రేపట్నుంచి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ 

0
333
బివిఎంలో ఏర్పాట్లు పూర్తి : డివైఇవో అబ్రహ్మాం వెల్లడి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 1 : జిల్లా స్ధాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ – 2016 రేపట్నుంచి నగరంలోని బివిఎం బాలవిజ్ఞాన మందిర్‌(బివిఎం) స్కూల్‌లో జరుగుతుందని డిప్యూటీ విద్యాశాఖాధికారి ఎస్‌ అబ్రహాం వెల్లడించారు. బివిఎం స్కూల్‌లో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అబ్రహాం మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు అవసరమైన ఏర్పాట్లు అన్నీ పూర్తిచేశామని చెప్పారు. హైస్కూల్‌ స్ధాయిలో 6నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులలో నిగూఢంగా దాగివున్న శాస్త్రీయ జిజ్ఞాసను వెలికి తీయడానికి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ను కేంద్రప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ నిర్వహిస్తుందన్నారు. ప్రతీ స్కూల్‌నుంచి ఇద్దరేసి విద్యార్దులు ఇన్‌స్పైర్‌లో వారు రూపకల్పన చేసిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారన్నారు. ప్రతి స్కూల్‌ నుంచి 10 మంది విద్యార్ధులు తమ ప్రాజెక్టులను కేంద్రప్రభుత్వ శాఖకు పంపితే వాటినుంచి రెండేసి ప్రాజెక్టులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఎంపికయిన విద్యార్ధి తన ప్రాజెక్టు తయారు చేయడం కోసం కేంద్రమే రూ.5వేలు విద్యార్ధి బ్యాంక్‌ ఖాతాకు అందజేస్తుందన్నారు. మానవ వనరులను, భౌతిక వనరులను అనుసంధానం చేస్తూ దేశాభివృద్ధికి పాటుపడే యువతను తయారు చేయడానికి, మానవ మేధస్సును, సంక్లిష్ట సైన్సు సమస్యలను పరిష్కరించడానికి, భావితరాలను టెక్నోరేట్స్‌గాను, లీడర్స్‌గాను తయారు చేయడానికి ఇన్‌స్పైర్‌ నిర్ధేశించబడిందన్నారు. ఇటువంటి ఎగ్జిబిషన్‌లను విద్యార్ధులు సందర్శించడం ద్వారా వారుకూడా స్ఫూర్తి పొందుతారన్నారు. ఇటీవల సైన్స్‌ ఎక్స్‌ప్రెస్‌ సందర్శన సదర్భంగా రాజమండ్రి ప్రభుత్వ బాలికల హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న దేవి అనే విద్యార్ధిని పదార్ధాలు తిన్న తర్వాత ప్లేట్లను శుభ్రం చేసే ప్రక్రియలో వాటి శుభ్రతను ఖచ్చితంగా తెలుసుకునేందుకు ఏదైనా పరికరం రూపొందిస్తే, దాన్ని ఎంతవరకు శుభ్రపరిచింది తెలుసుకోవడం ద్వారా 90శాతం వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఇచ్చిన సూచనను కేంద్రం పరిగణలోనికి తీసుకుని ఆమెకు రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్‌ను బహుకరించనున్నారని వెల్లడించారు. ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ప్రదర్శనకు జిల్లాలోని 26 మండలాల నుంచి 524 మంది అవార్డీలు పాల్గొని వారి యొక్క ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని వెల్లడించారు. 524 మందిలో 10శాతం మంది రాష్ట్ర ప్రదర్శనకు ఎంపిక అవుతారని, రాష్ట్ర ప్రదర్శనలో ఉత్తమ ప్రదర్శనలు జాతీయ ప్రదర్శనకు ఎంపిక అవుతాయని తెలిపారు. ప్రదర్శినను పరిశీలించేందుకు రాష్ట్ర స్ధాయి నుంచి ఇద్దరు పర్యవేక్షకులు విచ్చేస్తారని, అలాగే ప్రభుత్వ కళాశాలల నుంచి 8 మంది జడ్జిలుగా హాజరై ఉత్తప ప్రదర్శనలను ఎంపిక చేస్తారని తెలిపారు. ప్రారంభకార్యక్రమానికి జిల్లా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు హాజరవుతారని వెల్లడించారు. ప్రదర్శన తిలకించడానికి రేపు అర్బన్‌లోని స్కూల్‌ విద్యార్ధులకు అనుమతిస్తున్నామని, అలాగే మిగిలిన రెండు రోజులు ఇతర మండలాల విద్యార్ధులను అనుమతిస్తామన్నారు. రోజుకు 10వేల మంది విద్యార్ధులు ఈ ప్రదర్శన తిలకించనున్నారన్నారు. విద్యార్దులతో పాటు, పెద్దవారు కూడా ఈ ప్రదర్శన తిలకించవచ్చని తెలిపారు. విలేకరుల సమావేశంలో రూరల్‌ ఎంఇవో నరసింహారెడ్డి, బివిఎం ప్రధానోపాధ్యాయులు మూర్తిలు పాల్గొన్నారు.