రాజు రాక – రాజధాని పోక 

0
131
మనస్సాక్షి
రాత్రి తొమ్మిది కావస్తోంది.
రాజమండ్రి రైల్వే స్టేషన్లో అప్పుడే అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తోంది. వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్ళే గోదావరి సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకటో నంబరు ప్లాట్‌ ఫారం నుంచి బయల్దేరుటకు సిద్ధంగా ఉన్నది ఆ అనౌన్స్‌మెంట్‌. ఆ అనౌన్స్‌మెంట్‌ ఏదో పూర్తయిందో లేదో రైలు బయలుదేరింది. సరిగ్గా అప్పుడే  వెంకటేశం ఆదరాబాదరా స్టేషన్లోకి పరిగెత్తుకొచ్చాడు. అంతే కాదు. అప్పుడే స్పీడందుకున్న రైల్లోకి ఎక్కేశాడు. అదీ ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ బోగీలోకి. యింకో అయిదు నిమిషాల్లో సర్ధుకున్నాడు. యింకో పావు గంట తర్వాత టీసీ వచ్చి టికెట్‌ అడగడం జరిగింది. దాంతో వెంకటేశం యిబ్బందిపడి ” అనుకోకుండా బయలుదేరా సార్‌.. ఎంతయితే  అంతకీ రిసీట్‌ రాసెయ్యండి” అన్నాడు. టి.సి. తలూపి ఖాళీగా ఉన్న బెర్త్‌ కోసం రిసీట్‌ రాసిచ్చేశాడు. అక్కడ్నుంచి వెంకటేశం తనకి కేటాయించిన కూపేలోకి వెళ్ళిపోయాడు.
అప్పుడొక్కసారిగా షాకయ్యాడు. దానిక్కారణం అదే కూపేలో మంత్రి సూరిబాబు కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఆ పాటికి సూరిబాబు యింకో ముగ్గురితో మాట్లాడుతున్నాడు. వెంకటేశం సూరిబాబుకి విష్‌ చేసి వెళ్ళి తన బెర్త్‌ మీద కూర్చున్నాడు. యింకో పావుగంట తర్వాత ఆ ముగ్గురూ వెళ్ళిపోయారు. అప్పుడు సూరిబాబు వెంకటేశం వైపు తిరిగి ” ఏం బాబూ హైదరాబాదా?” అన్నాడు. వెంకటేశం తలూపి ” అవున్సార్‌”. అయినా మిమ్మల్ని కలుసుకోవడం  ఆనందంగా ఉంది. ఎప్పుడూ మిమ్మల్ని గురించి వినడమే తప్ప యిన్నాళ్ళకి చూడగలిగా” అన్నాడు ఆరాధనగా. సూరిబాబు నవ్వేసి ” యింతకీ నువ్వేం చేస్తుంటావ్‌?” అన్నాడు.
దాంతో వెంకటేశం ” ఏం లేద్సార్‌… రాజకీయాల్లోకి రావాలని ఆశయితే ఉంది గానీ అదేం కుదరడం లేదు. గిరీశం, వెంకటేశం గారి పేర్లు వినే ఉంటారు. నేను వాళ్ళ మనువడిని లెండి” అన్నాడు. దాంతో సూరిబాబు మొహంలో విస్మయం తొంగి చూసింది. ” ఏంటీ.. నువ్వా కుటుంబం వాడివా… యింకేం తెలివి తేటలకి లోటేం ఉంటుందని” అన్నాడు. వెంకటేశం తలూపి ” ఏమో సార్‌…యింతవరకు నాకయితే సరయిన అవకాశాలే రాలేదు” అన్నాడు. వెంకటేశం మాట తీరది సూరిబాబుకి బాగా నచ్చేసింది. ” అలా నీరసం పడకోయ్‌.. నీకు మంచి అవకాశాలు నేను యిప్పిస్తాగా” అన్నాడు. దాంతో వెంకటేశం మొహం వెలిగిపోయింది. కొంచెం సేపు నడుస్తున్న రాజకీయాల గురించి యిద్దరూ మాట్లాడుకున్నారు. యింతలోనే సూరిబాబు ఏదో గుర్తొచ్చినట్టుగా ” యిదిగో వెంకటేశం.. మేమంతా ఓ విచిత్రమయిన పరిస్థితిలో పడిపోయాం. దాని గురించి నువ్వేవయినా చెప్పగలవేమో చూడు” అన్నాడు. వెంకటేశం అదేంటన్నట్లు ఆసక్తిగా చూశాడు. అప్పుడు సూరిబాబు ” మన రాజధాని అమరావతినే తీసుకో. యిప్పుడక్కడ  అధికారమయితే మా పార్టీకే ఉంది. అయితే సొంతానికి ఆ అమరావతిలోగానీ,ఆ చుట్టుపక్కల గానీ మా పార్టీ వాళ్ళెవరికీ స్ధలాలు, పొలాలు లేవు. వాటిలో చాలా వరకు  యింతకుముందున్న  పార్టీ వాళ్ళవీ, మిగతా రైతులవీ. అంటే ప్రాణం మాదే గానీ శరీరం మాది కాదు అన్నట్టుగా ఉంది పరిస్థితి” అన్నాడు. దాంతో వెంకటేశానికి విషయం అర్ధమయిపోయింది. ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు తట్టిందో అద్భుతమైన  ఆలోచన. అదేదో సూరిబాబుకి చెప్పాడు. అది వినగానే  సూరిబాబు మొహం వెలిగిపోయింది. ఆనందంతో వెంకటేశం కౌగిలించుకున్నంత పనిచేశాడు.
——-
యిది జరిగిన రెండు రోజులకి సూరిబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ‘ రాజధాని కింద అమరావతి అంత సురక్షితం కాదనీ, వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందనీ’ ప్రకటించాడు. తర్వాత యింకో ఫీలరొకటి కూడా జనాల్లోకి వదలబడింది. దగ్గర్లోనే అమరావతి నుంచి రాజధానిని వేరే చోటుకి మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నది ఆ ఫీలర్‌. దాంతో అదేదో సంచలనంగా మారింది. ముఖ్యంగా అమరావతి చుట్టూ స్ధలాలు, పొలాలు ఉన్న రైతులూ, యింకా ఎక్కువ రేట్లు పెట్టి అక్కడ స్ధలాలు, పొలాలు కొన్న వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. ఒకప్పుడు ఎకరం పదో, యిరవై లక్షలో ఉన్న ఆ పొలాలు కాస్తా కోటి దాటిపోయాయి. యిప్పుడీ వార్తలతో ఆ రేట్లేవో క్రమేపీ దిగడం మొదలెట్టాయి. యింకో వారం తర్వాత ఇంకో పార్టీకి చెందిన నేత యింకో ప్రకటన చేయడం జరిగింది. అసలు రాజధాని యిలా ఓ చోట ఉండే కంటే ఓ నాలుగయిదు చోట్లగా బాగుంటుందని, దాని వలన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధికీ అవకాశం ఉంటుందని, దోనకొండ, వైజాగ్‌, కర్నూలు, నెల్లూరు ” యిలా ఓ నాలుగు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న యోచన సాగుతుందని దాని సారాంశం. దాంతో అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందన్న వార్తలకీ యింకా బలం చేకూరినట్టయింది. యింకో పక్క ముఖ్యమంత్రి మాత్రం ఏం  స్పందించడం లేదు.
ఈలోగా  అక్కడ భూముల రేట్లు దారుణంగా పడిపోవడం మొదలెట్టాయి. యింత కాలం ఎంతయినా  సరే కొనేస్తాం అనే వాళ్ళు లేకుండా పోయారు. అంతా తెగనమ్ముకుని బయట పడదామనుకునే వాళ్ళే తప్ప, అసలు కొనే వాళ్ళే లేరు. యింకో పక్క రేట్లు  యింకా యింకా పడిపోవడం మొదలెట్టాయి. అలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు వచ్చి సూరిబాబుని కలవడం జరిగింది.
”సారూ.. అమరావతి చుట్టూ మా పొలాలు రెండొందల ఎకరాల దాకా ఉన్నాయి. మీరే ఏదో రేటిచ్చి తీసేసుకోండి. రేటంటే అప్పట్లా కోటి, కోటిన్నర కాదు” అన్నారా రైతులు. సూరిబాబు తలూపి అయినా అయ్యన్నీ నాకెందుకులెద్దూ.. మళ్ళీ అమ్మితే  నాలుగో వంతు కూడా వచ్చేలా లేదుగా” అన్నాడు. దాంతో వాళ్ళు బతిమాలుతున్నట్టుగా” పోనీ ఆ నాలుగో వంతుకే” అంటే పాతిక లక్షలకి తీసేసుకోండి” అన్నారు. సూరిబాబు ఏదో వాళ్ళ బాధ చూడలేక ఒప్పుకున్నట్లుగా ” సరే వెళ్ళి మా పియ్యేని కలవండి” అన్నాడు. ఆ రైతులంతా ఆనందంగా తలూపారు. అక్కడ్నుంచి భూములు చేతులు మారడం మొదలయింది.
——-
 రెండు నెలలు గడిచాయి.
 అప్పటికీ రాజధాని మార్పు గురించి ఎలాంటి ప్రకటనలూ వెలువడ లేదు. యింతలో ఓ రోజు సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టి ” మాకు ప్రతిపక్షాలంటే చాలా గౌరవం. అలాంటిది టిడిపి  హయాంలో  అమరావతిలో మొదలెట్టిన  రాజధానిని ఎందుకు వేరే చోటుకి మారుస్తాం”? అలాంటిదేం లేదు అని తెగేసి చెప్పేశాడు…!
——-
” అది గురూ గారూ… నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ” అవునోయ్‌.. యిప్పుడంతా చరిత్ర దాని చుట్టూనే తిరుగుతుంది కదా. యింతకు ముందు అధికారంలో ఉన్న పార్టీ అమరావతిలో రాజధాని నిర్మాణంతో  తమ వాళ్ళకి లబ్ధి చేకూర్చారనే అనుమానంతో యిప్పుడు  అధికారంలోకి వచ్చిన పార్టీ తమ వాళ్ళకి లబ్ధి చేకూర్చే దిశగా పావులు కదుపుతోంది అని రాజధాని వేరే చోటుకి తరలించడం లాంటి వార్తలు అందులో భాగమే. అయితే అందరూ తెలుసుకోవలసింది ఏంటంటే.. మొత్తం ఒక రాష్ట్ర సంక్షేమానికీ, భవిష్యత్తుకీ ఆలంబనగా నిలచే రాజధాని నిర్మాలం లాంటి విషయాల్లో  ఏ పార్టీ అయినా తమ వారి ప్రయోజనాల కోసం వ్యవహరించడం సబబు కాదు అంటూ వివరించాడు.
డా.కర్రి రామారెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here