మోళీల మోడీకి తెలుగోడి సత్తా చూపిద్దాం

0
378

చంద్రబాబు పోరాటంలో సైనికుల్లా పనిచేద్దాం

నగర తెలుగుదేశం సమావేశంలో గన్ని, ఆదిరెడ్డి పిలుపు

రాజమహేంద్రవరం, మార్చి 19 : తెలుగువారిని చిన్న చూపు చూస్తూ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న సీఎం చంద్రబాబుకు తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు అండగా నిలవాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మోడీ చేసిన మోళీలపై తెలుగోడి సత్తా చూపించాల్సిన సమయం ఆసన్నమైందని వారన్నారు. స్థానిక జగదీశ్వరి హోటల్‌లో ఈరోజు నగర తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీ కార్పొరేటర్‌ కురగంటి సతీష్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి గన్ని కృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు, ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, టిడిపి యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కార్యకర్తలకు వివరించడంతోపాటు అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కేంద్రంపై పోరాటం చేస్తున్న తరుణంలో పార్టీ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేస్తోందని, పార్టీ కార్యాచరణ ప్రకారం కార్యకర్తలు, నాయకులు ముందుకు వెళ్ళాలని సూచించారు. గతంలో ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ద్రోహం చేయగా ఇప్పుడు మరో జాతీయ పార్టీ విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోగా ప్రత్యేక హోదా విషయంలోనూ నిలువునా మోసం చేసి దగా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఐక్యతగా పోరాడే దృక్పథం లేకపోవడం దురదృష్టకరమని, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగితే ఏ విధంగా అన్ని పార్టీలూ ఒక్కటవుతాయో చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో జరిగిన డ్రామా మళ్ళీ పునరావృతమవుతోందని, ఆనాడు విభజన విషయంలో కాంగ్రెస్‌, ఈనాడు అవిశ్వాస తీర్మానం విషయంలో భాజపా నాటకాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఒక మిధ్య అని నాడు తెలుగుజాతి ఆత్మ గౌరవం కోసం పార్టీ స్థాపించి సత్తా చూపిన ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ఈనాడు సీఎం చంద్రబాబు అదే ఆత్మ విశ్వాసంతో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి, పవన్‌కళ్యాణ్‌ల వల్లే తెదేపా అధికారంలోకి వచ్చిందని విష్ణుకుమార్‌రాజు చేసిన వ్యాఖ్యలను గన్ని తీవ్రంగా ఖండించారు. ఉదాహరణకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్ధిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత కృషిచేశారో వారికి తెలియదా అని ప్రశ్నించారు. బిజెపికి ఓటు వేయమని ఇంటింటికీ తిరిగి తప్పు చేశామని, తెదేపా మద్దతు లేకుండా బిజెపి గెలవగలదా అని ప్రశ్నించారు. కాకినాడలో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసని, దానిపై బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధమని ఎప్పుడో సవాల్‌ విసిరామన్నారు. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్ధులకు ఆర్థిక సహాయం ఎవరు చేశారో సోము వీర్రాజు చెప్పాలని ప్రశ్నించారు. బిజెపి నేతల కోసం మాట్లాడే హక్కు వారిని గెలపించిన టిడిపి కార్యకర్తలకు ఉందన్నారు. తెలుగు ప్రజలను నమ్మించి మోసం చేసిన మోడీ సర్కార్‌ను తెలుగు జాతి క్షమించబోదని, ప్రతి ఆంధ్రుడు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించాలన్నారు. తెలుగుజాతికి జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చంద్రబాబు కంట తడికి కారణమైన దోషులను వదిలిపెట్టేది లేదని, బాబు పోరాటానికి మేము సైతం అంటూ ప్రతి కార్యకర్త ముందుకు రావాలన్నారు. ప్రతి కార్యకర్త కేంద్రంపై తిరగబడాలని, త్యాగాలకు సిద్ధపడాలని, తెదేపా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజా పక్షమేనన్నారు. ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి నుంచి తెలుగుదేశం ఎందుకు బయటకు రావలసి వచ్చిందో ప్రజలు, కార్యకర్తలు తెలుసుకోవాలని సూచించారు. తెదేపా ప్రభుత్వంపై భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు. గత నాలుగేళ్ళుగా నమ్మించి మోసగించారని, కేంద్రం చెప్పేవన్నీ కేవలం మాటలేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోయినా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి గత నాలుగేళ్ళుగా చంద్రబాబు ఎంతో కృషిచేశారని కొనియాడారు. జరుగుతున్న పరిణామాలను గ్రహించి తెలుగు ప్రజలను దగా చేసిన బిజెపికి బుద్ధి చెప్పాలన్నారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక వ్యక్తి కాదని, ఆయన శక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించి తెలుగు ప్రజలను మోసగించిన వారికి బుద్ధి చెప్పాలని కోరారు. కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో సీఎం చంద్రబాబు తీసుకునే నిర్ణయాలను త్రికరణ శుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, పార్టీ ఆదేశాల మేరకు అందరూ నడుచుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం మహాయుద్ధం జరగబోతోందని, మోడీ నిరంకుశత్వ వైఖరిపై చంద్రబాబు పోరాటానికి దిగారన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై నేరుగా సీఎం చంద్రబాబే స్పందించి తన రాజకీయ నీతిని చాటుకున్నారని కొనియాడారు. వందమంది మోడీలొచ్చినా ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీ పునాదులను ఏ ఒక్కరూ కదిలించలేరని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్థాయి ఏమిటో అందరికీ తెలుసని, ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఏపీకి రావాల్సిన విశాల ప్రయోజనాలపై ప్రస్తుత కష్ట పరిస్థితుల్లో రాజమహేంద్రవం సిటీ నియోజకవర్గంలో నగర కమిటీని నియమించాలంటే పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజం కమిటీ అవసరమన్నారు. అదే విధంగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసి పార్టీని మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చల్లా శంకరరావు మాట్లాడుతూ మోడీ ఏకపక్ష నిర్ణయాల వల్ల దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తిందన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు తిక్క ఉంది గానీ దానికి లెక్క లేదని విమర్శించారు. వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ రానున్న సంగ్రామంలో చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. జిల్లా టిఎన్‌టియుసి అధ్యక్షులు నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ చంద్రబాబు సత్తాను మోడీ తక్కువ అంచనా వేశారని, రానున్న పరిణామాల్లో తెదేపా కార్యకర్తలు సంఘటితంగా అధినేతకు అండగా నిలవాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక దక్షిణ భారతం, ఉత్తర భారతం అంటూ విభజించి దక్షిణాదిని చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్ళ పాలనలో వారి హామీలు కేవలం పేపర్లుకే పరిమితమయ్యాయని, రాష్ట్రాభివృద్ధికి వారి సహకారం శూన్యమన్నారు. చంద్రబాబు, మంత్రి లోకేష్‌ వల్లే రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తుందని, తెలుగు వారి పౌరుషాన్ని చూపించి ఢిల్లీ పునాదులను గడగడలాడించాలని కోరారు. మాజీ కార్పొరేటర్‌ రెడ్డి మణి మాట్లాడుతూ గత ఎన్నికల్లో సిటీ నియోజకవర్గంలో భాజపా అభ్యర్ధిని గెలిపించాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ ఆదేశించడంతో అందరూ కష్టపడి గెలిపించామని, ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌లు, అధ్యక్షులు, కార్యకర్తలు తాజా రాజకీయాలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ చంద్రబాబు నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటామని తెలిపారు. దళితరత్న కాశి నవీన్‌కుమార్‌ ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, పితాని లక్ష్మీకుమారి, తలారి ఉమాదేవి, కోరుమిల్లి విజయశేఖర్‌, కోసూరి చండీప్రియ, గగ్గర సూర్యనారాయణ, తంగేటి వెంకటలక్ష్మి, కొమ్మ శ్రీనివాస్‌, యిన్నమూరి రాంబాబు, బెజవాడ రాజ్‌కుమార్‌, ద్వారా పార్వతి సుందరి, గాదిరెడ్డి పెదబాబు, తంగెళ్ళ బాబి, పెనుగొండ విజయభారతి, సింహ నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మళ్ళ నాగలక్ష్మి, కంటిపూడి పద్మావతి, గరగ పార్వతి, కో-ఆప్షన్‌ సభ్యులు మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, బొమ్మనమైన శ్రీనివాస్‌, మళ్ళ వెంకట్రాజు, మరుకుర్తి రవి యాదవ్‌, బెజవాడ వెంకటస్వామి, జక్కంపూడి అర్జున్‌, పితాని కుటుంబరావు, కంటిపూడి శ్రీనివాస్‌, కూరాకుల తులసి, తలారి భగవాన్‌, తురకల నిర్మల, ఆశపు సత్యనారాయణ, రేవాడ సత్యనారాయణ, షేక్‌ సుభాన్‌, కవులూరి వెంకట్రావు, ఈతలపాటి కృష్ణ, చొప్పెర్ల బ్రహ్మాజీ, పుట్టా సాయిబాబు, జాగు వెంకటరమణ, మేరపురెడ్డి రామకృష్ణ, కర్రి రాంబాబు, మొల్లి చిన్నియాదవ్‌, టేకుమూడి నాగేశ్వరరావు, బిక్కిన రవికిషోర్‌, మధు వరప్రసాద్‌, కె.వి.డి.భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here