రాజమహేంద్రవరంలో 23 నుంచి క్రెడాయ్‌ హొం ఎక్స్‌పో

0
256
ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి బోస్‌
సొంతింటి కల సాకారానికి ఎక్స్‌ పో ఓ సోపానం : బుడ్డిగ, నందెపు
రాజమహేంద్రవరం,ఆగస్టు 20 :  రాజమహేంద్రవరం క్రెడాయ్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఈనెల 23, 24, 25 తేదీల్లో స్థానిక జెఎన్‌రోడ్‌లోని చెరుకూరి వీర్రాజు, సుబ్బలక్ష్మి కన్వెన్షన్‌ సెంటర్లో హొం ఎక్స్‌ పో నిర్వహించనున్నట్లు సంస్థ రాష్ట్ర సలహా కమిటీ చైర్మన్‌ బుడ్డిగ శ్రీనివాస్‌ వెల్లడించారు. నిర్మాణరంగంలో ప్రజలకు నమ్మకమైన సంస్థగా పేరొందిన క్రెడాయ్‌ గృహ నిర్మాణ దారులకు పూర్తిస్థాయి సహకారాన్ని అందించేందుకు ఈ హొం ఎక్స్‌పో నిర్వహిస్తోందని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు జరిగిన విలేరుల సమావేశంలో బుడ్డిగ తెలిపారు. క్రెడాయ్‌ బ్రాండ్‌పై మరింత నమ్మకం పెంచడంతో పాటు ప్రజల సొంత గృహయోగాన్ని నేరవేర్చుకునేందుకు అవసరమైన విధంగా అన్ని రకాల స్టాళ్లను ఎక్స్‌పోలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త ఇల్లు, సొంత ఫ్లాట్‌ పొందేందుకు రియల్టర్లు, బిల్డర్లు, ఫర్నీచర్‌, బ్యాంకు రుణాలు కూడా అందించేలా 100 స్టాళ్లలో ప్రజలకు సేవలందిస్తామన్నారు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలకు ఎక్స్‌పో జరుగుతుందని, ప్రతీ గంటకు ఒక లక్కీడీప్‌తో పాటు చివరిరోజు బంపర్‌ డ్రా కూడా నిర్వహించి బహుమతులు అందిస్తామన్నారు. గతంలో రెండుసార్లు క్రెడాయ్‌ ఆధ్వర్యంలో హొం ఎక్స్‌పోలు విజయవంతంగా నిర్వహించామని,  ఇప్పుడు కూడా అందరి సహకారంతో జయప్రదం చేస్తామన్నారు. రాజమహేంద్రవరం, పరిసర గ్రామాల ప్రజలు సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఎక్స్‌పోను సందర్శించాలని కోరారు. ఇక్కడ క్రెడాయ్‌కు వచ్చే లాభంతో కొంతమూరు జంగాల కాలనీ అగ్ని ప్రమాదంలో గృహాలు కొల్పోయిన బాధితులకు ప్రభుత్వ వాటాగా ఇల్లు నిర్మించేందుకు అవసరమైన సహకారం అందించేందుకు నిర్ణయించామన్నారు. గతంలో పనిచేసిన సబ్‌కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, ఇప్పుడు కార్పొరేషన్‌ కమీషనర్‌గా ఉన్న సుమిత్‌ కుమార్‌ల సహకారంతో సామాజిక బాధ్యతగా అగ్ని ప్రమాద బాధితులకు తమ వంతు సాయం అందిస్తామని తెలిపారు. ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మంత్రులు కురసాల కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పినిపే విశ్వరూప్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, గౌరవ అతిథులుగా ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చియ్య చౌదరి, ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కమీషనర్‌ సుమిత్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ రావిరాల మహేష్‌కుమార్‌, గుడా వైస్‌ చైర్మన్‌ ఆర్‌.అమరేంద్రకుమార్‌ పాల్గొంటారని తెలిపారు. క్రెడాయ్‌ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ భవనాల నిర్మాణాలకు అవసరమైన నాణ్యమైన మెటీరియల్‌, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు అన్ని ఒకే చోట పొందేలా ఈ ఎక్స్‌ పోకు రూపకల్పన చేసామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ఈ ఎక్స్‌పో స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని తెలిపారు. సమావేశంలో క్రెడాయ్‌ ప్రతినిధులు సూరవరపు శ్రీనివాస్‌కుమార్‌, మన్యం ఫణికుమార్‌, కర్రి సోమశేఖర్‌రెడ్డి వేలుమూరి భీమశంకర్‌ రావు, పూడి వెంకట శ్రీనివాసరావు, రెడ్డి రామకృష్ణ, జివివి సుబ్రహ్మణ్యం, ఆకుల రమేష్‌, చిట్టిబాబు, ప్రసాద్‌, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here