రావణ పథం

0
565
మనస్సాక్షి -1005
రావణ పథం
కర్రి రామారెడ్డి గారు
 
  ” అబ్బెబ్బే… ఈ వ్యవస్థని బాగు చెయ్యడం నా వల్ల కాదు” అన్నాడు గిరీశం చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ… దాంతో పక్కనున్న వెంకటేశం గిరీశం నోట్లో చుట్టవంక కోరగా చూస్తూ ” ఆ… తెలుస్తుంది లెండి” అన్నాడు. దాంతో గిరీశం గతుక్కుమని ” యిదిగో….నేనంటుంది దీని గురించి కాదోయ్‌… హైదరాబాద్‌లో వర్షం బాధల గురించిలే. అసలీ పరిస్థితికి కారణం ఏంటో తెలుసా? అదేదో ప్రకృతి వైపరీత్యమో, యింకో దేవుడి శాపమో కాదు. కేవలం మన స్వయంకృతాపరాధం.” అన్నాడు. వెంకటేశం అర్ధం కానట్టు చూశాడు. దాంతో గిరీశం ” అవునోయ్‌… ఎంత వర్షం వస్తేనేం… ఆ నాలాలన్నీ సరిగ్గా ఉంటే నీరంతా క్షణాల్లో లాగేస్తుంది. మొత్తం ఆ వ్యవస్ధని నాశనం చేసి పారేస్తే ఏం జరుగుతుందని…కాసులికి కక్కుర్తి పడి ఆ నాలాల మీద అక్రమ కట్టడాలకి అనుమతులిచ్చిన అధికార్లూ, నాయకులూ, వాటిని కట్టిన వాళ్ళూ…అంతా దీనికి బాధ్యులే. చెప్పెదేంటంటే మూలాలు బాగున్నప్పుడే ఏ వ్యవస్థన్నా బాగా నడిచేది” అన్నాడు. వెంకటేశం తలూపి ”అద్సరే గురూ గారూ… మరి నా సంగతి తేల్చండి” అన్నాడు. దాంతో  గిరీశం ఏవుందోయ్‌….ఈ మూలాల మీదే ప్రశ్నలాగించేద్దాం. రాజకీయాల్లో పైకి రావాలంటే కొన్ని పద్ధతులున్నాయి. ముందుగా ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజాసేవ చేపట్టాలి. అప్పుడు ప్రజల్లో మంచి పేరొస్తుంది. అలా ప్రజల్లో మంచి పేరొచ్చాక అప్పుడో మంచి పార్టీలోకి వెళ్ళాలి. యిదంతా మూలాలు అనబడే పునాదులు బలంగా వేసుకునే ప్రయత్నం. అలా అయితేనే భవిష్యత్తు బాగుండేది. యిదంతా సాంప్రదాయ వ్యవహారం అనుకో. అలాక్కాకుండా రాజకీయాల్లో పైకి రావడానికి షార్ట్‌కట్‌లు అనబడే అడ్డదారులేవయినా ఉన్నాయా? ” అంటూ అడిగాడు. దాంతో వెంకటేశం ఆటోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తున్నవాడల్లా హఠాత్తుగా ఏదో తట్టినట్టు ” అయితే ముందుగా మీకో ఊహలాంటిది  చెబుతా. సమాధానం అందులోనే ఉంటుంది” అన్నాడు. గిరీశం తలూపి ‘యింకెందుకాలస్యం? కానియ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం గిరీశం గారు వదులుతున్న చుట్ట పొగ వంక చూస్తూ అలా అలా ఊహలోకి తీసుకెళ్ళిపోయాడు.
 
   ఆ రోజక్కడో ప్రెస్‌  మీట్‌ జరుగుతోంది. దానిని ఏర్పాటు చేసింది వెంకటేశం. అందరూ వచ్చాక వెంకటేశం మాట్లాడడం మొదలెట్టాడు. ” నేనేదో నాకొచ్చిన గొస్ప గొప్ప ఆలోచనలన్నీ పత్రికలకి పంపితే వేస్తారా! అలాగే రైట్‌ టూ యిన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద సంపాదించిన సమాచారం యిచ్చినా వేయరే….. మీకుండే యిబ్బందులు మీకుంటాయి కదా. అయినా మీరంటే నాకు గౌరవం. యిప్పుడు నా మనసులో భావాన్ని చెప్పడానికి దారి కూడా మీరే. అందుకే ఈ ప్రెస్‌మీట్‌” అంటూ ఆపాడు. వెంకటేశం ఏం చెపుతాడా అని అంతా ఆసక్తిగా చూడసాగేరు. యింతలో వెంకటేశం మాట్లాడుతూ  ” యూరీలో జరిగిన సంఘటన విషయంలో కొన్ని వాస్తవాలు పక్కదారి పట్టినట్టుగా ఉంది. అది తట్టుకోలేకే ఈ ప్రెస్‌మీట్‌. అక్కడేదో  మన జవాన్లు చనిపోయారని తెగ బాధపడిపోయి  నివాళులు అర్పించేస్తున్నారు. అయినా వాళ్ళు చేసిందేవుందని….తమ డ్యూటీలో ఉన్నప్పుడు పోయారంతేగా. పైగా వాళ్ళ టెన్త్‌ పాసయ్యో…ఫెయిలయ్యో వేరే దారి లేక, ఈ రిస్కు ఉద్యోగానికొచ్చారు. యిక మన జవాన్ల మీద దాడి  చేసింది పాకిస్ధాన్‌ దుండుగులే అని అంటున్నారు. అదెంతవరకు నిజం? వాళ్ళే అని ఎందుకనుకోవాలి? కాశ్మీర్లో ఉండే అమాయక జనాలనెవర్నో ఎన్‌కౌంటర్‌ చేసేసి అక్కడ పారేసి వాళ్ళపక్కన పాకిస్ధాన్‌ ఆయుధాలు ఉంచొచ్చు కదా. ఆ ఆయుధాలు ఎక్కడొచ్చాయీ అంటే గతంలో పాకిస్ధాన్‌  సైనికుడు పట్టుబడినప్పుడు వాళ్ళ దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్నవి కావచ్చు. యిలా పాకిస్ధాన్‌ని యిబ్బంది పెట్టడం వలన ఏం జరుగుతుంది? యిక భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య ఎలా కుదురుతుందని? అన్నాడు. వెంకటేశం చెప్పిందాంతో అక్కడ పెద్ద కలకలం రేగింది. అక్కడికీ విలేకర్లలో ఒకరు ” తమ ప్రాణాలు త్యాగం చేసిన భారతీయ సైనికుల గురించి యిలా మాట్లాడటం, పాకిస్ధాన్‌ని వెనకేసుకురావడం విచిత్రంగా ఉంది” అన్నాడు.దాంతో వెంకటేశం ” యిందులో విచిత్రం ఏముంది! మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఏం…పాకిస్ధాన్‌ వాళ్ళంటే అంత లోకువా? వాళ్ళూ మనలాంటి మనుషులే కదా. అవకాశం దొరికింది కదాని వాళ్ళ మీద నిందలేయడం ఎంతవరకు సబబని ? అన్నాడు. వెంకటేశం ఎంతో ఉద్వేగంగా… వితండంగా చెప్పేదాన్ని అందరూ శ్రద్ధగా రాసుకున్నారు.
  అంతే కాదు… మర్నాడు యిదంతా అన్ని ఛానల్స్‌లో, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. మీడియాలో యిదంతా ప్రముఖంగా వచ్చిన తర్వాత ఓ విశేషం జరిగింది. వెంకటేశానికి రెండు ఫోన్లోచ్చాయ్‌. మొదటిది ఎప్పుడూ ఎవరో ఒకర్ని ఏకిపారేసే ఆర్ణన్‌ గోస్వామి నుంచి. ఛానల్‌కి డిస్కషన్‌కి రమ్మన్నాడు. వెంకటేశాన్ని తెగ అభినందేంచేశాడు. యిక రెండో ఫోన్‌ పాకిస్ధాన్‌ ప్రధాన నవాజ్‌ షరీఫ్‌ నుంచి. నిన్ను చూసి మా దేశం గర్విస్తోంది. నువ్వెప్పుడొచ్చినా మా దేశంలో నీకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం లభిస్తుంది” అన్నది ఆ ఫోన్‌ సారాంశం. యింకో పక్క విమర్శలూ, తిట్లూ వెంకటేశానికి గట్టిగానే వచ్చాయి. అయితేనేం….రాత్రికి రాత్రి, వెంకటేశం జాతీయంగా పాపులరయిపోయాడు. ” అది గురూ గారూ….చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. అంతా విన్న గిరీశం ” శభాష్‌…బాగా చెప్పావోయ్‌…చరిత్రలో మహాత్ముడనిపించుకున్న గాంధీజీకి ఎంత గుర్తింపు ఉందో ఆ గాంధీని చంపిన గాడ్సేకీ అంతే గుర్తింపొచ్చేసింది. అదేదో చెడుగా కావచ్చు గాక. యిక మన రాజకీయాల్ని తీసుకుంటే…. ఎన్నో కష్టనష్టాలకోర్చి  అంచెలంచెలుగా ఎదిగితే ఎప్పటికో గుర్తింపు రావచ్చు. అదే… అడ్డదారిలో ఓ విధ్వంసకర పనో లేకపోతే కొక్కిరాయ్‌ పనో చేస్తే రాత్రికి రాత్రే ఆ గుర్తింపేదో తెచ్చేసుకోవచ్చు. ఓ ఒరిస్సా నాయకుడిని తీసుకుంటే…మూములుగా అయితే ఏ ప్రాధాన్యతా లేకుండా  ఉండిపోవును. అయితే  ఓ సభలో ప్రధానమంత్రి మీద చెప్పు విసరడంతో రాత్రికి  రాత్రే దేశవ్యాప్తంగా పాపులరై పోవడం  జరిగింది. అలాగే అప్పట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పబ్లిక్‌లో  విరుచుకుపడిన ఆవిడ తర్వాత అదే పార్టీలో తొందర తొందరగా మంచి స్ధానానికి ఎదిగిపోయింది. ఏతావాతా రాజకీయాలకీ సంబంధించి ” రాముడు మంచి బాలుడు” టైపులో  ఎదగడం కాకుండా యిలా కొక్కొరాయి దారుల్లో ఎదగడమే   సులువు అంటావ్‌” అన్నాడు.
  వెంకటేశం తలూపి ” అవును గురూ గారూ…. ఆ లెక్కన ఈ మధ్య యూరీ దాడి విషయంలో  పాకిస్ధాన్‌ని తెగ ప్రేమించేస్తూ, వాళ్ళ మీద సింపతీ ఒలకబోస్తున్న  మన నాయకుల్ని  ఈ కేటగిరిలో పారేయొచ్చనిపిస్తుంది” అన్నాడు. గిరీశం తలూపి ” అవునోయ్‌….వాళ్ళని అందులో పారేయొచ్చు. నిన్ను ఈ వారం పాస్‌ కేటగిరీలోనూ పారయొచ్చు” అంటూ పైకి లేచాడు.
– డాక్టర్ కర్రి రామారెడ్డి