మేముండగా మరెవరి పని లేదు

0
295

మాయమాటలు నమ్మకండి…..నాకు అండగా ఉండండి

తెదేపా కుటుంబంలో సభ్యులుగా చేరండి – శాటిలైట్‌సిటీని మోడల్‌ టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేస్తాం

జూనియర్‌ కళాశాల మంజూరు : జనచైతన్య యాత్రలో సీఎం చంద్రబాబు

రాజమహేంద్రవరం, నవంబర్‌ 19 :  ”మీ అందరికీ ఎల్లవేళలా అండగా ఉంటున్నా…. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణమే ధ్యేయంగా పని చేస్తున్నా …. అందుకోసం  నా వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకున్నాను…. మీ అందరికి ఇంతకు మించి కావలసింది ఏముంది! మీ కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో చేస్తున్నప్పుడు వేరే పార్టీతో పని ఏముంది?….కొందరు దుష్ప్రచారం చేస్తారు…..మాయమాటలు చెబుతారు…మభ్య పెట్టే ప్రయత్నం చేస్తారు….. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేవారు కొందరున్నారు….అవేమీ పట్టించుకోకండి…. వారి మాటలు నమ్మకండి…. సదా మీ సేవలో ఉన్న మాకు అండగా ఉండాలనుకుంటే  ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కుటుంబంలో సభ్యునిగా చేరండి….మీకు మరింతగా మంచిరోజులోస్తాయి” అని పిలుపు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రల్లో భాగంగా ఈరోజు  రూరల్‌ మండలం శాటిలైట్‌సిటీలో పర్యటించిన చంద్రబాబు ఆ ప్రాంతంలో పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు, విన్నపాలు విన్నారు. వినతులు స్వీకరించారు. అనంతరం వారిని ఉద్ధేశించి మాట్లాడుతూ జన చైతన్య యాత్రలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ ఉత్సాహమే తెలుగుదేశం పార్టీకి కొండంత బలమన్నారు. ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అందరి సహాయ సహకారాలు అవసరమని ఆయన కోరారు. అప్పడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. అలాగే శాటిలైట్‌ సిటీ గ్రామాన్ని  రాజమహేంద్రవరం నగరానికి మించిన ఆదర్శ ప్రాంతంగా, సుందరంగా తీర్చిదిద్దుతామని, అందుకు ప్రజలందరి సహకారం కావాలని  ఆయన కోరారు. ఈ గ్రామం అభివృద్ధికి ఓ ప్రత్యేకాధికారిని నియమించి ఎంత ఖర్చయినా రాష్ట్రానికే మోడల్‌ టౌన్‌షిప్‌గా ఆదర్శంగా తీర్చిదిద్దవలసిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.  ఈ ప్రాంతానికి మళ్ళీ వస్తానని, మీ అందరికీ గుర్తుండిపోయేలా, చరిత్రలో నిలిచిపోయేలా కనీస వసతులు మెరుగుపర్చి అందరికీ గృహాలిచ్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన ప్రజల హర్షధ్వనాల మధ్య ప్రకటించారు. అలాగే శాటిలైట్‌ సిటీలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుకు ఆదేశాలిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.  జెండా మోస్తున్న కార్యకర్తలకు అండగా ఉంటా  జెండా మోసిన కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, కార్యకర్తలంతా ప్రజలకు అండగా ఉండాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఈ ప్రాంతంలో పేదలకు నిర్మించిన ఇళ్ళలో కొందరు బినామీ పేర్లతో నివశిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిని ప్రక్షాళన పర్చి అటువంటి వారికి  చెక్‌ పెట్టి అర్హులైన వారి పేర్లమీద పట్టాలిచ్చి ఇక్కడ బ్రహ్మాండమైన మోడల్‌ టౌన్‌ షిప్‌ను నిర్మించి అందరికీ ఇళ్ళు ఇస్తామని సీఎం ప్రకటించారు.   స్ధానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం  ఉపాధి అవకాశాలు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా భవిష్యత్‌లో ఇక్కడే కల్పించడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాంతంలో యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించి  ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు.  ప్రజల ఆనందమే తన ధ్యేయమని, వారి సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి 15 సూత్రాల కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నామని సీఎం తెలిపారు. అర్హులైన వారందరికి సంక్షేమ కార్యక్రమాలు అందేలా చూస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పించడమే ధ్యేయమని, ఈ పాస్‌ ద్వారా చౌక ధర దుకాణాల్లో అక్రమాలను నిరోధించడానికి వీలవుతుందన్నారు. చంద్రన్న బీమా ద్వారా పేదల జీవితాలకు భద్రత ఏర్పడిందని, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సాముహిక మరుగుదొడ్లతో పాటు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నిరుద్యోగుల్ని కూడా ఆదుకుంటామన్నారు.  డిసెంబర్‌ నుంచి ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలు  నగదు రహిత లావాదేవీలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. చౌకధరల దుకాణాల్లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కార్యకలాపాలు నిర్వహణకు చర్యలు తీసుకుంటామని, వచ్చే నెల 1 నుంచి నగదు రహిత సేవలందిస్తామని ఆయన చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి  నెలకు రూ. 10 వేల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు. అంతకు ముందు చంద్రబాబు గ్రామంలో ఎన్‌టిఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శాటిలైట్‌ సిటీలో రూ. 30 లక్షలతో ఏర్పాటు చేసిన రైతు బజార్‌ను , చేపల మార్కెట్‌ను చంద్రబాబు ప్రారంభించారు.