మేము సంఘ విద్రోహులమా?

0
276
గృహ నిర్బంధంపై మానవ హక్కుల సంఘాన్ని, సుప్రీంను ఆశ్రయిస్తాం
రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం.. నిరంకుశ పాలన : జగన్‌ సర్కార్‌పై గోరంట్ల ధ్వజం
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 12 : తామేమీ సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులమని, అటువంటి తమను గృహ నిర్బంధం చేస్తారా? దీనిపై మానవ హక్కుల సంఘానికి, సుప్రీంకోర్టుకి వెళతామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. తెదేపా నాయకులపై, సానుభూతిపరులపై వైకాపా శ్రేణుల దాడులకు నిరసనగా తెదేపా తలపెట్టిన ‘చలో ఆత్మకూరు’ను పోలీసులు అడ్డుకోవడాన్ని ప్రస్తావిస్తూ గుంటూరు జిల్లాలో 144 సెక్షన్‌ కింద పోలీసుల ఆంక్షలు విధించగా ఇక్కడ ఎలాంటి నిషేధాజ్ఞలు లేకున్నప్పటికీ తమను గృహ నిర్బంధం చేయడమేమిటని తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోరంట్ల మాట్లాడుతూ ఏ సెక్షన్‌, ఏ క్లాజ్‌ ప్రకారం తమను హౌస్‌ అరెస్ట్‌ చేసారో చెప్పేవరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తుగ్లక్‌ కూడా కొన్ని మంచి పనులు కూడా చేశాడని, అయితే జగన్‌ పాలన నయా తుగ్లక్‌ను తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులపై  నిన్న పోలీసుల నిర్బంధాలను చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? పోలీస్‌ రాజ్యంలో ఉన్నామా ? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎలాంటి నిషేధాజ్ఞలు లేకుండా, ముందస్తు నోటీస్‌ లేకుండా, తమపై ఎలాంటి కేసులు లేకున్నా తమను గృహ నిర్బంధం చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. తమ హక్కులకు భంగం కలిగించినందుకు తాము మానవ హక్కుల సంఘాన్ని, సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని గోరంట్ల చెప్పారు. ప్రభుత్వ దుర్నీతిని ప్రశ్నిస్తున్నందుకు తెదేపా వారిపైనే గాక మీడియా గొంతు కూడా నొక్కుతున్నారని ఆయన అన్నారు.  కేంద్ర ప్రభుత్వం వద్దంటున్నా, న్యాయస్థానం ఆదేశాలిచ్చినా  పీపీఏలను రద్దు చేశారని, పోలవరం టెండర్లను రద్దు చేశారని, రాజధాని అమరావతి నిర్మాణం నిలిపివేసి ప్రజలకు భవిష్యత్తుపై ఆశల్లేకుండా  చేశారని, జగన్‌ ప్రభుత్వ తీరు కారణంగా అమరావతి నుంచి అనేక సంస్థలు తరలిపోతున్నాయని, పెట్టుబడులు రావడం లేదని, రాజధాని ఇక్కడ ఉంటుందా? లేక తరలిస్తారా? ఉంటే  ఏ విధంగా ఉంటుందో అనే విషయాలపై స్పష్టత లేకుండా చేశారని గోరంట్ల దుయ్యబట్టారు. బడ్జెట్‌పై అవగాహన లేని ముఖ్యమంత్రి అధికారంలో ఉండటతో రాష్ట్రం అధోగతి పాలు కావడం ఖాయమన్నారు. కేంద్రంలో 11.5 శాతం, రాష్ట్రంలో 5 శాతం జిడిపి పెరుగుతోందన్నారు. చివరకు గోదావరికి,కృష్ణమ్మకు వరదలు సంభవిస్తే వాటిని ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అసెంబ్లీలో తమపై ఎదురు దాడి చేస్తూ నోరు నొక్కుతున్నారన్నారు. ఇలాగే పాలన సాగిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల నుంచి ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. పథకాలకు వరుసగా కోతల వేసుకుంటూ పోతు కోతల ప్రభుత్వంగా పాలన సాగిస్తోందని మండిపడ్డారు. అన్ని రంగాల్లోనూ తీవ్రంగా విఫలమైన ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారన్నారు.జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక దోపిడీ నాలుగు రెట్లు పెరిగిందని ఆరోపించారు.  ప్రజలు, ప్రజా ప్రతినిధుల హక్కులను కాలరాసేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ ఉద్యమాలు చేస్తుందని, ఎటువంటి బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసారు. ఎంత నిర్భంధిస్తే అంత ఉవ్వెత్తున తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, తెదేపా నాయకులు, మాజీ కార్పొరేటర్లు నక్కా చిట్టిబాబు, పాలిక శ్రీను, కిలపర్తి శ్రీను,యార్లగడ్డ శేఖర్‌  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here