రాజదండం-రాజధానికో దండం

0
139
మనస్సాక్షి  – 1174
”గురూగారూ.. మ్యాప్‌లో మనూరిపేరు బ్రహ్మాం డంగా కనిపించాలంటే ఏం చేయాలం టారు?” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆ పాటికి చుట్ట కాల్చుకుంటున్న గిరీశం ”ఏవుం దోయ్‌.. మ్యాప్‌ కొనేసుకుని దాంట్లో మనూరి పేరు స్కెచ్‌ పెన్‌తో రాసెయ్యడమే” అన్నాడు. దాంతో వెంకటేశం  గుర్రుమని ”మరీ అంత వేళా కోళం పనికిరాదు గురూగారూ..” అన్నాడు. దానికి గిరీశం ”లేకపోతే ఏంటోయ్‌… మనూరి పేరు అంతలా మార్మోగిపోవడానికి అక్కడెవరున్నారని.. నువ్వూ, నేనూ యిక్కడ కొచ్చేసేం కదా” అన్నాడు. అంతలోనే మళ్ళీ ”ఓ పని చేయొచ్చు. అక్కడేదయినా అంత ర్జాతీయస్థాయి ఈవెంట్‌ లాంటిది జరగాలి. అయితే మనూళ్ళో ఏం జరగాలన్నా మనూరి ప్రెసిడెంటు రామ్మూర్తి సహాయం ఉండా ల్సిందే. వాడో పట్టాన ఏదీ ఒప్పుకుని చావడు” అన్నాడు. వెంక టేశం తలూపి, పైకిలేచి ”అదంతా నేను చూసుకుంటాలే గురూ గారూ” అంటూ బయటికి, అక్కడ్నుంచి ఎర్రబస్సెక్కి గంగల కుర్రు బయల్దేరాడు..
——-
రామ్మూర్తికి వెంకటేశం అంటే కొంచెం భయముంది. మమూ లుగా అయితే రామ్మూర్తికి ప్రెసిడెంటయ్యే సత్తా లేదు. వేరే  యింకెవరూ పోటీ లేకపోవడంతో ప్రెసిడెంట్‌ అయిపోయాడంతే. అందులోనూ ఊళ్ళో  మంచి పేరున్న గిరీశం, వెంకటేశంలు రాజమండ్రి పోయి సెటిలవడం కలిసొచ్చింది. వాళ్ళెప్పటికయినా తిరిగొచ్చేస్తే తనకి పోటీ అన్న భయం కూడా ఉంది. అలాంటిది ఆరోజు వెంకటేశం రావడంతో రామ్మూర్తి కంగారుపడ్డాడు. కొంచెం సేపు మాటలయ్యాక వెంకటేశం ”యిదిగో రామ్మూర్తీ.. మనూరికి మంచిపేరు తేవడానికి ‘యింటర్నేషనల్‌ యోగా పోటీలు’ మనూళ్ళో నిర్వహిద్దాం” అన్నాడు. దాంతో రామ్మూర్తి ఆశ్చర్యంగా ”యింటర్నేషనలా?” అన్నాడు. వెంకటేశం నవ్వేసి ”అవును. అదేం పెద్ద విషయం కాదు. ఎలాగా నాకు తెలిసిన  ఒకళ్ళిద్దరు ఫారినర్స్‌ని పిలుస్తాను. యిక పోటీల విషయం ఫేస్‌బుక్‌లోపెట్టి దేశంలో అందరినీ పోటీలకి ఆహ్వానిద్దాం” అన్నాడు. రామ్మూర్తి తలూపి ”బాగానే ఉందనుకో. అయితే  నాకో షరతుంది. అలాగ యితే దీనికయ్యే మొత్తం ఖర్చు నేనే ఏర్పాటు చేస్తా” అంటూ తన షరతు చెప్పాడు. అది వినగానే వెంకటేశం తేలిగ్గా ”ఓస్‌ అదెంతపని.. అలాగే” అన్నాడు. అక్కడితో గంగలకుర్రుని అంత ర్జాతీయస్థాయికి తీసుకెళ్ళే ప్రక్రియ ప్రారంభమయింది.
——-
గంగలకుర్రులో ‘యింటర్నేషనల్‌ యగోఆ పోటీలు’ ప్రారంభమ య్యాయి. ప్రారంభోత్సవానికి ఓ మంత్రిగారొచ్చారు. దాంతో మీడియా కవరేజ్‌ బాగా వచ్చింది.  యిక దేశం నలుమూలల నుంచీ రెండొందలమంది దాకా పోటీల్లో పాల్గొనడానికి వచ్చారు. వెంకటేశం ఏర్పాటు చేసిన ముగ్గురు జడ్జీలూ పోటీలు నిర్వహిస్తు న్నారు. పోటీలు జరిగినన్ని రోజులూ మీడియాలో వార్తలు వస్తు న్నాయి. నాలుగోరోజు పూర్తయ్యేసరికి పోటీలు చివరిదశకు వచ్చాయి. ఆపాటికి  పదహారుమంది పోటీలో మిగిలారు. అందులో హారిక ఉంది. యిక అక్కడ్నుంచి పోటీల్లో ఉత్కంఠ పెరిగింది. ఆరోజు జరిగిన పోటీల్లో ఓ ఎనిమిదిమంది తర్వాత రౌండుకి చేరుకోవడం జరిగింది. అందులోనూ హారిక ఉంది. చివరికి ఆ ఎనిమిది మందిలో ముగ్గురిని ఫైనల్‌కి ఎంపిక చేయడం జరిగింది. అందు లోనూ హారిక ఉంది. ఆ ముగ్గురికీ ఫైనల్‌ పోటీ మొదలయింది. జడ్జీలు ఆ ముగ్గురిలో ఒకరయిన రాంబాబుని ”బాబూ.. నువ్వు ఊర్ధ్వపద్మాసనం వేసి యోగనిద్ర చెయ్యి” అన్నాడు. దాంతో రాంబాబు కన్ఫ్యూజ్‌ అయ్యాడు. ‘యిదేంటీ.. తలకిందులుగా శీర్షాసనం వేసి పద్మాసనం వేయడం అంటే ఓకే. అలా చేసి యోగ నిద్రలోకి వెళ్ళడం ఎలా’ అని సందిగ్ధంలో పడిపోయి అదేవీ సరిగ్గా చేయలేకపోయాడు. తర్వాత వంతు శ్రీనివాస్‌కి వచ్చింది. ఈసారి జడ్జీలు శ్రీనివాస్‌ని ”బాబూ.. నువ్వు ఊర్ధ్వ పద్మాసనం వేసి నేతిక్రియ చెయ్‌” అన్నారు. దాంతో శ్రీనివాస్‌ నోరెళ్ళబెట్టాడు. ఈ నేతి క్రియేదో మామూలుగా నిలబడి చేయడమే సర్‌ అలాం టిది తలకిందులుగా పద్మాసనం వేసి ముక్కు ద్వారా ఆ ప్రక్రియ ఎలా చేయాలో అర్థంకాక చేయలేకపోయాడు. యిక చివరగా హారిక వంతు వచ్చింది. జడ్జిలయితే ఓంకార ”యిదిగో చూడమ్మా.. నువ్వు శీర్సాసనం వేసి  ధ్యానం చేసుకో” అన్నారు. హారిక అదేదో చక్కా చేసి పారేసింది. తర్వాత వైనా అనబడే ప్రశ్నల కార్యక్రమం మొద లయింది. ఈసారి జడ్జీలు రాంబాబుని ”భగవద్గీత అంటేనే యోగశాస్త్రం కదా. మరి ఆ భగవద్గీతలో అయిదో అధ్యా యంలో ఏదో శ్లోకం ఏంటో చెప్పు” అన్నారు. దాంతో రాంబాబు నోరెళ్ళ బెట్టాడు. తర్వాత జడ్జీలు శ్రీనివాస్‌ని ”పతంజలి యోగ శాస్త్రానికీ క్వాంటమ్‌ ఫిజిక్స్‌కీ సంబంధం ఏంటి?” అన్నాడు. అసలు శ్రీనివాస్‌కి ముందా ప్రశ్నే సరిగ్గా అర్థమయి చావలే దాయె. జడ్జీలు తర్వాత ప్రశ్నని హారికని అడిగారు. ”రాందేవ్‌ బాబా ఎవరు? (ఎ) అమెరికా అధ్యక్షుడు (బి) ఒక సినిమా (సి) ఒక కారు (డి) ఒక యోగా గురువు” అని. దాంతో హారిక హుషారుగా సమాధానం చెప్పేసింది. దాంతో జడ్జీలంతా హారికని విజేతగా ప్రకటించేశారు.  యింతకీ సదరు హారిక రామ్మూర్తిగారి అమ్మాయి..!
——-
”అది గురూగారూ.. నాకొచ్చిన కల. ఏది ఏవయినా మనం శుభ్రంగా మనూరుపోయి యోగా పోటీలో యింకో  కబడ్డీ పోటీలో పెట్టి వార్తల్లోకి ఎక్కొచ్చినిపిస్తుంది. ఎలాగా ఆ రామ్మూర్తి గారి అమ్మాయిని గెలిపించేస్తే ఖర్చు మొత్తం ఆయనే పెట్టుకుంటా డాయె” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ”ఏది ఏవయినా ఈసారి నీ కలలో బోస్టన్‌ దూరినట్టుందోయ్‌” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం  వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”మరేం లేదోయ్‌.. అధికారం చేతికొచ్చాక జగన్‌ గతంలో పాలించిన పార్టీ ఆనవాళ్ళు లేకుండా చేసే పనిలో పడ్డాడు. ఎన్నో పథకాలకి పేర్లూ, రంగులూ మార్చడం జరిగింది. యింకా బాబుగారి యిల్లు పడగొట్టడం లాంటివి కూడా జరిగాయి. అక్కడితో రివెంజ్‌ల వ్యవహారమేదో ముగిసిపోయిందనే అంతా అనుకున్నారు. అయితే  అప్పుడే అసలయిన కధేదో మొదల యింది. జగన్‌ పాత పాలక పార్టీ వాళ్ళకి దిమ్మ తిరిగే షాకిచ్చే  పనిలో పడ్డాడు. అది మూడు రాజధానుల ప్రతిపాదన. దీని వలన అమరావతిలో అనంతంగా పెరిగిపోయిన భూముల ధరలు అమాంతంగా పడిపోవడం ఖాయం. తద్వారా అక్కడ భూములు కొనుక్కున్న వాళ్ళందరికీ యిబ్బందే. ఈ మూడు రాజధానుల ప్రకటనతో అమరావతిలో ఆందోళనలు ఎక్కువయ్యాయి. యింకా రాష్ట్రవ్యాప్తంగా కూడా నిరసనలు మొదలయ్యాయి. యిక్కడే జగన్‌ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడని పిస్తుంది. ముందుగా తనో ప్రకటన చేస్తున్నాడు. రెండోరోజుకల్లా బొత్సా, ఆ మర్నాడు అంబటి చేత రకరకాల కోణాల్లో ఈ అంశాన్ని సమర్ధించేలా మాట్లాడిస్తున్నారు. యింకోపక్క బుగ్గనలాంటివాళ్ళ మేధో ప్రకటనలు ఉంటూనే ఉన్నాయి. యిక నాలుగోరోజుకి జి.ఎన్‌. కమిటీయో, యింకో బోస్టన్‌ కమిటీయో ఆ ప్రకటనలకి సమ ర్ధింపుగా తమ రిపోర్టులు సమర్పిస్తున్నాయాయె. దాంతో ఓ పక్క ఆందోళనలు జరుగుతున్నా యింకో పక్కన ఈ కమిటీలూ, రిపోర్టులూ అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ఏతావాతా చెప్పే దేంటంటే.. యిందాక నీ కలలో  పోటీలు మొద లవడానికి ముందే విజేత నిర్ణయమైపోయినట్టుగా ఈ మూడు రాజధానుల అంశ మేదో నిర్ణయమైపోయింది. అయితే అదేదో అందరికీ అందంగా.. అదే.. కన్విన్సింగ్‌గా చెప్పడానికి రిపోర్టులన్నీ అచ్చు గుద్దినట్టు యిచ్చే కమిటీల వ్యవహారం. ఎవరి స్వార్ధం కోసం వాళ్ళు ఆడుతున్న ఈ పార్టీల గేమ్‌లో రాష్ట్రానికీ, ప్రజలకీ మాత్రం ఒరిగేదేంలేదు” వాళ్ళల్లో వాళ్ళు కక్ష సాధించుకోవడం తప్ప !
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here