మైండ్‌ గేమ్‌ ఆడుతున్న బిజెపి

0
172
జగన్‌ నాయకత్వంలోనే ఎంపీలంతా పనిచేస్తాం : ఎం.పి.భరత్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 23 : వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలందరూ కడతేరే వరకు ఆ పార్టీలోనే ఉంటారని మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు వైఎస్‌ఆర్‌సిపిని మరింత బలోపేతం చేయడానికి కృషిచేస్తున్నామని రాజమహేంద్రవరం ఎంపీ, పార్లమెంటరీ పార్టీ చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌ రామ్‌ వెల్లడించారు. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వైసిపి ఎంపీలు తమ పార్టీకి టచ్‌లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై ఆయన పై విధంగా స్పందించారు. వైఎస్‌ఆర్‌సిపి తరుపున గెలిచిన ఎంపీలందరూ కడతేరేవరకు ఇక్కడే ఉంటారని అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ఎంపీలందరూ కలిసి తరచుగా మాట్లాడుకుంటూనే ఉన్నారని దాన్ని దృష్టిలో పెట్టుకునే ఎంపీ సుజనా చౌదరి తమకు టచ్‌లో ఉన్నట్టు భావిస్తున్నారేమోనని వ్యాఖ్యానించారు. బీజేపీ మైండ్‌ గేమ్‌ ఆడుతూ ప్రజల్ని గందరగోళంలో పడేయటానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. బీజేపీలో అసలు వైసిపి ఎంపీలు ఎందుకు చేరతారన్నది కూడా ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలన్నారు. వైసిపి నుంచి గెలిచిన 22 మంది ఎంపీలు సిఎం జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తారని ఈ విషయంపై అంతకంటే చర్చ అవసరం లేదని తేల్చి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here