మైనర్‌  పార్టనర్‌

0
174
మనస్సాక్షి  – 1164
పాతికేళ్ళ తర్వాత.. ఆనాటికి దేశంలో పరిస్థితులు బాగా మారిపోయాయి. టెక్నాలజీ వాడకం యింకా పెరిగింది. దాంతో మనిషి యింకా దిగజారిపోయాడు. గొప్పోడు యింకా గొప్పోడయితే బడుగోడి పరిస్థితి యింకా జారిపోయింది. మిగతా వాళ్ళ పంగతెలా ఉన్నా గిరీశం విషయంలో మాత్రం ఈ మార్పేదో గట్టిగానే వచ్చింది. అసలయితే గిరీశం యింతకు ముందుంటున్న చాటే ఉంటున్నాడు. అయితే అప్పట్లో అది పాతకాలంనాటి అద్దె కొంప. యిప్పుడదే స్థానంలో మూడం తస్తుల బ్రహ్మాండమయిన  బిల్డింగ్‌ వెలిసిందాయె… అదీ సొంతంగా యింకా నెత్తిమీద బొచ్చయితే ఊడలేదుగానీ తెల్లబడింది. యింక నోట్లో ఎప్పుడూ గుప్పు గుప్పుమనిపించే చుట్టపోయింది. ఆ స్థానే పైపొచ్చింది. మొత్తానికి ఆ పొగనయితే వదలడం లేదు. అన్నిటికీ మించి గిరీశం యిప్పుడు కబుర్లు చెప్పే ఆనాటి గిరీశం కాదు. రాష్ట్రంలో ఉన్న మూడు ముఖ్యమయిన  పార్టీలలో ఒకటయిన ఆవు గుర్తు పార్టీలో కీలకమయిన స్థాయిలో ఉన్న నాయకుడు. అలాంటి గిరీశం ఆరోజు కొంచెం టెన్షన్‌ గానే రాబోయే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ రాబోయేది ఎవరో కాదు.  అచ్చంగా ఒకప్పటి తన శిష్యుడు వెంకటేశమే..! అయితే  వెంకటేశం ఒకప్పటిలా తన మాట వినే శిష్యుడు కాదాయె రాష్ట్రంలో ఉన్న యింకో బలమయిన పార్టీ అయిన గేదె గుర్తు పార్టీలో కీలకమయిన స్థానంలో ఉన్న నాయకుడు. అలాంటి వెంకటేశం యిప్పుడా హోదాలో రాబోతున్నాడు.  యిప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా పోటీ నడుస్తోంది మూడు పార్టీల మధ్యే. ఆవు గుర్తు పార్టీ, గేదె గుర్తు పార్టీ కాకుండా  గ్రద్ధ గుర్తు పార్టీ. ఏ పార్టీకీ విడిగా అధికారంలోకొచ్చే అయితే ఆవూ, గేదె గుర్తుల పార్టీల మధ్య కొద్దిగా భావ స్వారూప్యత ఉండడంతో అప్పు డప్పుడూ కలుస్తుంటాయి. అందుకే ఎలక్షన్ల ముందు ఆ రెండు పార్టీల్లో కీలక నేతల భేటీ అనేసరికి అంత ఆసక్తీ, ప్రాధాన్యత ఏర్పడ్డాయి. యిక గిరీశం ఆలోచనలయితే రకరకాలుగా సాగు తున్నాయి. మొత్తం ఉన్న సీట్లు 175లో ఓ నూట పాతిక దాకా తాము పోటీ చేస్తే మిగతా యాభై సీట్లూ ఆ గేదె పార్టీకి  పడేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాడు. గిరీశం యిలా ఆలోచనల్లో  ఉండగానే బయట ఏదో శబ్ధం వినిపించింది. యింతకీ ఆ శబ్ధ మంతా వెంకటేశం బాపతు కాన్వాయిది. కాన్వాయ్‌ అంటే ఆదేదో ప్రభుత్వానిది కాదు. పార్టీలోని వెంకటేశం అభిమానులు, యింకా పార్టీలో ప్రముఖులూ తలో కార్లో వచ్చేశారు. యింతలోనే వెంకటేశం కారు దిగి లోపలకొచ్చేశాడు. అక్కడ్నుంచి యిద్దరూ గిరీశం గారి ఆఫీసరూంలో కూర్చుని మాటల్లో పడ్డారు. కొంచెం సేపు మామూలు మాటలయింతర్వాత  వెంకటేశం ”ఏంటో గురూగారూ.. అప్పుడు రోజులే బాగుండేవనుకోండి. యిప్పుడంతా టెన్షన్‌..టెన్షనే..” అన్నాడు.  గిరీశం అవునన్నట్టుగా తలూపేడు. యింతలో గిరీశం విషయంలోకి వస్తూ ”రేపు ఎలక్షన్లలో పోటీ చేయడం విషయం.. మీ పార్టీకో యాభై సీట్లు యిచ్చేస్తాం” అన్నాడు. దాంతో వెంకటేశం అదేదో అస్సలిష్టం లేదన్నట్టుగా ”ఎక్కడయినా బావగానీ వంగతోట కాడ కాదంటారు కదా. నేను ఎంత మీ శిష్యుడినయినా ఈ విషయంలో మాత్రం మీ మాట వినే ప్రసక్తేలేదు. మా పార్టీకో 85 సీట్లు యివ్వాల్సిందే” అన్నాడు.  దాంతో గిరీశం కూడా గట్టిగానే ”అదేం కుదరదోయ్‌.. అసలు మాకు పబ్లిక్‌లో ఎంత క్రేజుందో తెలుసా?” అన్నాడు.  దాంతో వెంకటేశం ఏవనుకున్నాడో ”ముందసలు అధికారం తెచ్చేసు కుంటే మిగతావన్నీ తర్వాత చూసుకుందాం. మీరో 100 సీట్లలో పోటీ చేయండి. మిగతా 75 సీట్లలో మేం పోటీ చేస్తాం” అన్నాడు. గిరీశం సరేనన్నట్టుగా  తలూపాడు. అక్కడితో ఆ సంకీర్ణానికి సంబం ధించి డీల్‌ ఓకే అయిపోయింది.
——-
ఎలక్షన్లయిపోయాయి. గిరీశం గారి మాటల చతురత, వెంకటేశం తెలివితేటలు, వ్యూహరచన.. అన్నీ కలిసి ఆవు, గేదె పార్టీల కూటమికి బ్రహ్మాండమయిన విజయాల్ని తెచ్చిపెట్టాయి. గిరీశం గారి పార్టీకయితే పోటీ చేసిన 100 సీట్లలో 75 సీట్లొస్తే, వెంకటేశం  గేదె పార్టీకి 75 సీట్లకీ 50 సీట్లొచ్చాయి. యింతవరకూ బాగానే ఉంది గానీ సరిగ్గా అప్పుడే గిరీశానికో కొత్త బాధ మొదలయి పోయింది. ఓసారి ఓటర్లని కసిగా  తిట్టుకున్నాడు. ‘ఛ..ఛ.. ఈ వెధవ జనాలు.. మమ్మల్నింకో పదమూడు సీట్లు గెలిపిస్తే ఎంత బాగుండేదని… యిప్పుడు వాళ్ళని కలుపుకోవాలి. ఎన్నో కొన్ని  పోస్ట్‌లు పడెయ్యాలి’ అనుకున్నాడు. గిరీశం యిలా ఆలోచనల్లో ఉండగానే వెంకటేశం దిగిపోయాడు. అయితే అప్పుడో విశేషం జరిగింది. వెంకటేశం ఏవీ అదేదో పడేస్తే తీసుకొనేలా లేడు. కొంచెం గట్టిగానే ఉన్నాడు. గిరీశం బాగా  ఉదారంగా ”ఏం లేదోయ్‌.. మీకు డిప్యూటీ సీఎం యిచ్చేద్దామను కుంటున్నాం.. యింకా కొన్ని మిని స్టర్‌లు కూడా ” అన్నాడు. అదేదో పండగ చేసుకోండన్నట్టుగా అయితే వెంకటేశం ఒప్పుకోకుండా ”అస్సలు లాభం లేదు గురూగారూ.. మాకు  సీఎం యివ్వాల్సిందే. లేకపోతే నేను మా వాళ్ళకి సమాధానం చెప్ప లేను. కావలిస్తే రెండున్నరేళ్ళ తర్వాత మేం డిప్యూటీకి మారతాం. అప్పుడు మీ వాళ్ళు సీఎం కావచ్చు ” అన్నాడు. అది వినగానే గిరీశం షాకయిపోయాడు. ”అదెలా కుదు రుద్దీ.. మాకు 75 సీట్లొచ్చాయి” అన్నాడు. వెంకటేశం తలూపి ”అలాగయితే మా వాళ్ళంతా శుభ్రంగా ఆ గ్రద్ద పార్టీలోకి జంప్‌ చేసేస్తారు. మీకోసం నేను మాత్రం మీతోనే ఉంటాలెండి.  ప్రభుత్వం ఏర్పాటేదో ఆ గ్రద్ధ పార్టీతో కలిపి మావాళ్ళు చేసేస్తారు” అన్నాడు. దాంతో గిరీశం యింకోసారి  షాక్‌కి గురయ్యాడు. ఆ గ్రద్ధ పార్టీ వాళ్ళతో తాము అస్సలు కలవ లేరు. అదే వీళ్ళయితే కలిసిపోతారు. దాంతో ఏం చేయాలో తోచనట్టు జుట్టు పీక్కున్నాడు.
——-
ఎవరో తట్టి లేపేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే ఎదురుగా గిరీశం. దాంతో వెంకటేశం ”యిదేంటీ.. యిలాంటి కొంపలో ఉన్నానేంటీ.. యింకా నేను సీఎంని కాలేదా?” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ”ఊ.. అయితే దీపావళీ ఏదో  కలలో చేసేసుకున్నావన్నమాట. యింతకీ ఏం కలొచ్చింది?” అన్నాడు. దాంతో వెంకటేశం తన కొచ్చిన కలంతా చెప్పాడు. అంతా విన్న గిరీశం ”అయితే ఈసారి నీ కలలోకి మహారాష్ట్ర సంకీర్ణ రాజకీయాలు దూరినట్టున్నాయి” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టు చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. ”మహా రాష్ట్రలో చూడు.. బీజేపీకీ, శివసేనకీ మధ్య భావ సారూప్యత ఉంది. అందుకే ఆ రెండు పార్టీలూ అప్పుడప్పుడూ కలుస్తుంటాయి. ఈసారి కాంగ్రెస్‌ని ఓడించడానికి మళ్ళీ జత కట్టాయి. గెలిచాయి కూడా యింతవరకూ బాగానే ఉందిగానీ సమస్యంతా అప్పుడే మొదల యింది. వంద సీట్లొచ్చిన బీజెపీ అరవై సీట్లొచ్చిన శివసేనపై ఆధిక్యత ప్రదర్శించే ప్రయత్నం సహజంగా చేసింది. దాంతో శివసేన అసల యిన ఆట మొదలుపెట్టింది. తమకి సీఎం పదవి కావాలనీ, కనీసం రెండున్నర ఏళ్ళయినా ఆ పదవి కావల్సిందేనని తేల్చి చెప్పింది. అలా చేయకపోతే మొత్తం అధికారమే లేకుండా పోయే పరిస్థితాయె. అలా అని అధికారం వదులుకోడానికీ యిష్టం లేదు. దాంతో ఏం చేయాలో తోచక వదులుకోడానికీ యిష్టంలేదు. దాంతో ఏం చేయాలో తోచక కమలనాధులు తలలు పట్టుకుంటున్నారు” అన్నాడు. దాంతో వెంకటేశం ”అయితే ఈ సంకీర్ణాలు అనవసరమంటారా?” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”ఈ సంకీర్ణాల వలన కొంతమేర అస్థిరత అన్నది నిజమే అనుకో. అయితే వీటి వలన పాలించేవాళ్ళు మరీ పేట్రేగి పోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా బ్రేక్‌ పడుతుంటుంది” అన్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here