రాజశ్యామలం – ప్రజా కోమ

0
206
మనస్సాక్షి  – 1147
వెంకటేశం యూటర్న్‌ తీసుకున్నాడు. అంటే మరేంలేదు. అదేదో రాజకీయాల్లో దున్నేద్దా మనో, లేకపోతే యింకో కలెక్టర్‌ స్థాయి ఉద్యోగం పట్టేద్దామనో అనుకున్నవాడు కాస్తా అవన్నీ మానేసి సొంతూరుపోయి వ్యవసాయం పనిలో పడ్డాడు. యిప్పుడెలాగా ఎలక్షన్లయి పోయాయి.  మళ్ళీ ఎలక్షన్లు రావాలంటే యింకో అయిదేళ్ళు  ఆగాల్సిందే. ఈ అయిదేళ్ళూ గురువుగారి పాఠాలు వింటే మాత్రం ఏ మెదడు వాపో, యింకో మోకాలు వాపో వచ్చె య్యడం ఖాయం. యిలా ఆలోచించి శుభ్రంగా గంగలకుర్రుపోయి వ్యవసాయం పనిలో పడ్డాడు. ముందుగా పొలం వెళ్ళి అక్క డున్న పరిస్థితులవీ పరిశీలించాడు. అక్కడ తన పొలం గట్లవీ జారిపోయి ఉన్నాయి. యింకా పొలం కూడా ఎండిపోయి ఉంది. దాంతో కూలీల్ని పెట్టి అక్కడంతా తవ్వించే పనిలో పడ్డాడు. అప్పుడో విశేషం జరిగింది.  వెంకటేశం పొలం గట్టున కూర్చుని పర్యవేక్షిస్తుంటే కూలీలంతా పొలంలో దిగి తవ్వుతున్నారు. యింతలోనే  గునపానికి భూమిలో ఏదో ఖణేళ్‌మని తగిలింది. దాంతో అక్కడో చిన్నపాటి సంచలనం రేగింది. యింకోసారి గునపం దింపినా అలాంటి శబ్ధమే వచ్చింది. దాంతో ఆ కూలీల్లో సుబ్బన్న గబగబా వెంకటేశం దగ్గరకొచ్చి ”బాబూ.. లోపల లంకెబిందెలో, మరెటో గానీ ఉన్నట్టున్నాయి. మామూలుగా అయితే అయ్యన్నీ పట్టుకెళ్ళి గవుర్మెంటుకి యిచ్చెయ్యాలి. అలా అయితే ఎవరూ తిన్నట్టు కాదు. అందుకే అందులో సగం మీరు తీసుకోండి. మిగతా సగం మేమంతా కలిసి  పంచుకుంటాం” అన్నాడు. ఏవనుకున్నాడో వెంకటేశం ”సరే.. కూలీలంతా హుషారుగా గునపానికి తగిలిందేంటా అని జాగ్రత్తగా బయటికి లాగారు. తీరా చూస్తే అదో చెక్కపెట్టె. చాలా బలంగా ఉంది. ఎన్నో వందల ఏళ్ళ నుంచి భూమిలో ఉండిపోయి నట్టుంది. దాన్ని గట్టుమీదయితే పెట్టారు గానీ ఆ పెట్టె తెరవ డానికి ఎవరికీ ధైర్యం చాలడం లేదు. అందులో కాపలా కాసే  పాముల్లాంటివి ఏవయినా ఉన్నాయా అని వారి భయం. యింతలో వెంకటేశమే ధైర్యం చేసి ఆ పెట్టె మూత తెరిచాడు. చూస్తే లోపల నిధి నిక్షేపా లవీ లేవు. ఓ అమ్మవారి విగ్రహం ఉందంతే..! దాంతో కూలీ లంతా బొత్తిగా నిరాశపడిపోయారు. సుబ్బన్నయితే ”ఈ విగ్రహం మాకొద్దులే బాబూ.. వెండిదో, బంగారందో అయితే తీసుకుందుం. యిదేదో రాతి విగ్రహం. మీరే ఉంచేసుకోండి” అన్నాడు. వెంకటేశం తలూపి ఆ విగ్రహాన్ని పరిశీలనగా చూశాడు. ఎన్నో వందల ఏళ్ళ నుంచీ ఆ పెట్టెలో ఉండిపోయినట్టుంది. అయినా చెక్కుచెదరలేదు. పైగా ఆ విగ్రహంలో జీవకళ ఉంది. దాంతో వెంకటేశం ఆ విగ్రహాన్ని శుభ్రం చేయించి తనింటికి తీసుకు పాయాడు. అదే వెంకటేశం జీవితాన్ని మార్చింది.
——
వెంకటేశానిది మామూలు మెమరీ కాదు. అందరికంటే కొంచెం ఎక్కువే. అదేదో ఆరోజు ఉపయోగపడింది. ఆరోజు యింట్లో కూర్చుని ఆ విగ్రహం గురించి ఆలోచిస్తుండగా హఠాత్తుగా ఫ్లాష్‌లా ఓ విషయం గుర్తొచ్చింది. అది అంతకుముందెప్పుడో తనింటి మిద్దె మీద దొరికిన తాళపత్రాల గురించి. తాతలనాటి ఆ తాళపత్రాల్లో తమ ఊరికి చెందిన రాజకోమలీదేవి అమ్మవారి ప్రస్థావన ఉంది. ఆవిడ చాలా శక్తివంతమయిన దేవతనీ, ఆవిడే ఊరిని రక్షించే దనీ, అయితే అప్పట్లో తురుష్కులు దాడులు చేసి హిందూ దేవా లయాల్ని ధ్వంసం చేస్తుంటే  ఎవరో రాజకోమలీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడికో తరలించారనీ చదివాడు. అదంతా విగ్రహాన్ని ఎక్కడికో తరలించారనీ చదివాడు. అదంతా గుర్తొచ్చేసరికి వెంక టేశానికి ఏదో లింకు దొరికినట్టయింది. అనుమానం లేదు. అప్పట్లో తరలించబడిన ఆ రాజకోమలీదేవి అమ్మవారి విగ్రహమే యిప్పుడు పెట్టెలో దొరికిందని అర్థమయింది. అదీ ఎన్నో వందల ఏళ్ళ తర్వాత..! ఈలోగా ఊళ్ళో వెంకటేశానికి ఎవరో అమ్మవారి విగ్రహం దొరికిందనే వార్త గుప్పుమంది. అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఈలోగా వెంకటేశం ఆ విగ్రహం రాజకోమలీదేవి అమ్మవారిదనీ, ఆవిడ చాలా మహిమలు కలిగిన దేవతనీ, యిదంతా గొప్ప దేవ రహస్యమనీ, ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచమనీ అబ్బులికి ఊదాడు. రహ స్యంగా ఉంచాలనేసరికి అబ్బులు అంత రహస్యంగానూ దానిని ఊరంతా కాల్చేశాడు. దాంతో ఊరందరికీ ఆసక్తి యింకా పెరిగిపోయింది. ఈలోగా వెంకటేశం తన యింటి పక్కనున్న స్థలంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆనక గుడి కట్టించే పనిలోపడ్డాడు. తాము కూడా చందాలిస్తామని చాలామంది ముందుకొచ్చినా వెంకటేశం ఒప్పుకోకుండా మొత్తం ఖర్చంతా తనే పెట్టడం, అందులో అమ్మవార్ని నిలబెట్టడం జరిగి పోయాయి. యిక జనాలు కూడా ఎగబడి మరీ రాజకోమలీదేవి అమ్మవారిని దర్శించుకో డానికి వస్తున్నారు. అయితే అప్పుడు జరిగిన ఓ సంఘటనతో అమ్మవారి పేరు యింకా గట్టిగా మార్మోగిపోయింది. ఊళ్ళో ఏవో చిన్నపాటి సొసైటీ ఎలక్షన్లు జరుగుతుంటే గెలుపుమీద ఏమాత్రం నమ్మకం లేని వీరాస్వామి వచ్చి ఆరోజు అమ్మవారిని దర్శించుకుని, పూజలవీ బలంగా చేయించాడు. తర్వాత ఎలక్షన్లో ఎవరూ నమ్మలేనట్టుగా వీరాస్వామి గెలి చేశాడు. దాంతో ఒక్కసారిగా అమ్మవారి మహి మల గురించి చుట్టుపక్కలంతా పాకేసింది. యిక అక్కడ్నుంచి  అమ్మవారి దర్శనానికి రాజకీయ నాయకుల తాకిడి ఎక్కు వయింది. యింతలోనే జిల్లాలో పంచాయతీ ఎలక్షన్లొచ్చేసరికి పోటీ చేసే అభ్యర్ధులంతా అమ్మవారి దర్శనానికి ఎగబడ్డారు. తర్వాత వారిలో కొందరు గెలవడం, యింకొందరు ఓడిపోవడం జరిగింది. యిక గెలి చినవాళ్ళయితే అంతా రాజకోమలీదేవి అమ్మ మహిమ వలనే తాము గెలిచినట్టుగా చెప్పుకున్నారు. ఓడిపోయిన వాళ్ళయితే ‘మేము ఆయమ్మని దర్శించుకున్నాంగానీ ఆవిడ మీద మనస్ఫూర్తిగా నమ్మకం ఉంచలేక పోయాం. అందుకే ఓడిపోయాం’ అని సరిపెట్టుకున్నారు.  యింత లోనే 2024 అసెంబ్లీ ఎలక్షన్లు రావడం జరిగాయి. అప్పుడో విశేషం జరిగింది. ఓ రోజయితే స్వయానా సీఎం వచ్చి అక్కడ అమ్మవారికి పూజలు జరిపించి, యాగాలవీ చేయించుకుని వెళ్ళడం జరిగింది. అలాగే యింకోరోజు మాజీ సీఎంగారొచ్చి యింకా బలంగా పూజలవీ చేయించడం జరిగింది. తర్వాత ఎలక్షన్లయి పోయాయి. ఫలితాలు వచ్చేశాయి.
——
..అది గురూగారూ.. నాకొచ్చిన కల. ముందర్జంటుగా మన పొలంలో తవ్వేసి ఆ రాజకోమలీదేవి అమ్మవారిని బయటికి తీసేదా?” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”మీతాత వెంకటేశంలాగే నీలోనూ ఆ వేళాకోళం తగ్గలేదు” అన్నాడు. యింతలో వెంకటేశం అనుమానంగా ”అవును గురూగారూ.. నా కలలో చివర్లో అటు సీఎం, యిటు మాజీ సీఎం వచ్చి అమ్మవారికి బలంగా పూజలూ, యాగాలూ చేయించారు కదా. యింతకీ యిద్దర్లో ఎవరు గెలుస్తారు?” అన్నాడు. దాంతో గిరీశం కొద్దిగా ఆలోచించి ”యింకెవరూ.. యిద్దరూ” అన్నాడు. వెంకటేశం అదిరిపోయి అదెలా సాధ్యం అన్నట్టుగా చూశాడు. దాంతో గిరీశం ”అవునోయ్‌.. యిద్దరంటే ఆ యిద్దరు కాదు. నువ్వూ, నీ రాజ కోమలీ దేవి అమ్మవారు అన్నమాట. ఎలాగా ఎలక్షన్లో పోటీ ఆ యిద్దరి లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళలో ఒకరెలాగా గెలుస్తారు. ఒకవేళ  వాళ్ళలా వచ్చి పూజలూ, యాగాలూ చేయించకపోయినా వాళ్ళలో ఒకరు గెలు స్తారు. అయితే వాళ్ళిద్దరూ వచ్చి చేయించిన పూజలూ, యాగాలూ పుణ్యమాని ఆ అమ్మవారి పేరూ. ఆ అమ్మవారిని సృష్టించిన.. అదే.. వెలుగులోకి తెచ్చిన నీ పేరూ మార్మోగిపోతుంది. యింకా తరాలు తిన్నా తరగని సంపదా పొందుతారు. ఏతావాతా విజేతలు మీరు” అన్నాడు. దాంతో వెంకటేశం నోరెళ్ళబెట్టాడు. యింతలో గిరీశం కొన సాగిస్తూ” చిన్న ఫినిషింగ్‌ టచ్‌ యిచ్చి ముగిస్తానోయ్‌.. ఈవియమ్‌ల వలన ఎవరూ ఓడిపోరు. అలాగే యాగాల వలన ఎవరూ గెలవరు. ఏ పార్టీ అయినా గెలిచేదీ, ఓడేదీ నిర్ణయించబడేది ప్రజల మనసులు గెలవడం మీదే” అంటూ యింకో చుట్ట అంటించుకున్నాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here