రాజ్యాంగ మూల సూత్రాలపై అవగాహన అవసరం

0
191
అంబేద్కర్‌ వర్ధంతి సభలో ఓఎన్‌జీసి ఎసెట్‌ మేనేజర్‌ శేఖర్‌
రాజమహేంద్రవరం,డిసెంబర్‌ 6 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగ చట్టం మూల సూత్రాలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు ఘనమైన రీతిలో నివాళులర్పించిన వారవుతామని ఒఎన్‌జిసి అసెట్‌ మేనేజర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డిఎంఆర్‌ శేఖర్‌ పిలుపునిచ్చారు. ఒఎన్‌జిసి ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఒఎన్‌జిసి బేస్‌ కాంప్లెక్స్‌లో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర 63వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా 16వ మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం ఈరోజు జరిగింది.  తొలుత డిఎంఆర్‌ శేఖర్‌ సతీమణి డి.దుర్గాభవాని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎంఆర్‌ శేఖర్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ అందరి వాడని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్‌లో దేశాన్ని ఎలా నడిపించాలనే దూరదృష్టితో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం ద్వారా దిశా దశను నిర్ధేశించారని తెలిపారు. సమస్యలను ఎదుర్కొనే వారే ఆలోచించగల్గుతారని, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని నిరాశతో కుంగిపోతే భవిష్యత్‌ ఉండదని అన్నారు. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, అయినా తన లక్ష్యాన్ని వీడకుండా ప్రపంచ మేథావిగా ఎదగగల్గారని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినా నేటికీ రాజ్యాంగ చట్టం మూల సూత్రాలు తెలియకపోవడమంటే జాతి సిగ్గుపడాలని అన్నారు. అంబేద్కర్‌ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించిన జాతీయులంతా తన సామాజికవర్గానికి చెందిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగంపై సరియైన అవగాహన లేకపోవడం వల్లే నేటికీ దేశంలో రెండు గ్లాసుల పద్దతి కొనసాగుతుందని, అంబేద్కర్‌ ఆలోచనా విధానంతో ముందుకు సాగడం వల్లనే భారత దేశంలో మంచి పౌరులుగా ఉండగలని గ్రహించాలని డిఎంఆర్‌ శేఖర్‌ సతీమణి దుర్గా భవాని అన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. సమయం చాలా విలువైనదని, మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యాన్ని నిర్ధేశించుకుని తోటి సామాజికవర్గానికి చేయూతగా నిలవడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళులర్పించిన వారం అవుతామని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం డిఎంఆర్‌ శేఖర్‌ సతీమణి దుర్గా భవాని సైతం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఒఎన్‌జిసి ఆల్‌ ఇండియా ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.సత్యనారాయణ, ప్రసాదరావు, ఒఎన్‌జిసి హెచ్‌ఆర్‌ ఆనంద్‌పాల్‌, పెట్రోలియం మినిస్ట్రీయల్‌ యూనియన్‌ నాయకులు కృష్ణంరాజు, సురేష్‌, ఎఎస్‌టిఒ నాయకులు నాయక్‌, పికె పాండే తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here