మేం సంయమనం పాటిస్తుంటే…మీరు మిత్ర ధర్మాన్ని విస్మరిస్తారా?

0
329

బిజెపి నేతల తీరుపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అసహనం

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 23 : రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీని ఇస్తారని విశ్వసించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంయమనంతో వ్యవహరిస్తున్నారని, ఏవో కేసులకు భయపడి మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు సత్యదూరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి కేంద్రం అరకొరగా నిధులు విధిలిస్తున్నా తన చాకచక్యంతో రాష్ట్ర వృద్ధి రేటును 11.5 శాతానికి చేర్చారని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మిత్ర ధర్మాన్ని పాటిస్తూ సంయమనంతో ఉంటే నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అసత్యాలు చెప్పడం సరికాదని బిజెపి నేతలకు సూచించారు. రాజధాని నిర్మాణానికి రూ.3,500 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి రూ. 1500 కోట్లు మాత్రమే మంజూరు చేశారని, పూర్తి స్ధాయి రాజధాని నిర్మాణానికి రూ. 42,935 కోట్లు అవసరమన్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి 2014-15 సంవత్సరంలో రూ. 54 వ వేల కోట్ల అంచనాలను కేంద్రానికి నివేదించామని, వాటిలో రూ. 33 వేల కోట్లు భూ పరిహారానికే అవసరమని, మిగిలిన రూ. 21 వేల కోట్లు ప్రాజక్ట్‌ నిర్మాణానికి ఖర్చవుతుందన్నారు. పోలవరం నిర్మాణానికి సంబంధించి కేంద్రం కేవలం రూ. 4 వేల కోట్లు మాత్రమే మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ, 7,900 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ధర్మాన్ని కాపాడాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడంపై ఆదిరెడ్డి స్పందిస్తూ ధర్మాన్ని దేశంలో కాపాడాలా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిందని, ఇపుడు దానిని కొనసాగించే దిశగా అడుగుల వేయడంతో ఏపీకి హోదా ఇవ్వాలని సీఎం చంద్రబాబు పట్టుపడుతున్నారని అన్నారు. చంద్రబాబు చొరవ వలనే సోము వీర్రాజు ఎమ్మెల్సీ అయ్యారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ముంపు మండలాలను ఏపీలో విలీనం చేస్తేనే తాను ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు అప్పట్లో మోడీకి చెప్పడం వలనే ఆ ప్రక్రియ పూర్తయిందని, అది తన వలనే అంటూ సోము వీర్రాజు పదే పదే చెప్పడాన్ని ఆయన ఖండించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బడిలో నడుస్తున్నారని, అసత్య ఆరోపణలు మానుకోకపోతే కాలమే తగిన బుద్ధి చెబుతుందని ఆన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్లు కొమ్మ శ్రీనివాస్‌, కోసూరి చండీప్రియ, మర్రి దుర్గా శ్రీనివాస్‌, పార్టీ నాయకులు షేక్‌ సుభాన్‌, కడితి జోగారావు, పితాని కుటుంబరావు, రెడ్డి సతీష్‌, పెనుగొండ రామకృష్ణ, మరుకుర్తి రవియాదవ్‌, మాలే విజయలక్ష్మీ, తురకల నిర్మల, మేరపురెడ్డి రామకృష్ణ, మిస్కా జోగినాయుడు, ఆర్‌. మధువరప్రసాద్‌, బొచ్చా శ్రీను, వాసంశెట్టి ఏడుకొండలు పాల్గొన్నారు.

వీర పళ్ళంరాజు మృతి పట్ల సంతాపం

సీనియర్‌ పాత్రికేయులు కృష్ణకుమార్‌ తండ్రి వీర పళ్ళంరాజు మృతి పట్ల ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సంతాపం తెలిపారు. విలేకరుల సమావేశానికి ముందు రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సానుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here