యువతను క్రీడా పరంగా ప్రోత్సహించాలి 

0
326
ఓఎన్‌జిసి ఆఫీసర్స్‌ మహిళా అసోసియేషన్‌ అధ్యక్షురాలు దుర్గా భవానీ
రాజమహేంద్రవరం, ఆగస్టు 29 : యువతను క్రీడాపరంగా ప్రోత్సహించాలని ఓఎన్‌జిసి ఆఫీసర్స్‌ మహిళా అసోసియేషన్‌ అధ్యక్షురాలు, రాష్ట్ర స్ధాయి జూనియర్స్‌ బ్యాట్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వాహక కమిటీ అధ్యక్షురాలు దుగ్గిరాల దుర్గా భవానీ పేర్కొన్నారు. స్ధానిక ఆఫీసర్స్‌ క్లబ్‌లో ఈనెల 30 నుంచి నిర్వహిస్తున్న  రాష్ట్ర స్ధాయి జూనియర్స్‌ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌(అండర్‌ 19 బాలురు, బాలికల) క్వాలిఫైయిడ్‌ పోటీలను బుధవారం దుర్గాభవానీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా పుట్‌బాల్‌ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా బ్యాట్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు, టోర్నమెంట్‌ నిర్వాహక కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొడాలి తనూజ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దుర్గాభవానీ మాట్లాడుతూ యువతకు శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. నేటి యువత దురలవాట్లకు బానిసలై శారీరక ఆరోగ్యాన్ని కోల్పోతున్నారని, కావునా యువతను క్రీడలపరంగా ప్రోత్సహించి, వారిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంచాల్సిన బాధ్యత సమాజంలోని అందరిపైనా ఉందన్నారు. ఇటువంటి టోర్నమెంట్‌లు నిర్వహించడం ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంచడదానికి అవకాశం ఉంటుందన్నారు. యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి టోర్నమెంట్‌లు ఉపయోగపడతాయన్నారు.  యువత లక్ష్యాలను ఏర్పర్చుకుని, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అనుకున్నది సాధించగలుగుతారన్నారు. అంకితభావం, చేస్తున్నదానిపై శ్రద్ధ, ప్రణాళిక, హెల్త్‌ ప్లానింగ్‌ ఉంటే దేనినైనా సాధించగలుగుతారన్నారు. బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసారు. కొడాలి తనూజ మాట్లాడుతూ ఆఫీసర్స్‌ క్లబ్‌, కెఎస్‌ఎన్‌ కోర్టు, పిడుగు కోర్టులలో క్వాలిఫయింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గురువారం నుంచి మెయిన్‌ డ్రాలో పోటీలు ఉంటాయని చెప్పారు. బాలురు నుండి 116, బాలికల నుండి 30 ఎంట్రీలు వచ్చాయన్నారు. పోటీలు నిర్వహణకు ఓఎన్‌జిసి, గెయిల్‌ సంస్ధలు సహకారం అందిస్తున్నాయని, కృతజ్ఞతలు తెలియజేసారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భోజన, వసతి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ బ్యాట్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు, జిల్లా ఛైర్మన్‌ తేతలి నారాయణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రస్ధాయి జూనియర్స్‌ బ్యాట్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే వారు తమ ర్యాంకులను మెరుగు పర్చుకోవడం జరుగుతుందని, విజేతలు జాతీయ స్ధాయి పోటీలకు వెళతారని తెలిపారు. నిర్వాహక కమిటీని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు డివివి త్రినాధ్‌, ఈవెంట్‌ కార్యదర్శి బిఎస్‌బి శంకర్‌, సంయుక్త కార్యదర్శి పి రవికుమార్‌, కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు డి శ్రీనివాసరావు, బి వెంకట్‌, డాక్టర్‌ పిడుగు విజయభాస్కర్‌, కోచ్‌ భద్రరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here