రాజప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

0
459
కాకినాడలో లిఫ్ట్‌ తెగిపడి స్వల్ప గాయాలు – ఫోన్‌లో పలుకరించిన సీఎం చంద్రబాబు
పరామర్శించిన గన్ని కృష్ణ – త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  25 : కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి చెందిన లిఫ్ట్‌ వైర్లు తెగి పడటంతో ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తృటిలో  పెను ప్రమాదం నురచి బయటపడ్డారు. ఈ ఉదయం జరిగిన ఘటనలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌, ఓ ఫోటొగ్రాఫర్‌ కూడా గాయపడ్డారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన నెక్కంటి సీ ఫుడ్స్‌లో పనిచేస్తున్న కొందరు కార్మికులు అస్వస్ధతకు గురి కావడంతో వారు కాకినాడలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  గత రాత్రి గుంటూరు నుంచి వచ్చిన వెంటనే రాజప్ప ఆసుపత్రికి వెళ్ళి బాధితులను పరామర్శించారు. ఈ ఉదయం పెద్దాపురం నియోజకవర్గంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటన ఉండటంతో అక్కడకు వెళ్ళే ముందు ఆయన మరో పర్యాయం బాధితులను పలుకరించేందుకు ఆసుపత్రికి వెళ్ళి లిఫ్ట్‌లో  కిందకి దిగుతుండగా ప్రమాదవశాత్తూ వైర్లు తెగిపడటంతో లిఫ్ట్‌ అదుపుతప్పింది. ఈ ప్రమాదం తర్వాత ఆయనకు అదే ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ నిర్వహించగా ఎక్కడా ఫ్రాక్చర్‌ అయినట్లు నిర్ధారణ కాలేదు.  అయితే ఈ ఘటనలో రాజప్ప నడుం ఒత్తిడికి గురై తీవ్రమైన నొప్పి వచ్చింది. దీంతో ఆయన రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వారు తెలిపారు. అయితే రాజప్ప పెద్దాపురం పర్యటనకు బయలుదేరబోతుండగా వైద్యులు, సహచరులు వారించడంతో ఆయన ఆసుపత్రిలోనే ఉండి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం వైద్యుల సలహా మేరకు విశ్రాంతి కోసం స్వస్ధలం అమలాపురం బయలుదేరి వెళ్ళారు. కాగా రాజప్పను సీఎం చంద్రబాబునాయుడు ఫోన్‌లో పలుకరించి ఘటనపై ఆరా తీశారు. పలువురు మంత్రులు, శానససభ్యులు, శాసనమండలి సభ్యులు, పోలీస్‌ అధికారులు కూడా ఆయనను పలుకరించారు.
గన్ని కృష్ణ పరామర్శ
ఈ ఘటన గురించి తెలియగానే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ కాకినాడ వెళ్ళి రాజప్పను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గన్ని వెంట తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఉప్పులూరి జానకిరామయ్య తదితరులు ఉన్నారు.