మూడు రాజధానుల నిర్ణయానికి బ్రేకులు 

0
54
జగన్‌ రాక్షస క్రీడకు ప్రజలే బుద్ది చెబుతారు :జెఎసి
రాజమహేంద్రవరం, జనవరి 25 : ప్రజావ్యతిరేక విధానాలతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాబోయే కాలంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్సీ, జెఎసి నాయకులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రస్తుతానికి బ్రేకులు పడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలిని రద్దు చేస్తామని సిఎం జగన్‌ చెబుతున్న మాటలు అంత సులువు కాదన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు ఎన్‌వి శ్రీనివాస్‌, మేడా శ్రీనివాస్‌, బుడ్డిగ శ్రీనివాస్‌, నల్లా రామారావు, యర్రా వేణుగోపాలరాయుడులతో కలిపి ఆదిరెడ్డి మాట్లాడారు. శాసనమండలిలో ఛైర్మన్‌ షరీఫ్‌ను చుట్టుముట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు పంచాంగం విప్పడం దారుణమన్నారు. ఈ చర్యను జెఎసిగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. శాసనసభ, శాసనమండలి దేని హక్కులు దానికి ఉంటాయని అది కూడా తెలియకుండా జగన్‌ మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ మూడు రాజధానుల బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై ఇష్టమొచ్చినట్టుగా వ్యాఖ్యానిస్తున్నారని మండిపడ్డారు. వైసిపి ఎమ్మెల్యేల నోటికి అడ్డు, అదుపు లేకుండా పోయిందన్నారు. శాసనమండలి రద్దు చేసి రాజధాని బిల్లులను ఆర్డినెన్స్‌ ద్వారా అమలు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. శాసనసభలో వైసిపికి మెజారిటీ ఉన్నంత మాత్రాన అన్ని జగన్‌ అనుకున్నట్టు జరగవన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ వ్యవహారశైలి చాలా విడ్డూరంగా ఉందన్నారు. హుందాతనం లేకుండా ప్రభుత్వం ఏం చెబితే అదే చేస్తున్న ఇటువంటి స్పీకర్‌ను ఇప్పటివరకు తాము చూడలేదన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి యర్రా మాట్లాడుతూ జగన్‌ రాష్ట్రంలో రాజకీయ క్రీడ పేరుతో రాక్షస క్రీడ సాగిస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థ ప్రజలు, ధర్మాన పక్షాన నిలబడుతుందన్నారు. జగన్‌ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రభుత్వానికి సత్తా ఉంటే స్థానిక ఎన్నికలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్‌ మాట్లాడుతూ చట్టాల విలువ తెలియకుండా  వైసిపి ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని, శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఎపి చరిత్రలో నిలిచిపోతారన్నారు.  క్రెడాయ్‌ మాజీ ప్రతినిధి బుడ్డిగ శ్రీనివాస్‌ మాట్లాడుతూ క్రెడాయ్‌ ఛైర్మన్‌ శివారెడ్డి, తనతో మరికొందరు అమరావతి రాజధాని ఉద్యమంలో ఉండడం వల్ల తమ పదవులకు రాజీనామా చేసామన్నారు. క్రెడాయ్‌లో ఉన్న కొందరు వైసిపి వేసే బిస్కట్లకు ఆశపడి ఆ పార్టీకి మద్ధతుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. వైసిపిలో ఉన్న బిల్డర్లు ఇంటింటికి ఇసుక డోర్‌ డెలివరీ అవుతుందో లేదో చూసుకోవాలన్నారు. గత ప్రభుత్వ హాయంలో రూ 2 వేల 700 కొన్న ఇసుకను ఇప్పుడు వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత 5 వేల 500 రూపాయలకు కొనుగోలు చేస్తున్న విషయం వాస్తవం కాదా ? అని నిలదీశారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎన్‌వి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా మూడు రాజధానులను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉద్యమాలు చేస్తున్న నాయకులను హౌస్‌ అరెస్ట్‌ల పేరుతో నిర్భంధించడం ప్రభుత్వానికి సిగ్గు చేటన్నారు. సిపిఐ నగర అధ్యక్షుడు నల్లా రామారావు మాట్లాడుతూ శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌ వంటి వ్యక్తుల వల్ల ఇంకా ప్రజాస్వామ్యం బతికుందని భావించాల్సి వస్తుందన్నారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంలో విలువలను తాకట్టుపెట్టి అమ్ముడుపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు రెడ్డి మణి, కాశీ నవీన్‌, కాంగ్రెస్‌ నాయకులు నలబాటి శ్యామ్‌, గోలి రవి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here