రావణాలయం

0
162
మనస్సాక్షి  – 1169
వెంకటేశం ఉన్నట్టుండి దిగ బడ్డాడు. వెంకటేశం రావడం మామూలే గానీ యిలా మధ్యా హ్నం రావడమే ఆశ్చర్యం. ఆపా టికి గిరీశం శుభ్రంగా భోజనం లాగిస్తున్నాడు. వెంకటేశాన్ని చూడ గానే ”రావోయ్‌ రా.. ఉరుము లేని పిడుగులా వచ్చిపడ్డావ్‌?” అన్నాడు. ఈలోగా వెంకటేశం కుర్చీలో సెటిలై ”నా పొలిటికల్‌ ఎంట్రీ విష యంలో ఈరోజు అమీ తుమీ తేలి పోవలసిందే” అన్నాడు. దాంతో గిరీశం తేలిగ్గా ”ఓస్‌ అంతేనా.. అమరావతి వెడతావా.. హైదరా బాద్‌ వెడతావా?” అన్నాడు. వెంక టేశం తల అడ్డంగా ఊపి.. ‘ఉహూ.. వద్దు. ఏకంగా ఢిల్లీయే వెళ్ళిపోతా” అన్నాడు. దాంతో గిరీశం ఆశ్చర్య పోయి ”అదెవరో ఉట్టికెగర లేనమ్మా స్వర్గానికి  ఎగరతేనందట.. అలా ఉందోయ్‌ నీ యవ్వారం” అన్నాడు.  దాంతో వెంకటేశం అసహనంగా ”లేదు గురూగారూ.. ఈ చిల్లర  మల్లరస్థాయి రాజకీయాలు నాకొద్దు. కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలి. ఎలాగా కేంద్రంలో బీజేపీ హవా నడుస్తుంది కదా. అందుకే అక్కడికే పోతానంటుంది” అన్నాడు. ఈలోగా గిరీశం చేతులు కడుక్కొచ్చి, ఎవరికో ఫోన్‌ చేశాడు. అవతల ఎవరో లైన్లోకి రాగానే ”శర్మా నేన్రా.. చిన్న పనుండి చేశా” అన్నాడు. అవతల శర్మ ”ఏంటీ.. చెప్పు” అన్నాడు. అప్పుడు గిరీశం ”చాకులాంటి కుర్రా డొకడున్నాడు. మనోడే.. మనసార్టీ అంటే చాలా అభిమానంలే. పంపించనా” అన్నాడు. దాంతో అవతల్నుంచి శర్మ ”సరే.. ఓ పని చెయ్యమను. రేపు సాయంత్రం అయిదింటికి యిక్కడే ఢిల్లీలో మన పార్టీ ఆఫీసులో ముఖ్యమయిన మీటింగ్‌ ఒకటుంది. దాంట్లో మొత్తం పార్టీలో పెద్దలంతా పాల్గొంటారు. ముఖ్యమయిన అంశాలన్నింటి మీదా చర్చ జరుగుతుంది. ఈ మీటింగ్‌కి మీ వాడొస్తే బాగుంటుంది” అన్నాడు.  అవతల శర్మ లైన్లో ఉండగానే విషయం గిరీశం వెంకటేశానికి చెప్పాడు.  అవతల శర్మ లైన్లో ఉండగానే విషయం గిరీశం వెంకటేశానికి చెప్పాడు. వెంకటేశం వెంటనే ”అలాగే వెడతా. ట్రయినయితే టైం సరిపోదు. విజయవాడ వెళ్ళిపోయి, అక్క డ్నుంచి ఢిల్లీ ఫ్లయిట్‌లో వెళ్ళిపోతా. అలాగయితే ఓ రెండుగంటల ముందే వెళ్ళిపోవచ్చు” అన్నాడు. అదేదో గిరీశం శర్మకి చెప్పడం, దాంతో శర్మ ఆనందపడిపోయి ”శభాష్‌.. మీవాడు నిజంగా చాకులాగే ఉన్నాడు. ప ంపించు” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. యిక ఆ క్షణం నుంచీ వెంకటేశం ఢిల్లీ వెళ్ళే పనిలో పడ్డాడు.
——-
న్యూఢిల్లీ… బీజేపీ పార్టీ కార్యాలయం.. మధ్యాహ్నం మూడున్నర కావస్తుండగా వెంకటేశం అక్కడకొచ్చాడు. శర్మ చెప్పిన ముఖ్య మయిన మీటింగేదో మొదలయ్యేది అయిదింటికి. దానికింకా రెండు గంటల టైముంది. అయితే ఆపాటికే కొద్దిపాటి హడావిడి మొదల యింది. వెంకటేశం నేరుగా వెళ్ళి శర్మని కలుసుకుని తనని పరి చయం చేసుకున్నాడు. అయితే వెంకటేశాన్ని చూడగానే  శర్మ మొహంలో ఒక విచిత్రమయిన భావం కనిపించింది. ”యిదిగో వెంక టేశం.. యింకా మీటింగ్‌ మొదలవడానికి టైముంది కదా. రూంకెళ్ళి డ్రెస్సదీ మార్చుకు రావచ్చు కదా” అన్నాడు.  దాంతో వెంకటేశం ”అబ్బే లేద్సార్‌.. ఫ్లయింట్‌లో రావడం కదా. యిస్త్రీ కూడా నలగ లేదు. ఫరవాలేదు. మీటింగ్‌కి యిలాగే వచ్చేస్తా” అన్నాడు. దాంతో శర్మ కొంచెం ఆశ్చర్యంగా ”ఏంటీ.. యిలాగే వచ్చేస్తావా?” అన్నాడు. వెంకటేశం తలూపాడు. శర్మ యింకేదో అనబోయాడు గానీ లోప ల్నుంచి అమిత్‌షా పిలుస్తున్నారని కబురొచ్చేసరికి ఆదరాబాదరా లోపలికి పోయాడు. వెంకటేశం అక్కడే మిగిలిపోయాడు. అయితే లోపలికి పోయిన శర్మ మళ్ళీ చాలాసేపటికి గానీ బయటికి రాలేదు. అయిదు కావస్తుండగా అప్పుడొచ్చాడు. అప్పుడు గబగబా వెంకటేశం దగ్గరకొచ్చి, మళ్ళీ ఓసారి వెంకటేశం వంక ఎగాదిగా చూసి ”సర్లే.. టైముంది కదా..లోపలకెళ్ళి కూర్చో. వేదిక మీద మన లీడర్స్‌ అంతా కూర్చుని మాట్లాడతారు. యిక కింద కుర్చీల్లో పార్టీలో యితర ప్రముఖులంతా కూర్చుంటారు. ఆ కుడివైపున నాలుగు వరసల్లో నీలాంటి గెస్ట్‌లు కూర్చుంటారు. నువ్వెళ్ళి వాళ్ళలో కూర్చో” అన్నాడు. దాంతో వెంకటేశం తలూపి లోపలికి నడిచాడు. లోపల స్టేజ్‌మీద పార్టీ లీడర్లంతా కాషాయవస్త్రాల్లో ఉన్నారు. యిక ఎడమవైపు కుర్చీల్లో కూర్చున్న పార్టీ ప్రముఖులంతా దాదాపు హుందా అయిన  తెల్ల బట్టల్లో ఉన్నారు. యిక గెస్ట్‌లయితే చిన్న చిన్న చెక్స్‌ లాంటివి ఉన్న చొక్కాలు వేసుకొచ్చారు. అయితే అప్పుడో విశేషం జరిగింది. వెంకటేశం అలా హాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచీ అంతా వెంకటేశాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారాయె. అసలక్కడ ఆ హాల్లో వందలాదిమంది పార్టీ ప్రముఖులున్నారు. మోడీ, అమిత్‌షా లాంటి దిగ్గజాలున్నారు. అయినా అందరి దృష్టీ వెంకటేశం మీదే. అందరూ పదే పదే తనని కళ్ళింత చేసుకుని చూడడం వెంకటేశం కూడా గమనించాడు. దాంతో ఒకింత గర్వంగా కూడా అనిపించింది. యిక వెంక టేశం తన సీట్లో కూర్చున్నాక ఆ పక్క సీట్లలో వాళ్ళు కూడా వెంకటేశం వంక పరిశీలనగా చూస్తున్నారు. యింతలోనే సమావేశం మొదల యింది. వేదిక మీద కూర్చున్న వాళ్ళ మధ్య రకరకాల చర్చలు జరుగుతు న్నాయి.  దేశంలో వేర్వేరు రాష్ట్రా లలో పరిస్థితుల మీద మాట్లాడుతు న్నారు. అలా మాటల మధ్యలో గెస్ట్‌ లున్నవైపు చూసి కూడా మాట్లాడు తున్నారు. అలా మాట్లాడేటప్పుడు వందమందికి పైగా ఉండే ఆ గెస్ట్‌ లలో కూడా మాట్లాడే అవకాశం యివ్వడం మామూలే. అయితే ఆ అదృష్టం వారిలో ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఎందు కంటే అలా అవకాశం వచ్చినోడు పార్టీ లీడర్లందరి దృష్టిలో పడతాడు. యింతలో ఓ విశేషం జరిగింది.చాలా సేపు రకరకాల చర్చలు జరి గాయి. యింతలో అమిత్‌షా రిజర్వేషన్ల విషయంలో పార్టీ ఎలాంటి వైఖరి అవలంభించాలన్న చర్చ లేవదీశాడు. పార్టీ ప్రముఖులు రకరకాల అభిప్రాయాలు వెలిబుచ్చారు. యిక చివరగా అమిత్‌షా గెస్ట్‌ల వరసలో కూర్చున్నవాళ్ళ  వంక చూసి అందులో తనని ఆకర్షిం చిన ఓ వ్యక్తికి మాట్లాడడానికి అవకాశమిచ్చాడు. యింతకీ అంత మందిలో అవకాశం చేజిక్కించుకున్న అదృష్టవంతుడు వెంకటేశం ! దాంతో వెంకటేశం లేచి తన అద్భుతమయిన తెలివితేటలతో ఆ అంశాన్ని గొప్పగా విశ్లేషించి చెప్పాడు. అసలు వెంకటేశం చెప్పిం దాంతో అంతా మంత్ర ముగ్దులై పోయారు. వెంకటేశం మాట్లాడ్డం పూర్తయిన వెంటనే హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది. అమిత్‌షా అయితే శర్మని పక్కకి పిలిచి ”మనక్కావలసింది యిలాంటి కుర్రాడే. ఆంధ్రాలో పార్టీని స్ట్రాంగ్‌ చేయాలి కదా.  అక్కడ మంచి పోస్ట్‌లో పెడదాం” అన్నాడు. శర్మ తలూపాడు.
——-
”గురూగారూ.. రాత్రి అలాంటి కలొచ్చింది. ఎంతయినా నేను కారణజన్ముడినేమో అనిపిస్తుంది. లేకపోతే రాజమండ్రిలో బయలుదేరింది మొదలు రైల్లో, ఆ తర్వాత ఫ్లయిట్‌లో, చివరికి అంతమంది దిగ్గజాలున్న మీటింగ్‌ అంతా నన్ను ఎంతో ప్రత్యేకంగా కళ్ళప్పగించి చూడడమేంటీ.. నేనింకా సెలబ్రిటీనేం కాలేదు కదా..” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ”ఆశకయినా అంతుండా లోయ్‌.. నిన్నే అంతా అంతిదిగా ప్రత్యేకంగా చూడడం వెనక యింకేదో కారణం ఉండుంటుంది. యింతకీ కల్లో నువ్వేం బట్టలు కట్టుకున్నట్టు?” అన్నాడు. దాంతో వెంకటేశం హుషారుగా ”అదే.. నా ఫేవరెట్‌ డ్రస్సుంది కదా. ముదురు చిలకాకు పచ్చరంగు చొక్కా, ఎర్రటి ప్యాంటూ, యింకా పైన మ్యాచింగ్‌ కోసం కుచ్చు టోపీ ధరించా” అన్నాడు. దాంతో గిరీశం ”అదే అసలు సీక్రెట్‌. ఆ దిక్కుమాలిన డ్రెస్సే నిన్ను అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది. అంతమందిలో నీకు అవకాశమూ తెచ్చిపెట్టింది” అన్నాడు. వెంకటేశం అర్థంకానట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం ”మరేంలేదోయ్‌.. ఎక్కడయినా మనం మామూలుగా ఉంటే గుంపులో గోవిందా గానే మిగిలిపోతాం. ప్రత్యేకంగా ఉంటేనే అందరి దృష్టినీ ఆకర్షించేది. యిదంతా ఎప్పట్నుంచో ఫ్రూవ్‌ అవుతూనే ఉంది. అప్పుడెప్పుడో నందినీ శతపతి అనే సాధారణ మహిళ యిందిరాగాంధీ మీద చెప్పు విసిరేసరికి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. అలాగే అప్పట్లో ఎన్టీఆర్‌ని ఎదిరించిన రేణుకాచౌదరి ఆయన దృష్టిలోపడి తర్వాత్తర్వాత పార్టీలో కీలకంగా మారగలిగింది. యిక ప్రస్తుతానికి వస్తే వివాదాస్పదమయిన వ్యాఖ్యలు చేసే ప్రజకీ, వివాదాస్పద సినిమాలు తీసే ఆర్టీవీకీ యిదే వర్తిస్తుంది. వాళ్ళలో ఈ విలక్షణతే ఈరోజు వాళ్ళని సెలబ్రిటీలుగా మార్చేసింది. మంచో చెడో అలాంటి సెన్సేషన్‌ ఏదయినా ట్రై చేయవోయ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం ఆసక్తిగా ఏం చేయాలన్నట్టుగా చూశాడు. దానికి గిరీశం ”ఏవుందీ.. అయోధ్యలో రావణుడికి ఆలయం కట్టించాలి’ అని స్టేట్‌మెంట్‌ యివ్వు” అన్నాడు. దాంతో వెంకటేశం ”యింకేవయినా ఉందా.. పాపులారిటీ మాట దేవుడెరుగు. మొత్తం అంతా వచ్చి వీపు వాయగొడతారేమో” అన్నాడు. దానికి గిరీశం ”రాముడి గుడిలోకి వెళ్ళి దణ్ణం పెట్టుకుని బయటికి వచ్చినోళ్ళు  రావణుడి గుడిలోకి దూరి చెప్పులతో కొట్టడానికి’ అని యింకో స్టేట్‌మెంట్‌ యిస్తావులే. ఈ హడావిడిలో నువ్వు సెలిబ్రటీవి అయిపోతావు” అంటూ నవ్వాడు.
డాక్టర్‌ కర్రి రామారెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here