్రబాబుని నమ్మే స్థితిలో లేరని ఆమె పేర్కొన్నారు.  సాయిబాబ , ఖాన్‌ , డాక్టర్‌ బేగ్‌,వలీ, నయీమ్‌ భాయ్‌, రబ్బానీ,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here