మేమీ నగరంలో అంతర్భాగం కాదా? 

0
235
స్వచ్చ రాజమహేంద్రి నినాదం మాకు వర్తించదా?
భయం గుప్పెట్లో షణ్ముఖనగర్‌ వాసులు
Ûరాజమహేంద్రవరం, డిసెంబర్‌ 29 : మేము రాజమహేంద్రవరంలో లేమా? స్వచ్ఛ రాజమహేంద్రి నినాదం మాకు వర్తించదా? అని ప్రశ్నిస్తున్నారు 50 వ డివిజన్‌ షణ్ముఖనగర్‌ వాసులు. జనావాసాల మధ్య చెత్త రీసైక్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో  షణ్ముఖనగర్‌ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తలపెట్టిన స్వచ్ఛ రాజమహేంద్రి కార్యక్రమం ఉద్ధేశ్యం మంచిదే అయినా షణ్ముఖనగర్‌వాసుల పాలిట మాత్రం శాపంగా మారింది. రాజమహేంద్రవరం నగరంలోని ఎంపిక చేసిన  వార్డుల్లో సేకరించిన చెత్తను, కొబ్బరి బొండాలను, రీసైక్లింగ్‌ చేసే యూనిట్‌ను  50 వ వార్డులోని షణ్ముఖనగర్‌లో ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన స్థలంలో దీనిని ఏర్పాటు చేసినా నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగం నుంచి మాత్రం నో అబ్జక్షన్‌ సర్టిఫికెట్‌ను పొందవలసి ఉందని, అయితే అటువంటి సర్టిఫికెట్‌ లేకుండా ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడంతో  దోమలు, పందులు బెడదతో స్ధానికులు ఎనిమిది నెలల క్రితం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్ధానికులు 50 వ డివిజన్‌ కార్పొరేటర్‌ గుత్తుల మురళీధరరావు  దృష్టికి తీసుకురాగా ఆయన కమిషనర్‌, హెల్తాఫీసర్‌లకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికి వారు  పట్టించుకోకపోగా షణ్ముఖనగర్‌లో చెత్త రీ సైక్లింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి చెత్తను భారీగా నిల్వ చేయడంతో అక్కడకు త్రాచుపాములు చేరుతున్నాయన్నారు. కొబ్బరి బొండాల పీచుగా చేసి తడిగా నిల్వ చేయడంతో ఆ వాసనకు పాములు చేరుతున్నాయని స్ధానికులు భయాందోళన చెందుతున్నారు. గత వారం రోజుల వ్యవధిలో చెత్త నిల్వ చేసిన ప్రాంతం నుంచి బయటకు వచ్చిన నాలుగు త్రాచుపాములను స్థానికులు చంపివేశారు. నగరానికి దూరంగా జనావాసం  లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయవలసిన యూనిట్లను నివాస ప్రాంతాల  మధ్య ఏర్పాటు చేయడంపై స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్ధానికుల ఫిర్యాదు మేరకు ఆ ప్రదేశాన్ని కార్పొరేటర్‌, వైకాపా డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధరరావు ఈరోజు పరిశీలించారు. నగర పాలక సంస్ధకు సంబంధం లేని వాహనాలకు ఎంసిఆర్‌ అని రాసుకుని ఉపయోగించడంపై మురళీధరరావు నగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. ఈ యూనిట్‌ నుంచి వస్తున్న దుర్గంధంతో కొత్త వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని స్ధానికులతో పాటు ఆయన కోరారు.