మూడు ముక్కలాట

0
147
మనస్సాక్షి  – 1172
2024 ఎలక్షన్‌ నామ సంవత్సరం.. ఎలక్షన్లు జరగడానికి యింకో అయిదునెలలే టైముంది. ఆపాటికి అన్ని పార్టీల్లో ఎలక్షన్ల హడావిడయితే  మొదలయిపోయింది. యిక సీట్లు ఆశించే వాళ్ళ హడావిడయితే చెప్పనే అక్కరలేదు. అయితే ఈసారి ఎలక్షన్స్‌కో విశేషముంది. సీటు కోసం ప్రతిసారీ పోటీపడే అందరితో పాటు యింకో యిద్దరు కూడా రంగంలోకి దిగారు. వాళ్ళిద్దరూ గిరీశం, వెంకటేశం. అయితే  వాళ్ళిద్దరూ సీటు కోసం పార్టీ జనాల్ని ఎవరినీ అడగలేదు. ఆ ప్రయ త్నాలూ చేయడంలేదు. పార్టీ చేసిన మంచి పనుల గురించి ప్రజల్లోకి వెళ్ళి చెబుతున్నా రంతే. అంతేకాదు. రేపు మళ్ళీ ఆ పార్టీని గెలిపిస్తే ప్రజలకి ఏం మంచి జరుగుతుందనేదీ చెబుతున్నాడు. చాపకింద నీరులా వాళ్ళు చేస్తున్న ఈ ప్రచారం వలన జిల్లాలో పార్టీకి మంచి పట్టొచ్చింది. ఈ విషయం తెలిసి అధిష్టానం అందరినీ పక్కనపెట్టి గంగలకుర్రు సీటు వెంకటేశా నికి యిచ్చేసింది. తర్వాత ఎలక్షన్స్‌లో పార్టీతోపాటు వెంకటేశం గెల వడం, ఆనక వెంకటేశానికి మంత్రి పదవి యివ్వడం జరిగింది.
——–
వెంకటేశానికి జరిగిందంతా ఓ కలలా ఉంది. లేకపోతే ఏమాత్రం అనుభవం లేని తనకి సీటు రావడం ఏంటో ఆనక మంత్రి పదవి రావడం ఏంటో ఆశ్చర్యంగా ఉంది. యింకోపక్క ప్రభుత్వం కూడా కొత్త కొత్త ప్రయోగాలకి శ్రీకారం చుడుతోంది. దాంట్లో భాగంగా రాష్ట్ర మంతా అభివృద్ధి చేయడానికి రకరకాల ప్రయత్నాలు మొదలెట్టింది. రాజధాని ఒక్కచోట ఉండడం కాకుండా ఎక్కువ చోట్ల ఉండడం ద్వారా అదేదో సాధించవచ్చని నిపుణులు తేల్చారు. దాంతో ఓ కమిటీ వేయడం, ఆ కమిటీ రకరకాల సర్వేలు చేసి చివరికి అమరావతిలో అసెంబ్లీ ఉంచి ప్రధాన రాజధానిగా చేయాలనీ, వైజాగ్‌లో సెక్రటేరియట్‌ పెట్టి పరిపాలనా రాజధానిగా చేయాలనీ, హైకోర్టు కర్నూలులోపెట్టి  జ్యుడీషియల్‌ రాజధానిగా చేయాలనీ, రాజ మండ్రిని సాంస్కృతిక రాజధానిగా చేయాలనీ, తెనాలిని కళల రాజ ధానిగా చేయాలనీ, చిలకలపూడిని ఆభరణాల రాజధానిగా చేయాలనీ.. యిలా మొత్తం 23 ప్రాంతాల్ని రాజధానులుగా చేయాలనీ నిర్ణయించడం జరిగింది.
——-
గిరీశం మనసు ఉప్పొంగిపోయింది. దానిక్కారణం తన శిష్యుడు వెంకటేశం గురుదక్షిణ సమర్పించుకోవడమే. మామూలుగా అయితే  ఈ పదేళ్ళ నుంచీ ఎలాంటి గురుదక్షిణా యివ్వనే లేదు. అయితే యిప్పుడు మినిస్టర్‌ అయ్యాక వెంకటేశం ఆ గురుదక్షిణేదో యిచ్చాడు. అదీ మంచి కాంట్రాక్టొకటి యిప్పించడం ద్వారా..! అదీ గిరీశం ఆనందానికి కారణం. మొత్తానికి ఆ మర్నాడే గిరీశం ఆ కాంట్రాక్టు  పేపర్లేవో తీసుకుని అమరావతి బయల్దేరాడు.
——-
ఉదయం తొమ్మిదింటికల్లా గిరీశం అమరావతిలో దిగిపోయాడు.తీరా అసెంబ్లీ దాకా వెళ్ళేసరికి ”అబ్బే..యిక్కడుండేది అసెంబ్లీ ఒకటే. సెక్రటేరియట్‌ ఉండే రాజధాని వైజాగ్‌’ అని చెప్పారు. దాంతో గిరీశం నీరసంపడ్డాడు. అయినా ఎలాగూ వచ్చా కదాని సాయంత్రం దాకా ఊరంతా తిరిగి వైజాగ్‌ బయల్దేరాడు.
——-
తీరా వైజాగ్‌లోనూ అదే పరిస్థితి. అక్కడా గిరీశానికి అలాంటి పరిస్థితే ఎదురయింది. తనకి కాంట్రాక్టు వచ్చినట్టు చూపించే పేపర్లు సెక్రటేరియట్‌లో గుమస్తాకి చూపించాడు. అవి చూసి గుమస్తా పెదవి విరిచేసి ”యింతకీ మీరెక్కడ్నుంచి వస్తున్నారు గురూగారూ?” అనడిగాడు. గిరీశం నీరసంగా ”యింకెక్కడ్నుంచీ.. రాజమండ్రి నుంచి. ముందుగా అమరావతి వెళ్ళా. అక్కడ్నుంచి యిక్కడికి వచ్చా” అన్నాడు. దాంతో ఆ గుమస్తా నిట్టూర్చి ”మీకు కాంట్రాక్టు వచ్చింది తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలవీ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ లైబ్రరీలకి సప్లయ్‌ చేయడానికి. అంటే విషయం సాహిత్యానికి సంబంధించిందన్నమాట. అంటే మీరు వెళ్ళవలసింది మన సాహితీ రాజధాని రాజమండ్రికి” అన్నాడు. దాంతో గిరీశం గుర్రుమని ”ఊ.. మళ్ళీ అక్కడేంచెబుతారో” అంటూ బయటికి నడిచాడు.
——-
అసెంబ్లీ సమావేశం మొదలయింది. పార్టీల మధ్య వాదోపవాదా లయితే గట్టిగా జరుగుతున్నాయి. దాదాపు అరుపులూ, కేకలతో అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది. అయితే ఆ అరుపులవీ ఎంతసేపటికీ ఎదుటి పార్టీల్ని విమర్శించే దిశగానే సాగుతున్నాయి తప్ప సమస్యలకి పరిష్కారం దిశగా సాగడంలేదు. యిదేదో దాదాపు ప్రతీ అసెంబ్లీ సమావేశంలోనూ కనిపించేదే. యింతలో ప్రతిపక్షానికి చెందిన ఎల్లయ్య లేచి నిలబడ్డాడు. ”అధ్యక్షా.. చేపలు పట్టే వాళ్ళ కోసం ప్రభుత్వం ఏయే పథకాలు ప్రవేశపెట్టిందీ, అందుకోసం ఎంతెంత ఖర్చుపెట్టిందీ వివరాల కావాలి” అన్నాడు. దాంతో మత్స్యశాఖామంత్రి వెంకటేశం లేచి నిలబడ్డాడు. వెంకటేశం మాట్లాడ్డం మొదలెట్టేసరికి సభ నిశ్శబ్ధ మయింది. దానిక్కారణం వెంకటేశం ఏదయినా సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెబుతాడు…అదీ ఆధారాలతో.. వెంకటేశం ఓసారి అందరివంకా చూసి, అప్పుడు.. ఆ స్టాటిస్టిక్స్‌ అన్నీ యివ్వాలంటే పెద్ద ఫైలే అవుతుంది. సాయంత్రానికల్లా సబ్‌ మిట్‌ చేస్తా” అన్నాడు. అది వినగానే అసెంబ్లీలో అంతా గొల్లుమన్నారు. ”యిదేంటీ.. అంతా ఎందుకలా నవ్వారు?” అని వెంకటేశం తెల్ల మొహం వేశాడు. యింతలో ఎల్లయ్య ”ఏంటీ.. మన చేపల శాఖామంత్రిగారికి మంత్రాలే వన్నా వచ్చా? లేకపోతే మన చేపల రాజ ధాని నుంచి ఆ ఫైలంతా సాయంత్రానికి ఎలా తెప్పిం చేస్తారంట? అదీగాక రేపట్నుంచి మన అసెంబ్లీకి శెలవులు కదా. అంటే యింకో రెండువారాలదాకా ఆ వివరాలు రానట్టే” అన్నాడు. దాంతో ప్రతిపక్ష జనాలంతా బల్లలు చరిస్తే, వెంకటేశం యిబ్బందిగా నవ్వాడు.
——-
ఆ రోజో విశేషం జరిగింది. అమరావతి అసెంబ్లీలో ఓ చారిత్రాత్మక ప్రతిపాదన చేయడం, అదేదో పూర్తిస్థాయిలో అన్ని పార్టీలవాళ్ళ ఆమోదం పొందడం జరిగింది. అధికారపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా మొత్తం అంతా ఓ విషయానికి ఒప్పుకోవడం గొప్ప విశేషమే. యింతకీ ఆ నిర్ణయం.. వారంలో ప్రతీ గురువారం అసెంబ్లీకి శెలవు ప్రకటించాలన్నది..! దానికో కారణం ఉంది. అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యేల మీద రకరకాల కేసులుండడంతో అంతా వారానికోసారి కోర్టుకి హాజరుకావలసి వస్తుంది. అయితే ఆ కోర్టేదో జ్యుడీషియల్‌ రాజధాని కర్నూలులో ఉండడంతో అక్కడికి వెళ్ళవలసివస్తుంది. అదీగాక సదరు కోర్టులో ఈ పొలిటికల్‌ పక్షుల్లో ఎక్కువమంది గురువారం హాజరు కావలసి వస్తుంది. దాంతో వాళ్ళంతా అసెంబ్లీకి డుమ్మా కొట్టేసి మరీ కర్నూలు వెళ్ళవలసి వస్తుంది. అందుకే యిలాంటి చారిత్రాత్మక నిర్ణయం..
——
”అది గురూగారూ.. మొత్తానికి అలాంటి గమ్మత్తయిన కలొ చ్చిందనుకోండి” అన్నాడు వెంకటేశం. ఆపాటికి చుట్ట గుప్పు గుప్పుమనిపించడంలో బిజీగా ఉన్న గిరీశం తలెత్తి ”అయితే  ఈసారి నీ కలలోకి మూడు రాజధానుల రచ్చేదో దూరినట్టుందోయ్‌” అన్నాడు. వెంకటేశం తలూపి ”అయినా గురూగారూ…అందులో అంత తప్పేం ఉందంట? అలా చేయడం వలన అధికార వికేంద్రీ కరణ జరిగి రాష్ట్రమంతా అభివృద్ధి జరుగుతుంది కదా?” అన్నాడు. దాంతో గిరీశం ”నిజమేనోయ్‌… కాన్సెప్ట్‌ మంచిదే. అయితే రాష్ట్రమంతా సమతూకంలో అభివృద్ధి సాధించాలంటే యిలా కాకుండా అన్ని ప్రాంతాల్లోనూ పరిశ్రమలు స్థాపిస్తే  బాగుంటుంది. యింకా నిధుల కేటాయింపు కూడా అన్ని ప్రాంతాలకూ చేస్తే మంచిది. అంతేగానీ యిలా రాజధానుల్ని పెంచేసి నిర్ణయాలొకచోట, అమలొకచోట, న్యాయ వ్యవస్థ యింకోచోట అంటే అదేదో అంత సౌలభ్యంగా ఉండదు. అలాగే అమరావతిలో రాజధాని ప్రారంభించినప్పుడు సదరు అధి కారంలో ఉన్న  పార్టీవాళ్ళు ముందుగానే భూములు చౌగ్గా కొనేసు కున్నారనీ, వాళ్ళని దెబ్బతీయడానికే ఈ మూడు రాజధానుల ప్రతి పాదన’ అని ఎందరో విమర్శించడం ఆలోచించదగిందే. అలాగే ‘ఈ కొత్త రాజధానుల్లో సదరు అధికార పార్టీవాళ్ళు ముందుగానే భూములు కొనేసుకున్నారన్న వాదనల్నీ తోసిపుచ్చలేం. ఏతావాతా చెప్పేదేంటంటే..యిప్పటికయినా ఈ పార్టీలు తమ స్వార్ధాలూ, ఈగోలూ పక్కనపెట్టి ప్రజా శ్రేయస్సు కోసం చిత్తశుద్ధితో ఆలోచించి రాజధాని విషయంలో ముందుకెళితే మంచిది” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here